logo

మాటల్లో కాదు...చేతల్లో చూపుతా..

‘విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడి సమస్యలు నాకు తెలుసు. క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల్లో పరిస్థితులను మెరుగుపరచటానికి ప్రయత్నిస్తా.

Updated : 02 Jul 2024 04:45 IST

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
నా హనీమూన్‌కు విశాఖకే వచ్చా
నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ
బాధ్యతలు స్వీకరించిన శంఖబ్రత బాగ్చీ

న్యూస్‌టుడే, ఎం.వి.పి. కాలనీ

‘విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడి సమస్యలు నాకు తెలుసు. క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల్లో పరిస్థితులను మెరుగుపరచటానికి ప్రయత్నిస్తా. అయితే మాటల్లో కాకుండా చేతల్లో చూపుతా’నని నగర నూతన పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ అన్నారు. సోమవారం ఉదయం పోలీసు కమిషనరేట్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

  • జాతీయ వైద్యుల దినోత్సవం రోజున బాధ్యతలు స్వీకరించటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. విశాఖ పోలీసు కమిషనర్‌గా పనిచేయటం గర్వంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
  • విశాఖలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు మొదటి ప్రాధాన్యం ఇస్తా. పోలీసులు ప్రజాసేవ చేయటానికి ఉన్నామని గుర్తించాలి. పోలీసుస్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా వ్యవహరించాలి. సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నిజాయతీగా పనిచేయాలి. 
  • నగర పోలీసు కమిషనరేట్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది సంక్షేమంపై దృష్టిసారిస్తా. 24×7 నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి అన్ని వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తా.
  • నగర ప్రజలు తమ సమస్యలు, సమాచారం తెలియజేయాలంటే 79950 95799కి ఫోన్‌ చేసి చెప్పవచ్చు. రోజంతా ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటాం.
  • నాకు వివాహమైన తర్వాత హనీమూన్‌ ఎక్కడ చేసుకోవాలని అనుకున్న సమయంలో చాలా మంది స్విట్జర్లాండ్‌ అని సలహా ఇచ్చారు. అయితే విశాఖను ఎంపిక చేసుకున్నా. హిల్‌ స్టేషన్, సముద్రం ఉన్న చోటుకు తీసుకువెళ్తానని నా భార్యకు మాటిచ్చా.

నగరంలో గంజాయి రవాణా పూర్తిగా అరికట్టాలి

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : నగరంలో గంజాయి రవాణా అరికట్టాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ అధికారులకు ఆదేశించారు. సోమవారం పోలీసు కమిషనరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్లో పోలీసు అధికారులతో మొదటి సమావేశం నిర్వహించారు. డైనమిక్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి రవాణా అయ్యే పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రౌడీషీటర్లపై తెరిచిన షీట్లు పునఃసమీక్ష చేయాలన్నారు.  జాయింట్‌ కమిషనర్‌ ఫకీరప్ప, డీసీపీ సత్తిబాబు, డీసీపీ క్రైమ్‌ వెంకటరత్నం, ఏసీపీలు, సి.ఐ.లు, ఎస్‌.ఐ.లు పాల్గొన్నారు.


వైజాగ్‌ వారియర్స్‌ జయకేతనం

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: ఏపీఎల్‌(ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌)లో భాగంగా సోమవారం పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వైజాగ్‌ వారియర్స్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో బెజవాడ టైగర్స్‌ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెజవాడ టైగర్స్‌ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. జి.మనీష్‌ 44 పరుగులు చేశాడు. వైజార్‌ వారియర్స్‌ బౌలర్‌ కె.సుదర్శన్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైజాగ్‌ వారియర్స్‌ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి విజయకేతనం ఎగురవేసింది. కె.ఎస్‌.భరత్‌ 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అశ్విన్‌హెబ్బర్‌ 35 పరుగులు చేశాడు. బెజవాడ టైగర్స్‌ బౌలర్‌ శంభుఅఖిల్‌ రెండు వికెట్లు తీశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని