logo

అక్రమార్కుల బరితెగింపు

ఏపీఐఐసీ రక్షణలో ఉండాల్సిన భూమి కబ్జాదారుల పాలయింది. పారిశ్రామిక అవసరాలకు సేకరించిన భూమి అక్రమార్కులపరమయింది.

Published : 02 Jul 2024 02:51 IST

ఏపీఐఐసీ భూములు కబ్జా

ఈనాడు-విశాఖపట్నం, కూర్మన్నపాలెం-న్యూస్‌టుడే: ఏపీఐఐసీ రక్షణలో ఉండాల్సిన భూమి కబ్జాదారుల పాలయింది. పారిశ్రామిక అవసరాలకు సేకరించిన భూమి అక్రమార్కులపరమయింది. వైకాపా హయాంలో ఆక్రమణలకు పాల్పడిన వారికి మంత్రి అమర్‌నాథ్‌ అండ ఉందని నాడు అధికారులు చర్యలకు జంకారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఆక్రమణలు తొలగించక మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో అక్రమార్కులు చెలరేగిపోయారు.

చెరువును పూడ్చి రోడ్డు వేసే పరిస్థితి నెలకొంది. దువ్వాడ వద్ద సర్వే నెంబరు 108/5, 10లలో ఏపీఐఐసీకి ఉన్న భూముల్లో సుమారు 5.49 ఎకరాలు స్టీలు ప్లాంటు అవసరాలకు 1983లో సేకరించారు.

ఇందులో ప్లాంటు అవసరాలకు తీసుకోగా... మిగిలిన కొంత ఏపీఐఐసీకి బదలాయించారు. ఇందులో నాగదేవత గుడి ఎదురుగా ఉన్న సుమారు ఎకరా కబ్జాకు గురైంది. ఈ స్థలం చదును చేసి చుట్టూ ఏకంగా ప్రహరీ నిర్మించారు. సబ్బవరం వెళ్లే వందడుగుల రహదారికి సమీపంలో ఉండడంతో ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.13 కోట్లు వరకు ఉంటుంది. అది ఏపీఐఐసీˆ భూమిగా సర్వే చేసి నిర్ధారించినా ఇప్పటి వరకు ఆక్రమణలను తొలగించకపోవడం గమనార్హం.బీ కబ్జా చేసిన స్థలంలోకి వెళ్లేందుకు సుమారు 25 సెంట్ల ఏపీఐఐసీ చెరువును పూడ్చి రహదారి నిర్మించారు. ఈ రోడ్డు మీదుగానే  గ్రావెల్, ప్రహరీ నిర్మాణ సామగ్రి తరలించారు. పూడ్చిన చెరువు స్థలం విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుంది. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటికీ చర్యలకు ఉపక్రమించడం లేదు. మాజీ మంత్రి అమర్‌నాథ్‌ ఒత్తిళ్లతోనే ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు తొలగింపుల జోలికి వెళ్లలేదన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఈ విలువైన భూమిని అమ్మేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశమవుతోంది. అధికారులు మాత్రం ఇప్పటికీ ఏపీఐఐసీ భూమి కాదనే తీరుగా వ్యవహరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని