logo

వైకాపా నాయకుల చెరలో పేదల స్థలాలు

గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు తమ భూములను ఆక్రమించారని పలువురు వాపోయారు.

Published : 02 Jul 2024 02:45 IST

పీజీఆర్‌ఎస్‌లో బాధితుల ఫిర్యాదు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు తమ భూములను ఆక్రమించారని పలువురు వాపోయారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఫిర్యాదులు అందజేశారు. జీతాలు సకాలంలో ఇవ్వాలని పలువురు పొరుగుసేవల సిబ్బంది కోరారు. మరి కొందరు భూ సమస్యపై వినతులు సమర్పించారు.

వైకాపా నేతలు స్థలాలను కాజేశారు 

  • భీమిలి మండలం సంగివలస గ్రామం సర్వే సంఖ్య 167లో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను వైకాపా నాయకులు కాజేశారని, దీనిపై విచారణ జరిపి వాటిని అర్హులైన ఎస్సీలకు పంపిణీ చేయాలని న్యాయవాది భాగం గోపాలరావు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. 2007-08లో 28 ఎకరాల్లో లేఅవుట్‌ వేశారని, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నలుగురు వైకాపా నాయకులు ప్లాట్లను అడ్డుగోలుగా విక్రయించారన్నారు. దామాషా పద్ధతిన ఎస్సీలకు 150 ప్లాట్లు రావాల్సి ఉన్నప్పటికీ ఒక్కటీ మంజూరు చేయలేదని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.
  • భీమిలి మండలం కొత్తవలస గ్రామంలో శారదాపీఠానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని స్థానికులు బోని ఆదినాగరాజు కోరారు. ఆయా భూములను ఇతర అవసరాలకు వినియోగించాలని కోరారు.
  • భీమిలి మండల కార్యాలయంలో నియతులైన ఐదుగురు వీఆర్‌ఏలను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో తెలియడం లేదని, దీనిపై విచారణ జరపాలని భాగం గోపాలరావు ఫిర్యాదు చేశారు. 

జీతాలు చెల్లించాలని వినతి

జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో ఎంఎఫ్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, ఎస్‌.ఎ.డబ్ల్యులుగా పనిచేస్తున్న 30 మంది పొరుగు సేవల ఉద్యోగులకు గత పది నెలల నుంచి జీతాలు రావడం లేదని, తమకు వేతనాలను సకాలంలో అందజేసి ఆదుకోవాలని పలువురు ఉద్యోగులు కోరారు. పలుమార్లు అధికారులను సంప్రదించినా ప్రయోజనం చేకూరలేదని వాపోయారు.


ప్రజా సమస్యల పరిష్కారవేదికకు స్పందన 

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు మంచి స్పందన లభిస్తోంది. జిల్లా నలుమూలల నుంచి పలువురు తమ సమస్యలను విన్నవించేందుకు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్, ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్, ఇతర అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇన్‌ఛార్జి కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నందున హాజరు కాలేదు. మొత్తం 218 మంది అర్జీలను అందజేశారు. రెవెన్యూ విభాగానికి 69, జీవీఎంసీకి 70, పోలీసుశాఖకు 17, ఇతర శాఖలకు 62 చొప్పున వచ్చాయి. వ్యక్తిగత అంశాలైన ఇళ్ల స్థలాలు, ఉపాధి కల్పన, పింఛను పునరుద్ధరణ వంటి అంశాలపై కొందరు వినతులు పెట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్‌ టి.సీతారామారావు, గృహనిర్మాణ పథక సంచాలకులు సునీత, డీఈఓ చంద్రకళ, సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు రామారావు, డీఎల్‌డీఓ పూర్ణిమాదేవి తదితరులు పాల్గొన్నారు.


జీవీఎంసీలో...

కార్పొరేషన్‌: జీవీఎంసీకి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని కమిషనర్‌ ఆదేశించారు. ప్రణాళిక విభాగానికి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారంలో విభాగ అధికారులు అలసత్వం వహిస్తున్నారన్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 81 వినతులు వచ్చాయి. కమిషనర్‌ సీఎం సాయికాంత్‌వర్మ, అదనపు కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ వాటిని స్వీకరించారు. జోన్‌-2కు 18, జోన్‌-3కు 19, జోన్‌-4కు 9, జోన్‌-5కు 8, ఆరో జోన్‌కు 5, జోన్‌-8కు ఏడు, ప్రధాన కార్యాలయానికి 15 చొప్పున అందాయి.


పోలీసు సమావేశమందిరంలో...

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ నేతృత్వంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు స్పందన లభించింది. సోమవారం పోలీసు సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు జె.సి.పి. ఫకీరప్ప, ఎ.డి.సి.పి. (పరిపాలన) ఎం.ఆర్‌.కె.రాజు పాల్గొన్నారు. బాధితుల నుంచి అర్జీలను స్వీకరించిన సీపీ వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి సత్వరమే సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. సుమారు 50 మంది వరకు బాధితులు వచ్చి తమ ఫిర్యాదులను అందజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని