logo

వైకాపా హయాంలో సాగినట్లు ఇప్పుడు కుదరదు

‘హోంశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటే తహసీల్దార్‌ కార్యక్రమానికి రాలేదు. ఎంపీడీఓ దూరంగా ఉండిపోయారు.

Published : 02 Jul 2024 02:38 IST

పింఛన్ల పంపిణీకి అధికారుల గైర్హాజరుపై హోం మంత్రి అనిత ఆగ్రహం

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: ‘హోంశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటే తహసీల్దార్‌ కార్యక్రమానికి రాలేదు. ఎంపీడీఓ దూరంగా ఉండిపోయారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా, మా ప్రభుత్వ చేతగానితనమా? వేదికపై అధికారులు లేకపోవడంతో ఇక్కడ జరుగుతోంది పార్టీ సమావేశమా లేక ప్రభుత్వ కార్యక్రమమా అని సందేహంగా ఉంది. అధికారులు అయిదేళ్లు వైకాపా సేవలో మగ్గిపోయి, బయటకు రావడానికి కష్టపడుతున్నారు’ అంటూ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదగుమ్ములూరులో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఇక్కడ రోడ్డుపై మురుగు నిలిచిపోవడంతో ఈపీఓఆర్‌డీ సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వేదికపై అందరూ పార్టీ నాయకులే ఉండడంతో అధికారులు ఎక్కడున్నారని అడిగారు. పంచాయతీ వద్దనున్న ఎంపీడీఓ సత్యనారాయణమూర్తిని పిలిపించారు. ఈ కార్యక్రమంపై సమాచారం ఉందా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్‌కు ఫోన్‌ చేసి ఎంపీడీఓ సత్యనారాయణమూర్తి, తహసీల్దార్‌ జయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘ఇక్కడికి ప్రజలు అనేక సమస్యలతో వస్తారు.. వారిచ్చిన అర్జీలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామ’ని తెలిపారు. ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారంటే వైకాపా ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని, ఈ ప్రభుత్వంలోనూ అలానే పని చేస్తామంటే కుదరదని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం ఒక్కొక్కరిపై రూ.5 లక్షల అప్పు ఉంచిందని ఆరోపించారు. విశాఖ కమిషనరేట్‌ సైతం తాకట్టు పెట్టారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో గ్రామాల అభివృద్ధి, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడంలో అందరి సహకారం కావాలని కోరారు. ఇకపై తనను అభినందనలు తెలిపేందుకు వచ్చేవాళ్లు పుష్పగుచ్ఛాలు, పూలమాలలు కాకుండా  ఆ డబ్బులు అమరావతి నిర్మాణానికి, పాయకరావుపేట అభివృద్ధికి ఇవ్వాలని కోరారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 47,267 మందికి పింఛన్ల రూపంలో రూ. 30,84,33,800 అందిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు రూ. 4 వేలకు పెంచి, మూడు నెలల మొత్తం ఒకేసారి రూ. 7 వేలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం పలువురు పింఛనుదారులతో సహపంక్తి భోజనం చేశారు. మాజీ ఎంపీపీ వినోద్‌రాజు, సర్పంచి నాగరత్నం, తెదేపా నేతలు లాలం కాశీనాయుడు, అమలకంటి అబద్ధం, జానకి శ్రీను, పెద్దిరెడ్డి చిట్టిబాబు, నవీన్‌రాజు, అల్లు నరసింహమూర్తి, నల్లపరాజు వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.


అసహాయురాలికి మంత్రి అండ

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: పింఛను కోసం ఎదురుచూస్తున్న అసహాయురాలికి హోం మంత్రి అనిత అండగా నిలిచారు. పెదగుమ్ములూరులో పింఛన్ల పంపిణీకి గ్రామానికి చెందిన మామిడి సత్యవతి హాజరై తన గోడు వెళ్లబోసుకుంది. రెండేళ్ల కిత్రం భర్త చనిపోయాడని, అప్పటి నుంచి పింఛన్‌ కోసం దరఖాస్తు చేసినా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై మంత్రి అనిత సచివాలయ సిబ్బందిని ఆరా తీయగా, భర్త చనిపోయినా ఆయన పేరు మీద సత్యవతి రేషన్‌ తీసుకున్నారని.. తరవాత రేషన్‌ కార్డులో తొలగించి, పింఛనుకు దరఖాస్తు చేసినా సాంకేతిక సమస్య వల్ల మంజూరు కాలేదని చెప్పారు. పింఛను మంజూరయ్యే వరకు నెలకు రూ.4 వేల చొప్పున తన సొంత డబ్బు పింఛనుగా అందిస్తానని అనిత హామీ ఇచ్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని