logo

అమ్మో.. అంగన్‌వాడీ భవనం

కొత్తకోట అరుంధతి కాలనీ (ఎస్సీ కాలనీ)లోని అంగన్‌వాడీ కేంద్రం-2 భవనం బీటలు వారి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. భవనంతోపాటు మరుగుదొడ్డి, ప్రహరీ గోడ రెండుగా చీలిపోయాయి.

Published : 02 Jul 2024 02:34 IST

బీటలు వారిన మరుగుదొడ్డి, ప్రహరీ
చిన్నారులకు పొంచి ఉన్న ముప్పు

రావికమతం, న్యూస్‌టుడే: కొత్తకోట అరుంధతి కాలనీ (ఎస్సీ కాలనీ)లోని అంగన్‌వాడీ కేంద్రం-2 భవనం బీటలు వారి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. భవనంతోపాటు మరుగుదొడ్డి, ప్రహరీ గోడ రెండుగా చీలిపోయాయి. గచ్చుపై వేసిన టైల్స్‌ దెబ్బతిన్నాయి. మరుగుదొడ్డి గోడలు, ప్రహరీ ఎప్పుడు కూలుతుందోనని అంగన్‌వాడీ సిబ్బందితోపాటు చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. అంబేడ్కర్‌ కాలనీ, అరుంధతి కాలనీల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఈ కేంద్రంలో సేవలు అందిస్తున్నారు. ఉపాధి హామీ, ఎస్‌డీపీ, ఐసీడీఎస్, గ్రామ పంచాయతీ, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.10 లక్షలతో 2018లో ఈ భవనాన్ని నిర్మించారు.

మరుగుదొడ్డి స్లాబు నుంచి పునాది వరకు చీలి గోడలు వేరుపడ్డాయి. ప్రహరీది ఇదే పరిస్థితి. మరుగుదొడ్డి ప్రమాదకరంగా ఉండటంతో వినియోగించడం లేదు. చిన్నారులకు ఆరుబయటకు పంపుతున్నారు. గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. స్థానికంగా నెలకొన్న ఇబ్బందులను ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అంగన్‌వాడీ కార్యకర్త పద్మ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐసీడీఎస్‌ కొత్తకోట సెక్టారు సూపర్‌వైజర్‌ విజయ వద్ద ప్రస్తావించగా.. దెబ్బతిన్న మరుగుదొడ్డిని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉందన్నారు. నాడు-నేడులో రూ.1.27 లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని