logo

అర్జీదారుల సమస్యలకు సత్వర పరిష్కారం

అర్జీదారుల సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ఉత్సాహంగా అర్జీదారులు తరలివచ్చారు.

Published : 02 Jul 2024 02:31 IST

కలెక్టరేట్, న్యూస్‌టుడే: అర్జీదారుల సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ఉత్సాహంగా అర్జీదారులు తరలివచ్చారు. సూపరింటెండెంట్ సత్యనారాయణ 15 కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీదారులను ఒక్కొక్కరినీ పంపించి వివరాలు నమోదు చేయించి రసీదు అందించారు. అనంతరం వీసీ హాల్‌లో కలెక్టర్‌ రవి, జేసీ జాహ్నవి, అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు ఉంటూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలన్నారు. నాణ్యమైన సమాధానం చెప్పాలన్నారు. పెండింగ్‌ అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కార శాతం పెంచాలన్నారు. క్షేత్ర స్థాయిలో పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జిల్లా నలుమూలలు నుంచి 136 అర్జీలు వచ్చాయి. వీటిని శాఖల వారీగా విభజించి సంబంధిత అధికారులకు పంపించారు.

  • కోడూరు పంచాయతీ శివారు భూపతిపాలెంలోని పాత పాఠశాల భవనంలో అక్రమంగా నడుపుతున్న అమూల్‌ డెయిరీని తక్షణమే ఖాళీ చేయించాలని గ్రామానికి చెందిన కె.సురేశ్, కె.గణేశ్‌   కలెక్టర్‌ రవికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గతంలో ఈ భవనంలో అంగన్‌వాడీ కేంద్రం నడిపేవారన్నారు. అమూల్‌ కేంద్రం ఏర్పాటుకు గతంలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ఖాళీ చేయించి అమూల్‌ కేంద్రానికి అన్యాయంగా ఇచ్చారన్నారు. అంగన్‌వాడీ కేంద్రానికి భవనం లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  
  • మామిడిపాలెంలో నాలుగు ఎకరాల జిరాయితీ భూమిని ఆక్రమించారని బత్తిన అర్జునరావు జేసీ జాహ్నవికి ఫిర్యాదు చేశారు. పలుమార్లు తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

ఎస్పీ కార్యాలయంలో..

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమంలో 22 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్ట పరిధిలోని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీచేశారు.  ఎస్‌బీ సీఐ చంద్రశేఖర్, ఎస్సై సావిత్రి పాల్గొన్నారు.


బిడ్డ మృతిపై అనుమానాలున్నాయి..

- పెదపాటి పార్వతి, పూడి కాలనీ, అచ్యుతాపురం మండలం

చేతికి అందొచ్చిన కొడుకును కొంతమంది హత్య చేశారనే అనుమానాలు ఉన్నాయి. ఏడాది కిందట జరిగిన ఘటనపై పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశా. పూడ్చిన శవాన్ని  తీసి పోస్టుమార్టం చేశారు. నివేదిక రాలేదని చెబుతున్నారు.


వేరే వారి పేరుపై భూమిని రిజిస్ట్రేషన్‌

- కర్రి లక్ష్మి, పల్లపు సోమవరం, కశింకోట

నా పేరు మీద ఉన్న 30 సెంట్ల భూమిని నాకు తెలియకుండా వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసేశారు. 2021లో అనకాపల్లిలో నేను రిజిస్ట్రేషన్‌ చేసుకోగా ఈసీలో నా పేరు వచ్చింది. 2022లో వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ జరిగింది. దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలి.


గ్రంథాలయం, ఆసుపత్రి నిర్మించాలి 

- బల్లిన నాగేశ్వరరావు, కొత్తూరు నరసింగరావుపేట

కొత్తూరు నరసింగరావుపేటలో గ్రామ అవసరాలకు ఉపయోగపడేలా కల్యాణ మండపం, గ్రంథాలయం, ఆసుపత్రి నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టాలి. సర్వే నంబరు 75/1లో 5 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉంది. ఏళ్ల తరబడి గ్రామ కనీస అవసరాలకు సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆటస్థలం నిర్మాణం చేపట్టాలి.


పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వరూ.. 

- నడిపల్లి వరహాలు, కోమలపూడి 

బుచ్చయ్యపేట మండలం కోమళ్లపూడిలో రెండు ఎకరాల   జిరాయితీ భూమి ఉంది. వంశపారంపర్యంగా వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని ఏళ్ల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తక్షణమే పాసుపుస్తకం మంజూరు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు