logo

చదువుల తల్లికి స్వేచ్ఛ.. ప్రసాదరెడ్డి కబంధ హస్తాల నుంచి ఏయూకి విముక్తి

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విముక్తి కలిగింది. వర్సిటీలోని ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులకు స్వేచ్ఛ లభించింది.

Updated : 29 Jun 2024 05:19 IST

పీవీజీడీ ప్రసాదరెడ్డి

ఈనాడు డిజిటల్‌ - విశాఖపట్నం, న్యూస్‌టుడే - ఏయూ ప్రాంగణం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విముక్తి కలిగింది. వర్సిటీలోని ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులకు స్వేచ్ఛ లభించింది. గత అయిదేళ్ల వైకాపా పాలనలో వీసీ ప్రసాదరెడ్డి ఇష్టారాజ్యంగా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో విశ్రాంత, సీనియర్‌ ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీసీ అక్రమాలపై ప్రశ్నిస్తే ప్రైవేటు సెక్యూరిటీ సహాయంతో నియంత్రించడంతోపాటు కేసులు పెడతామని బెదిరించేవారు. ప్రసాదరెడ్డి నిరంకుశ పాలన సాగించారని, ఆయనపై న్యాయ విచారణ చేపట్టాలని కొద్దిరోజులుగా వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలు, ఏయూ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆయనను తొలగించాలనే డిమాండ్‌ ఎప్పటినుంచో ఉన్నా.. ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోవడంతో ఆ ఉద్యమం ఊపందుకుంది. ఎట్టకేలకు వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య జేమ్స్‌ స్టీఫెన్‌ శుక్రవారం రాజీనామా చేయడంతో ఏయూలో పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

95 ఏళ్ల కీర్తి.. అయిదేళ్లలో నాశనం..: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటై మరో రెండేళ్లలో వందేళ్లు పూర్తవుతాయి. దాదాపు 95 ఏళ్లపాటు విభిన్న సంస్కరణలు, పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెరుగైన విద్య అందించింది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో పూర్వ విద్యార్థులు దేశ, విదేశాల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. వర్సిటీ ఉప కులపతులుగా పనిచేసిన కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తదితరులు ఆ పదవికి వన్నె తెచ్చారు. ఏయూను ఉన్నత స్థానంలో నిలిపేందుకు తీవ్రంగా కృషి చేశారు. గతంలో పనిచేసిన వర్సిటీ అధికారులు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేవారు. కానీ వైకాపా హయాంలో ప్రసాదరెడ్డి వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పదవి విలువ పోగొట్టే విధంగా ప్రవర్తించారనే విమర్శలున్నాయి. 95 ఏళ్లలో వర్సిటీ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠలను అయిదేళ్లలో ఆయన సర్వనాశనం చేశారు. ఆయన చేసిన నష్టం పూడ్చేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి.

వీసీ, రిజిస్ట్రార్‌ దిగిపోవాలని నిరసనలు: ప్రసాదరెడ్డి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల సీనియర్‌ ఆచార్యులు, అతిథి అధ్యాపకులకు తీవ్ర నష్టం కలిగింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో తొలగించిన అతిథి అధ్యాపకులను విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ప్రసాదరెడ్డి, స్టీఫెన్‌ అయిదేళ్లలో భ్రష్టు పట్టించారని, వారి అక్రమాలపై విచారణ జరపాలని ఏయూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 14 రోజులపాటు నిరసన తెలియజేశారు. వారిద్దరూ పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. వీసీ, రిజిస్ట్రార్‌ రాజీనామా చేయాలని నిరసన తెలిపిన ఘటనలు గతంలో ఎక్కడా చూసిన దాఖలాలు లేవు. ఏయూలో ప్రధాన పరిపాలన భవనం ఎదుటే ధర్నాకు దిగారంటే ఉద్యోగులు ఎంతగా విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు గురుశిష్యులిద్దరూ పదవుల నుంచి తప్పుకోవడంతో వారి సంతోషానికి అవధుల్లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని