logo

హోసూరులో విమానం ఎగురుతుందా?

స్టాలిన్‌ ప్రకటనతో రాజకీయం వేడెక్కింది. ఈ ప్రతిపాదనను భాజపా, దాని మిత్రపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతులు వచ్చే అవకాశంలేని ఈ ప్రతిపాదన కేవలం ప్రచార ఆర్భాటం కోసమేనని కొట్టిపారేస్తున్నాయి.

Published : 04 Jul 2024 04:27 IST

సంచలనంగా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతిపాదన
బెంగళూరు ఒప్పందంతో అనుమతులకు నీలినీడలు

హోసూరు నగరం

కృష్ణగిరి జిల్లా హోసూరులో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నాం. ఇక్కడ నుంచి ఏటా 3 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా వసతులు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం 2 వేల ఎకరాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం.

తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ చేసిన ప్రకటన

స్టాలిన్‌ ప్రకటనతో రాజకీయం వేడెక్కింది. ఈ ప్రతిపాదనను భాజపా, దాని మిత్రపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతులు వచ్చే అవకాశంలేని ఈ ప్రతిపాదన కేవలం ప్రచార ఆర్భాటం కోసమేనని కొట్టిపారేస్తున్నాయి. ఈ తరహా విమర్శలు ఎందుకొస్తున్నాయి? ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? ప్రతిపాదనలేంటి? అడ్డంకులేంటి?

ఈనాడు-చెన్నై

హోసూరుకు సమీపంలోనే బెంగళూరు ఉండటం, అక్కడి విమానాశ్రయం రద్దీగా ఉండటం.. ఇవే తమిళనాడు ఆలోచనలకు పదునుపెట్టేలా చేసింది. హోసూరు అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు జిల్లాల నుంచి పెద్దఎత్తున ప్రయోజనం పొందొచ్చని, భారీగా సరకు రవాణా సైతం చేయాలనే ప్రణాళికలున్నాయి. ఇప్పటికే పారిశ్రామికంగా పెద్దఎత్తున వృద్ధి చెందిన ఈ ప్రాంతంలో మరిన్ని విప్లవాత్మక అడుగులు వేయాలని చూస్తోంది.

జంట నగరాలే లక్ష్యం

బెంగళూరుకు కేవలం 40 కి.మీ. దూరంలోనే హోసూరు ఉంది. వాటిని జంట నగరాలుగా మార్చే ఆలోచన కూడా ఉన్నట్లు ప్రభుత్వం నుంచి ఓ మాటగా వినిపిస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనలతో హోసూరు పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి పెరిగే ఆస్కారం ఉందని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ, విద్యుత్తు వాహనాలు, ఆటోమొబైల్‌ రంగాలకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ హోసూరు పరిసరాల్లోనే ఉన్నాయి. తాజా నిర్ణయంతో మరిన్ని రంగాలు ఇక్కడికి తరలే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఫలితంగా ఈ ప్రాంతాన్ని ప్రధాన ఆర్థిక కేంద్రంగా వృద్ధి చేయాలని చూస్తున్నారు. ఈ అవకాశాలన్నింటినీ క్రోడీకరించి మాస్టర్‌ప్లాన్‌లను సైతం రూపొందిస్తున్నారు. కృష్ణగిరి సరిహద్దు జిల్లాలైన ధర్మపురి, సేలం సైతం పెద్దఎత్తున అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

పెద్ద చిక్కే ఉంది

ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటనకు చెక్‌ పెట్టేలా ఓ ఒప్పందమే ప్రస్తుతం వివాదానికి కారణమైంది. బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ సమయంలో ఓ కీలక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం 2033లోపు ఈ విమానాశ్రయానికి 150 కి.మీ. దూరంలో మరే కొత్త పౌర విమానాశ్రయ నిర్మాణం జరగకూడదు. ఇక్కడి నుంచి హోసూరుకు 70-80 కి.మీ. దూరంలోనే ఉంది. అంటే.. 150 కి.మీ. నిబంధన పరిధిలోపే ఉంది. అనుమతులు రావని చెప్పడానికి ఇదే ఆధారం కాబోతోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది, అనుమతులు ఎలా తెచ్చుకుంటుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు విపక్షాలు ఈ ప్రతిపాదనను ఎద్దేవా చేస్తున్నాయి. ఇదొక ప్రచార ఆర్భాటమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు.

‘ఉడాన్‌’ పోయింది..

గతేడాది హోసూరు విమానాశ్రయాన్ని తనేజా ఎయిరోస్పేస్‌ అండ్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వహించేది. ఇక్కడి నుంచి చెన్నై వరకు విమానాల్ని తక్కువ ధరల్లో నడిపేందుకు ఉడాన్‌ పథకం కింద ఇదివరకే మంజూరైంది. టెండరు ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కి.మీ. దూరంలో మరే విమానాశ్రయానికి అనుమతులు ఇవ్వకూడదన్న నేపథ్యంగా టెండర్లు రద్దుచేశారు. ఇదే కారణాన్ని తాజా అంతర్జాతీయ విమానాశ్రయానికి నీలినీడలు అలుముకున్నాయని చెప్పడానికి చూపుతున్నారు.

ఆశకు కారణమిదే

2017లో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 72 కి.మీ. దూరంలో గ్రేటర్‌ నోయిడా పరిధిలోని జేవార్‌లో మరో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి అనుమతి ఇచ్చారు. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అజెండాతో ప్రతిపాదనలు పెట్టి అనుమతులు తెచ్చుకుంటుందో వేచి చూడాలి. ఇంకోవైపు బెంగళూరులో రెండో విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన సైతం అక్కడి కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చింది.

ప్రతిపాదన వెళ్తే ఏమవుతుంది?

హోసూరు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి సంబంధించిన అనుమతుల్ని డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) చూసుకుంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల్ని ముందుగా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడిచే స్టీరింగ్‌ కమిటీ ముందు పెడతారు. స్థానిక పరిస్థితుల్ని గమనించి తమ అభిప్రాయాన్ని, నివేదికను మంత్రిత్వశాఖకు పంపుతారు. ఆ తర్వాత కేబినెట్‌కు వెళ్తుంది. వారి నిర్ణయం మేరకు డీజీసీఏ ప్రకటన విడుదల చేస్తుంది.


3వేల అడుగుల ఎత్తులో..

పారిశ్రామికవాడ

సముద్ర మట్టానికి 3వేల అడుగుల ఎత్తులో ఉన్న హోసూరు కృష్ణగిరి జిల్లాలో ఉంది. తమిళనాడు సరిహద్దులోపల బెంగళూరుకు అతి దగ్గరలో ఉన్న నగరం. 2021లో విజువల్‌ కాపిటలిస్ట్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న జనాభా నగరాల్లో హోసూరులో 13వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పేరుమోసిన సంస్థలు పరిశ్రమల్ని ఏర్పాటుచేశాయి. టాటా ఎలక్ట్రానిక్స్, టీవీఎస్, అశోక్‌లేలాండ్, టైటాన్, రోల్స్‌రాయ్స్‌లాంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థలున్నాయి. ఈ ప్రాంత పరిసరాల్లో ఇప్పటికే 3 వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వెలిశాయి. ఇవన్నీ ఇంజినీరింగ్, పాలిషింగ్, ఇతర విడిభాగాలకు సంబంధించిన పరిశ్రమలు. 2,093 ఎకరాల్లో రెండు విడతలుగా పారిశ్రామిక వాడల్ని ఇక్కడ తెస్తున్నారు. విస్తరించేందుకు మరో 3,383 ఎకరాలు సిప్‌కాట్ సేకరిస్తోంది. ఇక్కడి అవసరాలు తీరేందుకు సమీపంలో రోజుకు 20 మెగాలీటర్ల సామర్థ్యంతో తాగునీటి శుద్ధిప్లాంటు తెస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని