logo

రద్దు చేయాలి: డీఎంకే

నీట్‌ పరీక్ష రద్దు చేయాలని డీఎంకే విద్యార్థి విభాగం డిమాండ్‌ చేసింది. నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం వద్ద బుధవారం జరిగిన ఆందోళనకు విద్యార్థి విభాగం కార్యదర్శి సీవీఎంపీ ఎళిలరసన్‌ అధ్యక్షత వహించారు.

Updated : 04 Jul 2024 05:23 IST

ఆందోళనలో పార్టీ నిర్వాహకులు, విద్యార్థి విభాగం ప్రతినిధులు

చెన్నై, న్యూస్‌టుడే: నీట్‌ పరీక్ష రద్దు చేయాలని డీఎంకే విద్యార్థి విభాగం డిమాండ్‌ చేసింది. నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం వద్ద బుధవారం జరిగిన ఆందోళనకు విద్యార్థి విభాగం కార్యదర్శి సీవీఎంపీ ఎళిలరసన్‌ అధ్యక్షత వహించారు. నీట్‌ అక్రమాలకు పాల్పడినవారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.భారతి మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో బీఏ పట్టా పుచ్చుకోవడం చాలా అరుదన్నారు. నేడు కుక్క కూడా పట్టా పుచ్చుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఆ పురోగతికి డీఎంకే కారణమన్నారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చారు. నాడు బీఏ పట్టా అందుకోవడం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితమని, నేడు ఆ పరిస్థితి మారిందనే ఉద్దేశంతో అలా మాట్లాడానని అన్నారు. తన వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదని వెల్లడించారు.

రాష్ట్రానికి వద్దు: అన్నాడీఎంకే

సైదాపేట, న్యూస్‌టుడే: తమిళనాడుకు నీట్‌ వద్దనేదే అన్నాడీఎంకే వైఖరి అని ఆ పార్టీ మాజీ మంత్రి జయకుమార్‌ తెలిపారు. నీట్‌పై తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విజయ్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి జయకుమార్‌ తెలిపారు. నీట్‌ వద్దన్నదే అన్నాడీఎంకే వైఖరి అని స్పష్టం చేశారు.

పాలకపక్షం నాటకమాడుతోంది: అన్నామలై

సైదాపేట, న్యూస్‌టుడే: నీట్‌ మినహాయింపుపై డీఎంకే నాటకమాడుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రాజన్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ సమర్పించిన నివేదికలోని లోపాలను భాజపా అనేకసార్లు ఎత్తి చూపిందన్నారు. నీట్‌కు ముందు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చేరిక వివరాలు పలుమార్లు అడిగినా కమిటీ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.


నీట్‌ నుంచి రాష్ట్రాన్ని మినహాయించండి

ప్రభుత్వ తీర్మానానికి స్వాగతం
కేంద్రం వెంటనే స్పందించాలి: నటుడు విజయ్‌

విద్యార్థులతో విజయ్‌

చెన్నై, న్యూస్‌టుడే: నీట్‌ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్‌ తెలిపారు. పది, 12వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో శాసనసభ నియోజకవర్గాల వారీగా తొలి మూడుస్థానాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పార్టీ తరఫున రెండో విడత బహుమతుల ప్రదానోత్సవం తిరువాన్మియూర్‌లో బుధవారం జరిగింది. 107 శాసనసభ నియోజకవర్గాలకు చెందిన 640 మంది విద్యార్థులకు విజయ్‌ బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నీట్‌ కారణంగా రాష్ట్రంలోని విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మే 5న జరిగిన అక్రమాలు నీట్‌ పరీక్షపై నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయన్నారు. దేశవ్యాప్తంగా నీట్‌ అవసరంలేదని ఈ ఘటన స్పష్టం చేస్తోందని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం నీట్‌ రద్దు మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలకు విలువనిచ్చి వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు తీసుకురావాలని, అవాంతరాలు ఉంటే రాజ్యాంగంలో తగిన సవరణలు చేయాలని సూచించారు. భాజపా సర్కారు తమ ఆధీనంలో ఉన్న ఎయిమ్స్, జిప్మర్‌వంటి విద్యాసంస్థలకు నీట్‌ పరీక్షలను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచం చాలా విశాలమని, అందులో చాలా అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు సూచించారు. ఒకట్రెండు అవకాశాలు కోల్పోతే నిరాశ చెందకూడదని, మరింత మెరుగైన అవకాశం కోసం అన్వేషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తమిళగ వెట్రికళగం ప్రధానకార్యదర్శి బుస్సి ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని