logo

శునకాన్ని తుపాకీతో కాల్చిన వ్యక్తి: పోలీసుల దర్యాప్తు

నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపంలోని ఉడ్‌కోట్‌ గృహ ప్రాంతంలో పెంపుడు శునకాన్ని తుపాకీతో కాల్చుతున్న వ్యక్తి సీసీ టీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

Updated : 04 Jul 2024 04:30 IST

శునకాన్ని తుపాకీతో కాల్చుతున్న జేమ్స్, విచారిస్తున్న పోలీసులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపంలోని ఉడ్‌కోట్‌ గృహ ప్రాంతంలో పెంపుడు శునకాన్ని తుపాకీతో కాల్చుతున్న వ్యక్తి సీసీ టీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ ఘటన వ్యవహారంగా కున్నూర్‌ నగర పోలీసులు సంబంధిత గృహానికి వెళ్లి సీసీ టీవీ పుటేజీల ద్వారా దర్యాప్తు చేశారు. అప్పుడు తుపాకితో శునకాన్ని కాల్చిన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన జేమ్స్‌గా విచారించారు. విచారణలో ఆయన ఉపయోగించింది క్రీడలకు ఉపయోగించే ఎయిర్‌ గన్‌ అని తెలిసింది. అనంతరం ఆయన నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జేమ్స్‌ కూడా శునకాన్ని పెంచుకోవడం గమనార్హం.


కుమార్తెను అసభ్యంగా ఫొటో తీసి బెదిరించాడని యువకుడిని చంపించిన తండ్రి

భువనేశ్వరన్‌ (పాతచిత్రం)

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: కుమార్తెను అసభ్యంగా ఫొటోలు తీసి బెదిరించాడనే కోపంతో తండ్రి ఓ యువకుడిని చంపించిన ఘటన తిరుప్పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుచ్చి జిల్లా మణప్పారైకు చెందిన భువనేశ్వరన్‌(25) తిరుప్పూర్‌ కనకంపాళ్యంలో ఉంటూ వడ్డీకి నగదు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి తిరుప్పూర్‌కు చెందిన 14ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వారిద్దరు కలిసి పలుచోట్ల తిరిగారు. ఆ సమయంలో యువకుడు బాలికను అసభ్యంగా ఫొటోలు, వీడియో తీశాడు. వాటిని బాలిక తండ్రికి పంపి రూ.15వేలు డబ్బులు కావాలని, లేదంటే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాలను పిలిపించి సమాధానపరిచి పంపేశారు. భువనేశ్వరన్‌ ప్రవర్తన మార్చుకోక బాలికతో మాట్లాడుతూనే వచ్చాడు. అతన్ని చంపేయాలని బాలిక తండ్రి నిర్ణయించుకుని స్నేహితుడిని సంప్రదించాడు. ఈ నేపథ్యంలో మాట్లాడాలని చెప్పి భువనేశ్వరన్‌ను రప్పించి 10మంది ఆయుధాలతో నరికి చంపి మృతదేహాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందుతులను పట్టుకొనేందుకు గాలిస్తున్నారు. బాలిక తండ్రిని అరెస్ట్‌ చేశారు.


వ్యక్తి దారుణ హత్య

మణికంఠన్‌

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: ఆవడి సమీప ఆరిక్కబేడుకు చెందిన తంగరాజ్‌ కోళ్ల ఫాంలో దిండుగల్‌ జిల్లా విరాలిమాయన్‌పట్టికి చెందిన మణికంఠన్‌(26), విజయపాండి, అన్బు, 18 ఏళ్ల యువకుడు పని చేస్తున్నారు. ఫాం దగ్గరలో మణికంఠన్‌ బుధవారం ఉదయం కత్తిగాట్లతో రక్తపు మడుగులో శవమై పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టి 18 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఇతని సహోదరి పట్ల మణికంఠన్‌ అసభ్యకరంగా ప్రవర్తించడంతో  వేట కొడవలితో నరికి హత్య చేసినట్లు అంగీకరించాడు. 18 ఏళ్ల యువకుడిపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన క్రిమినల్‌ చట్టం 103(1) కింద కేసు నమోదు చేసి అంబత్తూరు కోర్టులో హాజరు పరచి హోంకు తరలించారు.


రౌడీ షీటర్‌..

రాజా (పాతచిత్రం)

వేలూర్, న్యూస్‌టుడే: వేలూర్‌ సమీప అరియూర్‌ భారతి వీధికి చెందిన రాజా (43) రౌడీ షీటర్‌. ఇతనిపై 3 హత్య కేసులతో పాటు వివిధ కేసులు ఉన్నాయి. ఇతను బుధవారం బస్టాండు వద్ద టీ తాగుతుండగా ఓ ముఠా మారణాయుధాలతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మణివన్నన్, డీఎస్పీ తిరునావుక్కరసు సందర్శించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి అరియూరుకు చెందిన తేజేష్, రాజేష్, అజిత్‌కుమార్, చంద్రు, కార్తిక్‌లను అరెస్టు చేశారు. 2020లో కామేష్, తనిగైవేల్, దివాకర్‌ అనే వ్యక్తులను రాజా నేతృత్వంలోని ముఠా నరికి హత్య చేసింది. ఇందుకు ప్రతీకారంగానే రాజా హత్య జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.


అడవిదున్న దాడిలో ఒకరి మృతి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: మేకలను మేతకు తీసుకెళ్లిన ఓ వ్యక్తిపై అడవి దున్న దాడిచేయడంతో మృతి చెందిన ఘటన దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..దిండుక్కల్‌ జిల్లా పళని సమీపంలోని కుదిరైయారు ప్రాంతానికి సమీపంలో అళగాపురం ప్రాంతానికి చెందిన వలసుదురై(40) మేకలను మేతకు అడవికి మంగళవారం ఉదయం తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ వారు అడవిలోకి వెళ్లి గాలించగా అనై ప్రాంతంలో ఆయన మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


బస్సు నుంచి పడి చిన్నారి..

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: బస్సు నుంచి కిందపడి చిన్నారి మృతి చెందిన ఘటన తిరుచ్చి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. లాల్‌కుడి సమీపంలోని వాల్రాంపాళ్యం గ్రామానికి చెందిన మరియ అలెక్స్‌ అనే వ్యక్తి కుమార్తె విభిష(12) అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు ప్రభుత్వ బస్సు ఎక్కుతుండగా డ్రైవర్‌ గమనించకుండా వేగంగా పోనివ్వడంతో విభిష అదుపుతప్పి కిందపడింది. తీవ్ర గాయాలవగా స్థానికులు తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రభుత్వ బస్సును స్వాధీనం చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.


వ్యక్తిని బలి తీసుకున్న వివాహేతర సంబంధం

టీనగర్, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లాలోని కరుపూర్‌ ఏరిక్కాడుకు చెందిన సుభాష్‌ చంద్రబోస్‌ వ్యాపారి. ఇతను గత నెల 28వ తేదీన పరవైక్కాడులోని తన కర్మాగారంలో హత్యకు గురయ్యాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు బొమ్మిపట్టికి చెందిన వెంకటేశ్‌ను అరెస్టు చేశారు. విచారణలో వెంకటేశ్‌కు తేన్‌నిలా అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని, వారు వారి వారి కుటుంబాలను వదిలేసి ఒంటరి కాపురం పెట్టుకున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో తేన్‌నిలా సుభాష్‌ చంద్రబోస్‌తో స్నేహం పెంచుకుని అతనితో వివాహేతర సబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆగ్రహం చెందిన వెంకటేశ్‌ సుభాష్‌చంద్రబోస్‌ను అతని కర్మాగారంలో కత్తితో దాడి చేసి హతమార్చాడని తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని