logo

నడిసంద్రంలో నరకం!

వెళ్లినవారు ఇంటికొస్తారా, రారా అంటూ కుటుంబీకులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. వందలమంది శ్రీలంక చెరలో ఉండటంతో ఇప్పుడు వారి ఇళ్లలోనివారంతా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు.

Published : 03 Jul 2024 00:35 IST

మత్స్యకారులపై వేధింపులు, అరెస్టులు
శ్రీలంక, భారత్‌ మధ్య తేలని వివాదం

సముద్రంలో తమిళనాడు మత్స్యకారుల పడవను చుట్టుముట్టిన శ్రీలంక నేవీ అధికారులు

సముద్రంలోకి వెళ్లాలంటేనే మత్స్యకారులకు దడపుడుతోంది. వెళ్లినవారు ఇంటికొస్తారా, రారా అంటూ కుటుంబీకులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. వందలమంది శ్రీలంక చెరలో ఉండటంతో ఇప్పుడు వారి ఇళ్లలోనివారంతా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ నరకం ఎన్నేళ్లని ప్రశ్నిస్తూ.. తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం సైతం తీవ్రంగా స్పందిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మత్స్యకారుల్ని విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తోంది. 

ఈనాడు-చెన్నై

గత కొద్దిరోజుల్లో 62 మంది తమిళనాడు మత్స్యకారుల్ని శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. వారిలో ఆరుగురు జైలు శిక్ష సైతం అనుభవిస్తున్నారు. వారి పడవలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. భారత్, శ్రీలంక మధ్య సరిహద్దు సమస్య పేరిట ఏళ్లుగా జరుగుతున్న అరెస్టులకు ముగింపు పలకడంలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఆరు నెలల్లో ఏకంగా 190మంది జాలర్లను శ్రీలంక నావికాదశం అరెస్టు చేసింది. ఎక్కువమంది పాక్‌ జలసంధి, తమిళనాడు సమీపంలో శ్రీలంక ఉత్తరభాగాన ఉన్న సముద్ర తీరాల్లో పట్టుబడుతున్నట్లు శ్రీలంక చెబుతోంది. ఆయా ప్రాంతాల్లో విలువైన చేపలుండటంతో ఇరుదేశాల మత్స్యకారులు ఎక్కువగా దృష్టిపెడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ఫలితంగా తమిళనాడు మత్స్యకారులు హద్దులు దాటి వస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇదివరకు ఇలా వెళ్లినవారిపై కాల్పులు జరిపిన ఘటనలూ ఉన్నాయి. గతేడాది 240మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడిస్తున్నారు. 170దాకా పడవలు వారి అధీనంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

 తమవారిని విడిపించాలని రామేశ్వరంలో మత్స్యకార మహిళల రోదనలు

నిజాయతీగా ఉన్నా వేధింపులా..!

శ్రీలంక నేవీనే అతిక్రమణలకు పాల్పడి జాలర్లను అదుపులోకి తీసుకుంటోందని మత్స్యకార సంఘాలు ఆరోపిస్తున్నాయి. భారతీయ సముద్ర జలాల సరిహద్దులోకి 2 కి.మీ. లోపలికి చొచ్చుకొచ్చి మరీ అరెస్టు చేయడం దారుణమని చెబుతున్నారు. శ్రీలంక ప్రభుత్వం ఆమోదించిన వలల్నే మత్స్యకారులు వినియోగిస్తున్నారని, దేశవాళీ పడవలే వాడుతున్నారని సంఘాల ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఎలాంటి అతిక్రమణలకు పాల్పడకుండా ఉపాధికోసం వెళ్లిన పేదవారిని ఇలా ఇబ్బంది పెట్టడం సబబుకాదని అంటున్నారు. నిబంధనలకు లోబడి నిజాయితీగా ఉంటున్నందుకు ఇదా ఫలితమని రోదిస్తున్నారు. తాజా అరెస్టులతో మూడ్రోజులుగా తమిళనాడు దక్షిణ తీర ప్రాంతాల్లో మత్స్యకార కుటుంబాలు, సంఘాలు ఆందోళనలకు దిగాయి. తమవాళ్లను చంపుతారనే కంగారు వేధిస్తోందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. న్యాయం చేయాలని వేడుకొంటున్నారు. రైల్‌రోకో, రాస్తారోకోలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

తక్షణ స్పందన కరవు

సముద్రంలో శ్రీలంక నేవీ తీరుపై కేంద్రం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా తక్షణ స్పందన లేదనే తీరులో రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. మత్స్యకారులు, వారి పడవల్ని శ్రీలంక నుంచి విడిపించి తెప్పించేలా చర్యలు తీసుకోవడం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. గత మాసంలో ఏకంగా రెండు లేఖలు ప్రభుత్వం నుంచి కేంద్రానికి వెళ్లడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు శ్రీలంక జైళ్లలో మగ్గుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తన స్వరాన్ని పెంచింది. అక్కడి జైళ్లలో తమిళనాడు మత్స్యకారులకు కనీస వసతులు లేవని, అక్కడి ప్రభుత్వంతో మాట్లాడకపోతే చేటు తెస్తుందనే కోణంలో కేంద్రాన్ని కోరింది. రెండు దేశాలు కలిసి ఈ సమస్య పరిష్కరించాలని తాజాగా కేంద్రానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ కోరారు. గతేడాది మత్స్యకారుల్ని అదుపులో తీసుకున్నప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించి వారిని వెనక్కి రప్పించేందుకు చొరవ చూపారు. ఈ ఏడాది కూడా కొంతమంది విడుదలై ఇళ్లకు చేరారు.

పెరిగిన రాజకీయ వేడి

ఇప్పటికీ ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కురదడంలేదు. 2016లో దిల్లీ వేదికగా రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత కూడా ఉల్లంఘనలు ఆగడంలేదని ఇరుదేశాలవారూ ఆరోపించుకుంటున్నారు. ఇది రాజకీయరంగు పులుముకుంటోందనే ఆరోపణలూ ఉన్నాయి. తాజాగా తమ నేవీ నావికుడు మరణించడానికి, నేవీ ఆస్తుల ధ్వంసానికి భారతీయ మత్స్యకారులే కారణమని భారత కేంద్ర ప్రభుత్వానికి శ్రీలంక లేఖ పంపింది. 10 మంది తమ హద్దులోకి చొరబడి ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా ఆరోపించింది. ఇందులో 8 మంది తమిళనాడు నుంచి, ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉన్నారు. వారు కూడా ఇప్పుడు శ్రీలంక అదుపులో ఉన్నారు. శ్రీలంక తీరు అనుమానాస్పదంగా ఉందని తమిళనాడులో పలు రాజకీయ పార్టీలు సైతం ఆరోపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని