logo

పాఠశాలలో కుల ఘర్షణ

తిరునెల్వేలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. నాంగునేరి వద్ద మూండ్రడైప్పు సమీప మరుదకుళం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది.

Published : 03 Jul 2024 00:34 IST

ఇద్దరు విద్యార్థులకు గాయాలు

టీనగర్, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. నాంగునేరి వద్ద మూండ్రడైప్పు సమీప మరుదకుళం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది. అందులోని 10, 11, 12 తరగతి విద్యార్థుల మధ్య సోమవారం ఘర్షణలు జరిగాయి. ఇద్దరు గాయపడగా చికిత్స నిమిత్తం తిరునెల్వేలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయమై బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో నిత్యం కుల ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని, అమాయక విద్యార్థులే అధికంగా గాయపడుతున్నారని ఆరోపించారు. పాఠశాల నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.


పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి: హైకోర్టు

ప్యారిస్, న్యూస్‌టుడే: తూత్తుక్కుడి తుపాకీ కాల్పుల ఘటనలో సంబంధం ఉన్న అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని మద్రాసు హైకోర్టు తెలిపింది. కాల్పుల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సుమోటోగా విచారణకు తీసుకుని విచారణ పూర్తి చేసింది. ఇందుకు వ్యతిరేకంగా మానవ హక్కుల కార్యకర్త, లాయర్‌ హెన్రి దిబేన్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇది జస్టిస్‌ ఎస్‌ఎస్‌ సుందర్, జస్టిస్‌ సెంథిల్‌కుమార్‌ ధర్మాసనంలో సోమవారం మళ్లీ విచారణకు వచ్చింది. ప్రతివాదిగా చేర్చిన తూత్తుక్కుడి డీఎస్పీ లింగతిరుమారన్‌ తరఫున.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జస్టిస్‌ అరుణా జగదీశన్‌ కమిషన్‌ విచారించిన ఈ కేసును మళ్లీ విచారించడం కుదరదని వాదించారు. అనంతరం పిటిషనర్‌ తరఫున .. మానవ హక్కుల కమిషన్‌ చట్ట ప్రకారం జారీచేసే ఉత్తర్వులను పునఃపరిశీలించవచ్చని, కాల్పుల ఘటనపై మళ్లీ విచారించేందుకు ఎలాంటి అడ్డులేదని వాదనలు వినిపించారు. సీబీఐ తరఫున... ఈ ఘటనపై విచారణ కోర్టులో అదనపు తుది అభియోగపత్రం దాఖలు చేసినట్లు తెలిపారు. కేసును సీబీఐ ప్రత్యేక కోర్టు విచారిస్తున్న స్థితిలో కేసు దాఖలు చేయడానికి పిటిషనర్‌కు ఎలాంటి అధికారం లేదని ఆక్షేపణ తెలిపారు. అప్పుడు జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన అమాయక ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. ఏ అధికారి కూడా ఇంతవరకు పశ్చాత్తాపం తెలపలేదన్నారు. తుపాకీ కాల్పుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై హత్యకేసు నమోదు చేయాలన్నారు. కాల్పులు జరపాలని ఉత్తర్వులు ఇచ్చిందెవరు? ఇన్ని ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యత వహించేది ఎవరని ప్రశ్నించారు. తదుపరి విచారణ జులై 15కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని