logo

డీఎంకే ఎన్నికల కార్యాలయంలో టీ, బజ్జీ ఉచితం

విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక 10న జరగనుండటంతో ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎంకే తరఫున అన్నియూర్‌ శివ, ఎన్డీఏ కూటమిలో పీఎంకే నుంచి సి.అన్బుమణి, ఎన్టీకే తరఫున డాక్టర్‌ అభినయ సహా 29 మంది బరిలో ఉన్నారు.

Published : 03 Jul 2024 00:34 IST

విక్రవాండిలో జోరుగా పార్టీల ప్రచారం

 అన్బుమణి రామదాసు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక 10న జరగనుండటంతో ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎంకే తరఫున అన్నియూర్‌ శివ, ఎన్డీఏ కూటమిలో పీఎంకే నుంచి సి.అన్బుమణి, ఎన్టీకే తరఫున డాక్టర్‌ అభినయ సహా 29 మంది బరిలో ఉన్నారు. గెలుపు కోసం డీఎంకే ప్రత్యేకంగా ఎన్నికల వర్కింగ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్, తంగం తెన్నరసు, సెంజి మస్తాన్‌తో పాటు 25 మంది మంత్రులు, ఎమ్మెల్యేలను నియమించారు. గత శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఆదివారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు విక్రవాండిలో మకాం వేసి ఓటర్లను కలుస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన, అమలు చేస్తున్న పథకాలు ప్రస్తావిస్తూ ఓట్లు కోరుతున్నారు. డీఎంకే తరఫున ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడికి వెళ్లేవారికి ఉచితంగా టీ, బజ్జీలు, వడలు ఉచితంగా అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు అక్కడికొచ్చి సమస్యలు తెలిపితే వెంటనే పరిష్కరిస్తుండటంతో కార్యాలయం ప్రజలతో రద్దీగా ఉంటోంది.
ప్రచారంలో భాగంగా పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాసు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అదే సమయంలో పీఎంకే తరఫున రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు గ్రామాల్లో మకాం వేసి డీఎంకే ప్రచారాలపై అన్బుమణికి సమాచారం ఇస్తున్నారు. కల్తీ సారా మరణాలు, నకిలీ మద్యం తదితర అంశాలను ప్రస్తావిస్తూ మహిళల ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. సౌమ్య అన్బుమణి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఎన్‌టీకే కో-ఆర్డినేటర్‌ సీమాన్‌ గ్రామ గ్రామానికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని