logo

ప్రభుత్వ టెండర్లలో పారదర్శకతేది?

రాష్ట్రంలో టెండర్లు పిలిచే ఈ-ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థలోనూ లోపాల్ని గుర్తించింది. ఇందులోని ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంచడంలేదని పేర్కొంది.

Published : 01 Jul 2024 01:22 IST

రాష్ట్ర ఈ-ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థలో లోపాలు
కాగ్‌ నివేదికలో పలు ఆధారాలు
బయటి రాష్ట్రాల  కార్మికుల నమోదులో నిర్లక్ష్యం
ఈనాడు-చెన్నై

తమిళనాడు ఈ-ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగే టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయనే కోణంలో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక ఆక్షేపణలు చేసింది. పారదర్శకత విషయంలో అనుమానాలు వ్యక్తంచేయడంతో పాటు గుత్తేదార్లు అక్రమంగా టెండర్లు దక్కించుకోవడంలో ప్రభుత్వ శాఖల పనితీరునూ తప్పుబట్టింది. అసెంబ్లీలో తాజాగా విడుదల చేసిన ఈ నివేదికలు ప్రభుత్వ విభాగాల అవినీతికి నిదర్శనంగా ఉన్నాయి.

రాష్ట్రంలో టెండర్లు పిలిచే ఈ-ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థలోనూ లోపాల్ని గుర్తించింది. ఇందులోని ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంచడంలేదని పేర్కొంది. గుత్తేదారుల మధ్య పోటీని ప్రోత్సహించే వాతావరణం ఉండాలిగానీ, ఇక్కడలా కనిపించడంలేదని వివరించింది. ఇది బిడ్‌లో రిగ్గింగ్‌ జరుగుతుందనడానికి సంకేతంగా భావించాల్సి వస్తోందని తెలిపింది. బిడ్‌ వేసినవారి బంధువులే గుత్తేదారులుగా నమోదవడం, వేర్వేరు గుత్తేదారులు ఒకే ఐపీ చిరునామాతో ఉన్న కంప్యూటర్‌ నుంచి టెండరు వేయడం వంటి చాలా లోపాలు బయటపడ్డాయని వివరించింది. 2023కి సంబంధించి కాగ్‌ తన నివేదికలో వీటిని పేర్కొంది. బిడ్‌లో పాల్గొన్న గుత్తేదారులు మోసపూరిత విధానాలవైపు వెళ్లారని చెప్పింది. వీటిని గుర్తించే ప్రక్రియలో అధికారులు విఫలమయ్యారని తెలిపింది.

ప్రభుత్వ కార్యాలయాల నుంచే..

కాగ్‌ పరిశీలించిన దాన్నిబట్టి.. 2016 నుంచి 2022 మధ్య 1.34లక్షల టెండర్ల ప్రక్రియను నేరుగా చేసింది. 46.27శాతం టెండర్లు కేవలం రెండేసి బిడ్‌లతోనే ఉన్నాయని తెలిపింది. 208 టెండర్లలో కొన్ని అవకతవకల్ని గుర్తించింది. ఇందులో 444 మంది బిడ్‌ వేయగా.. వీరంతా ఒకే ఐపీ అడ్రస్‌తో ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారని వివరించింది. ఇందులో మరో ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగే టెండర్లకు ఒకే కంప్యూటర్‌ ఐపీ అడ్రస్‌ నుంచి బిడ్‌లను వేశారని ఓ మాటగా చెప్పగా.. ఈ అప్‌లోడ్‌లన్నీ ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ నుంచే కావడం ఆందోళన కలిగించే విషయమని చెప్పింది. దీన్నిబట్టి ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ అతిక్రమణల్లో భాగంగా ఉన్నారనే అనుమానం వ్యక్తం చేసింది. టాస్మాక్‌ టెండర్లలోనూ అవకతవకలు జరిగాయని పలు ఉదాహరణలను పేర్కొంది. తద్వారా స్వల్ప నష్టాల్ని చవిచూస్తోందంటూ వివరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.126.25 కోట్ల వ్యత్యాసమున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ చూపించినట్లుగా వెల్లడించింది.

చట్టం అమలు అంతంతమాత్రమే..

ఈ-ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించి 15 ఏళ్లు దాటినా.. సుమారు 74శాతం సేకరణ సంస్థలు అసలు ఈ వ్యవస్థను వాడుకోకపోవడానికి కారణమేంటనే కోణంలో కాగ్‌ అనుమానాల్ని వ్యక్తం చేసింది. ఈ పోర్టల్‌తో సంబంధమున్న అధికారిక వ్యవస్థ దీనికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరముందని తెలిపింది. ఎందుకు చైతన్యపరచలేదో సరిచూసుకోవాలని వివరించింది. టెండర్ల మూల్యాంకన నివేదికల్ని సైతం అధికారులు అప్‌లోడ్‌ చేయడంలేదని, పారదర్శక ప్రక్రియ లేకపోవడానికి ఇది కూడా కారణమని వివరించింది. ఆన్‌లైన్‌ వ్యవస్థపై కాకుండా మాన్యువల్‌ రికార్డులమీదే అధికారులు ఆధారపడుతుండటాన్ని గుర్తించింది. టెండర్లలో పారదర్శక నిబంధనలు-2000 చట్టాన్ని ప్రభుత్వ శాఖలు అమలుచేయడంలేదని ఎత్తిచూపింది. ఈ నిబంధనలకు తగ్గట్లు ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకోలేకపోయారని పేర్కొంది.

కార్మిక సంక్షేమం గాలికి..

  • కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఏర్పాటైన తమిళనాడు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు (టీఎన్‌సీడబ్ల్యూబీ) పనితీరులో లోపాలున్నట్లు కాగ్‌ గుర్తించింది. ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులను తమ పరిధిలోకి తీసుకురావడంలో, వారి వివరాల్ని నమోదు చేయడంలో అలసత్వం వహించిందని పేర్కొంది. సుమారు 1.45 లక్షల మంది బయటి రాష్ట్రాల కార్మికులు తమ పేర్లను నమోదుచేసుకోనట్లుగా తేలిందని వివరించింది.
  • మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకూ అవస్థలు తప్పడంలేదని వెల్లడించింది. పథకాలు అందడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోందని స్పష్టత ఇచ్చింది. దీనిపై కార్మికుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని గుర్తుచేసింది.
  • పథకాల అమలులో స్పష్టత లేకపోవడంలో అనర్హులు సైతం లబ్ధి పొందిన దాఖలాలున్నాయని వివరించింది. ప్రత్యేకించి కొవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రయోజనాల్ని కార్మికులకు విస్తరించలేకపోయారని పేర్కొంది. కొందరు ఒకసారికి మించి లబ్ధిపొందారని తెలిపింది.

ప్రక్షాళనకు 20 ప్రతిపాదనలు

భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నిర్మాణ వ్యయాన్ని తగ్గించడాన్ని కాగ్‌ గుర్తించింది. నిర్మాణాలకు అనుమతులిచ్చే సమయంలోనూ కార్మిక పన్నును వసూలు చేసే క్రమంలోనూ లోపాల్ని ఎత్తిచూపింది. నిర్మాణ వ్యయాల అంచనాలను సరిచేసే వ్యవస్థనూ తీసుకురాలేకపోయిందని చెప్పింది. కార్మిక సంక్షేమ బోర్డు పనితీరులో తీసుకురావాల్సిన మార్పులపై కాగ్‌ 20 ప్రతిపాదనలు చేసింది. కార్మికుల డాటాను ఆదునికీకరించడంతో పాటు భవన నిర్మాణ అంచనాలపై సరైన నిబంధనలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. వాటికి కట్టుబడి ఉండేలా కార్మిక సంక్షేమ బోర్డును గాడిలో పెట్టాలని సలహా ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని