logo

ఏడాదిలో 8 నెలలపాటు తీవ్ర ఎండలు

వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారతదేశంలో కరవు, వడగాలుల ప్రభావం ఎక్కువైంది.

Published : 01 Jul 2024 09:14 IST

అన్నా వర్సిటీ అధ్యయనంలో వెల్లడైన ఆందోళనకర విషయాలు

ప్యారిస్, న్యూస్‌టుడే: వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారతదేశంలో కరవు, వడగాలుల ప్రభావం ఎక్కువైంది. ఓ వైపు బెంగళూరు, దిల్లీ మొదలైన నగరాలు నీటి ఎద్దడితో అల్లాడుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఎండతో పాటు ఆకస్మిక భారీవర్షాలు కురుస్తుండటం పెద్ద సమస్యగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర పరిణామాలు నెలకొంటున్న స్థితిలో ఓ అధ్యయన ఫలితాలు రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడాదిలో 8 నెలలపాటు ఎండ తీవ్రత ఉంటుందని, ఉష్ణోగ్రతలను ప్రజలు భరించలేక తీవ్రంగా ఇబ్బంది పడతారని అన్నా విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

అసాధారణ మార్పులు

అన్నా వర్సిటీలోని వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ కేంద్రం జరిపిన అధ్యయనంలో... నిరంతర పట్టణీకరణ కారణంగా రాష్ట్రంలోని నగరాలతో పాటు దేశంలో ఉన్న 21 నగరాల్లో రానున్న 25 ఏళ్లలో ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉండి, 2050 నాటికి ప్రస్తుతం వేసవి కాలంలో ఉన్నదాని కన్నా  రెండింతలు ఉష్ణోగ్రతలు ఏడాదిలో 8 నెలలపాటు ఉంటాయని, ప్రజలు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని వివరించింది. రాష్ట్రంలో గత 30 ఏళ్లుగా సగటు ఉష్ణోగ్రతలు 29.5 నుంచి 33.4 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యాయని, సగటు వర్షపాతం 763 మి.మీ నుంచి 1432 మి.మీ వరకు ఉందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న సగటు ఉష్ణోగ్రతలు 2050లో 0.4 డిగ్రీ సెల్సియస్‌ పెరుగుతాయని, 2080లో 1.3 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుతాయని అంచనా వేసింది. అదేవిధంగా 2,100 నాటికి సగటు ఉష్ణోగ్రత 1.7 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుతుందని, రాష్ట్రంలో ఉత్తర జిల్లాలైన చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూర్, చెంగల్పట్టు, రాణిపేట తదితర జిల్లాల్లో రానున్న కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అంతేకాకుండా చెన్నై, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, తంజావూరు తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న దానికన్నా రెండింతలు అధికంగా వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. అంతేకాకుండా అసాధారణ వర్షాలు కూడా రాష్ట్రంలో బాధింపు కలిగిస్తాయని అంచనా వేసింది. సముద్రతీర జిల్లాల్లో స్వల్ప కాలంలో అసాధారణంగా భారీవర్షాలు కురుస్తాయని, 2050లో సగటు వర్షపాతం 4 శాతం, 2080లో 11 శాతం, 2100లో 16 శాతం పెరుగుతాయని, ఒకవేళ కాలుష్యం పెరిగితే 2050లో 7 శాతం, 2,100లో 26 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కడలూరు, నాగపట్టణం, మైలాడుదురైలో ఈ సగటు వర్షపాతంలో మార్పు కనిపిస్తుందని, 24 గంటల్లో 6 నుంచి 7 సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని