logo

ఉప్పు తగ్గించుకుంటే ఉపయోగకరమే!

సేపియన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీఎం)లోని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ’ ఆధ్వర్యంలో ఆదివారం ‘తక్కువ ఉప్పుతో కూడిన ఆహారం’ (లో సాల్ట్‌ డైట్) అంశంపై ప్రత్యేక కార్యశాల జరిగింది.

Published : 01 Jul 2024 01:09 IST

ఆరోగ్యకర ఆహారంపై ‘ఐఐటీఎం’లో కార్యశాల

పుస్తకావిష్కరణలో డాక్టర్‌ టీఎస్‌ సెల్వ వినాయగం, డాక్టర్‌ రాజన్‌ రవిచంద్రన్‌ తదితరులు

వడపళని, న్యూస్‌టుడే: సేపియన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీఎం)లోని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ’ ఆధ్వర్యంలో ఆదివారం ‘తక్కువ ఉప్పుతో కూడిన ఆహారం’ (లో సాల్ట్‌ డైట్) అంశంపై ప్రత్యేక కార్యశాల జరిగింది. రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టరు డాక్టర్‌ టీఎస్‌ సెల్వ వినాయగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంటు వ్యాధులతో దాదాపు 65 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీన్ని నివారించేందుకు ఉప్పు, చక్కెర తత్సంబంధిత పదార్థాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలన్నారు. ప్రస్తుతం మనం వాడే ఉప్పును 30శాతానికి తగ్గించుకుంటే అధిక ఒత్తిడి 25 శాతం వరకు తగ్గుతుందన్నారు. ప్రస్తుత కాలంలో అనేక మంది ఫాస్ట్‌ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారని, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని హితవుపలికారు. 70 నుంచి 80 శాతం వరకు ఉప్పు మనకు తెలియకుండానే శరీరంలోకి చేరుకుంటోందన్నారు. సేపియన్స్‌ సంస్థ ఛైర్మన్, ఐఐటీ ఆచార్యులు డాక్టర్‌ రాజన్‌ రవిచంద్రన్‌ మాట్లాడుతూ... మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ఎంత పరిమాణంలో ఉండాలో వివరించారు. ఆరోగ్యకర ఆహారంపై అవగాహన కల్పిస్తూ సేపియన్స్‌ సంస్థ చేస్తున్న కృషిని ఐఐటీ ఆచార్యులు, డైరెక్టరు వి.కామకోటి అభినందించారు. ఉప్పు తగ్గించడంపై అంతర్జాతీయంగా జరుగుతున్న ఉద్యమాల గురించి ‘రిసాల్వ్‌ టు సేవ్‌ లైవ్స్‌’ (ఆర్టీఎస్‌ఎల్‌) ఇండియా డైరెక్టరు డాక్టర్‌ అమిత్‌ షా వివరించారు. చికిత్స కోసం వచ్చే రోగులకు కూడా వైద్యులు ఉప్పు తక్కువ తీసుకోవాలని అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు వైద్యులు, నిపుణులు పాల్గొని ఉప్పుతో కలిగే అనర్థాల గురించి చెప్పారు. సేపియన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ ఆర్‌.సుందర్‌ వందన సమర్పణ చేశారు. ముంబయి, దిల్లీలో కూడా కార్యశాలలు నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఐఐటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యుల కోసం ‘మాన్యువల్‌ ఆన్‌ సాల్ట్‌ గైడ్‌లైన్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని