logo

Kushboo: నటి ఖుష్బూపై ఫిర్యాదు

సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు చేపట్టాలని వీసీకే తరఫున పోలీసు కమిషనరు కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల క్రితం సినీ నటి త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే.

Updated : 25 Nov 2023 07:11 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు చేపట్టాలని వీసీకే తరఫున పోలీసు కమిషనరు కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల క్రితం సినీ నటి త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఖుష్బూ తన ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ఓ ఫాలోవర్‌ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘మీలా లోకల్‌ భాషలో మాట్లాడలేన’ని తెలిపారు. దీనిపై పలు దళిత వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో దళితులు మాట్లాడే భాషను తక్కువగా చేసి కించపరిచారని, ఖుష్బూపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు చేపట్టాలని పోలీసు కమిషనరు కార్యాలయంలో వీసీకే నేతలు ఫిర్యాదు చేశారు.

క్షమాపణ చెప్పాలి..

చెన్నై, న్యూస్‌టుడే: ఎస్సీలను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ ట్వీట్‌ చేశారని, అందుకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంజన్‌ కుమార్‌ తెలిపారు. సత్యమూర్తిభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. త్రిష వ్యవహారంలో చర్యలు చేపట్టాలని ఆసక్తి చూపుతున్న ఖుష్బూ.. మణిపుర్‌ మహిళలపై అరాచకాల సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు తొలగించి బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఖుష్బూ ఇంటిని ముట్టడిస్తామన్నారు.

ఇంటి వద్ద భద్రత

ఖుష్బూ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం తరఫున శుక్రవారం సాయంత్రం ఆమె ఇంటిని ముట్టడించి ఆందోళన చేపట్టనున్నట్లు సమాచారం వెలువడింది. దీంతో చెన్నై శాంథోంలోని ఆమె ఇంటి వద్ద ఇన్‌స్పెక్టరు నేతృత్వంలో ఇద్దరు ఎస్సైలు, 33 మంది మహిళా పోలీసులు భద్రతా విధులు చేపట్టారు. అయితే ముట్టడి వాయిదా పడటంతో ఖుష్బూ ఇంటికి కల్పించిన భద్రతను వెనక్కి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.


భద్రతా విధుల్లో పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని