logo

Tamil Nadu: కళ్లు చెదిరేలా కొత్త విమానాశ్రయం.. టెర్మినల్‌కు రెండువైపులా రన్‌వేలు

ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు వీలుగా భారీ టెర్మినల్‌ భవనాలు. చుట్టూ విమానాలు నిలిచేందుకు వీలుగా ఏర్పాట్లు. హరితానికి పెద్దపీట వేసేలా ఎటుచూసినా పచ్చదనం.

Updated : 30 May 2024 08:52 IST

ఎన్నికల కోడ్‌ పూర్తవగానే అనుమతులకు ప్రతిపాదన

ప్రభుత్వం విడుదల చేసిన నమూనా 
ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు వీలుగా భారీ టెర్మినల్‌ భవనాలు. చుట్టూ విమానాలు నిలిచేందుకు వీలుగా ఏర్పాట్లు. హరితానికి పెద్దపీట వేసేలా ఎటుచూసినా పచ్చదనం. రాత్రివేళ ధగధగ మెరిసేలా విద్యుత్తు కాంతులు. చెన్నై విమానాశ్రయానికన్నా భిన్నంగా నగరానికి రెండో విమానాశ్రయంగా కాంచీపురం జిల్లా పరందూరు పరిధిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రాబోతోంది. విమానాశ్రయం ఎలా ఉండాలనేదానిపై ఇప్పటికే ప్రాథమిక అంచనాతో వచ్చిన అధికారులు.. ఇప్పుడు పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ముందుకెళ్లాలని చూస్తున్నారు.

ఈనాడు-చెన్నై: కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ(టిడ్కో) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రాజెక్టును రూ.20వేల కోట్లతో చేపట్టాలని అంచనా వేస్తున్నారు. నిర్మాణాలు త్వరగా మొదలుపెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టెండర్లు ఆహ్వానించేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో.. ఈ గడువు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని చూస్తున్నారు. టెర్మినల్‌కు రెండువైపులా రన్‌వేలు నిర్మించనున్నారు.

అనుమతులే కీలకం

గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల పాలసీ నిబంధనల మేరకు అనుమతులు పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనల్ని స్టీరింగ్‌ కమిటీ ముందు ఉంచనున్నారు. నిర్మాణాలకు కేంద్ర అనుమతులు కూడా తప్పనిసరి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నుంచి పర్యావరణ అనుమతులకూ పంపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. వారొచ్చి ప్రతిపాదిత ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆమోదం పొందేలా ప్రణాళికలున్నాయి. ఇవన్నీ ఈ ఏడాదే జరగొచ్చని అధికారులు అంచనాతో ఉన్నారు.

లోతైన పరిశోధన..

గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాశ్రయం ప్రతిపాదిత ప్రాంతంలోని అడ్డంకుల్ని సామరస్యంగా పరిష్కరించుకు నేందుకు ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. వారు ఆ స్థలాన్ని పలుమార్లు పరిశీలించారు. భూగర్భజలాలు, వరద ముప్పు, వర్షాల తీరు.. తదితర అంశాలకు సంబంధించి పలు దశాబ్దాల రికార్డులు పరిశీలించారు. దానిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

మెట్రోతో అదనపు హంగు

ఇప్పటికే పరందూర్‌ విమానాశ్రయం దాకా మెట్రో పనులు చేపట్టాలని ప్రణాళికలు చేశారు. పూందమల్లి నుంచి పరందూర్‌ దాకా 43.6 కి.మీ. మెట్రో మార్గాన్ని వృద్ధి చేయడంతో పాటు 19 మెట్రోస్టేషన్లు నిర్మించేలా ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి డీపీఆర్‌ను రూపొందించే పనిలో అధికారులున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.10,712 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. నగరం నుంచి కొత్త విమానాశ్రయానికి విస్తరణ పూర్తయితే ప్రయాణికులకు మరింత, కాంచీపురం వాసులకు ఇంకా సౌకర్యవంతమవుతుంది. మరోవైపు విమానాశ్రయంలో కార్గో సేవలతో పాటు ఇతరత్రా వాణిజ్యసేవలూ అందుబాటులోకి రానున్నాయి.

ఆగని నిరసనలు

విమానాశ్రయం కోసం భూములు ఇచ్చేవారికి స్థానిక మార్కెట్ విలువకన్నా 3.5 రెట్లు ఎక్కువగా డబ్బులిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరందూరు పరిసరాల్లోని 13 గ్రామాలకు దీన్ని వర్తించేలా ప్రకటన చేశారు. అక్కడి ప్రజలకు చట్టప్రకారంగా పునరావాసం, ఉపాధి కల్పించేందుకూ చర్యలు చేపడతామని అంటున్నారు. స్థానికంగా నిరసనలు మాత్రం ఆగడంలేదు. తమ భూములు, ఉపాధి కోల్పోతున్నామని ఆరోపిస్తూ పలు గ్రామాలవారు నిరసన కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం 13 గ్రామాల పరిధిలో 4563.56 ఎకరాల స్థలం అవసరమని ప్రతిపాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని