logo

రూ.30 కోట్ల భూమిలో వైకాపా గద్దలు

వైకాపా నేతల భూదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయిందనేందుకు ఇదో నిదర్శనం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు కొందరు గద్దల అవతారమెత్తారు. తమకు అడ్డేముందంటూ రెచ్చిపోయారు.

Published : 03 Jul 2024 02:09 IST

అధికారముందని నాడు గొర్రెల బీడులో పాగా
ఆక్రమించి ఆపై చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు
స్థలంలోకి రావొద్దంటూ గ్రామస్థులకు బెదిరింపులు

ఆక్రమణలో ఉన్న మార్కాపురం మండలం బోడపాడులోని ప్రభుత్వ భూమి

వైకాపా నేతల భూదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయిందనేందుకు ఇదో నిదర్శనం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు కొందరు గద్దల అవతారమెత్తారు. తమకు అడ్డేముందంటూ రెచ్చిపోయారు. కనిపించిన ప్రభుత్వ భూముల్లో పాగా వేశారు. అధికారుల అండతో వాటిని హస్తగతం చేసుకునే పన్నాగాలు పన్నారు. అదేమని అడిగిన వారిపై బెదిరింపులకు దిగుతూ అక్రమాల పరంపర కొనసాగించారు. ఘోర ఓటమి తర్వాత ఈ తరహా  ఉదంతాలు మార్కాపురంలో ఇప్పుడు అనేకం వెలుగు చూస్తున్నాయి. మార్కాపురం మండలం బోడపాడులో ఓ ప్రజాప్రతినిధి తన బంధువర్గంతో కలిసి సాగించిన భూబాగోతం ఇటువంటి వాటిలో ఒకటి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పూర్వం నుంచి గొర్రెల మందల కోసం కేటాయించిన భూమితో పాటు.. గ్రామానికి సమీపంలోనే ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన జాగాను కూడా ఆక్రమించారు.  చుట్టూ ముళ్లకంచె వేసి ఇతరులెవరూ ఆ భూమిలోకి రాకూడదంటూ ఏకంగా బెదిరింపులకు గురిచేస్తున్నారు.

న్యూస్‌టుడే, మార్కాపురం          

  • బంధువులతో కలిసి 15 ఎకరాల మేత... : మార్కాపురం మండలం బోడపాడు గ్రామం పెద్ద యాచవరం రెవెన్యూ ఇలాకాలోని సర్వే నంబరు 71-1లో 10.31 ఎకరాలు, సర్వే నంబరు 71-ఏలో 15.31 ఎకరాలు, సర్వే నంబరు 71-1ఏలో 5 ఎకరాలు.. మూడు సర్వే నంబర్లల్లో మొత్తం 30.62 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఈ సర్వే నంబర్లలోని భూమి ఆన్‌లైన్‌లో ప్రభుత్వ    భూమిగానే చూపుతోంది. పాత ఆర్‌ఎస్‌ఆర్‌లోనూ ఎవరి పేర్లు లేకుండా చుక్కల భూమి అని నమోదైంది. ఎవరి పేర్లు మీద లేని ప్రభుత్వ భూమిలో పూర్వం నుంచి గొర్రెల మందల మేత, సేద తీరడానికి ఉపయోగించుకునేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై ఓ ప్రజాప్రతినిధి, అతని బంధువర్గం కన్ను పడింది. మొత్తం భూమిలో 15 ఎకరాల వరకు ఆక్రమించారు. చుట్టూ ముళ్లకంచె ఏర్పాటు చేశారు. గత అయిదు సంవత్సరాలుగా ఏ ఒక్కరూ అటుగా రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ భూమి   విలువల బహిరంగ మార్కెట్‌లో రూ. 30 కోట్ల వరకు ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు.

  • చెప్పినా.. చెర విడిపించని యంత్రాంగం... : ఊరుమ్మడి భూమి ఆక్రమణపై గత అయిదేళ్ల కాలంలో అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదులు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో వైకాపా ప్రభుత్వమే అధికారంలో ఉండటం.. ఆక్రమణదారు ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో ఏ ఒక్కరూ స్పందించలేదు. ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుంచి విముక్తి కల్పించలేదు. బాధితులు పలు మార్లు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి స్పందన లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విలువైన భూమిని కాపాడాలని, ఆక్రమణ చెర నుంచి విడిపించి ఊరుమ్మడి అవసరాలకు వినియోగించుకునేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై మార్కాపురం తహసీల్దార్‌ రవికుమార్‌ మాట్లాడుతూ.. బోడపాడులో ప్రభుత్వ భూమి ఆక్రమణను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. ఆక్రమించినట్లు తేలితే తదుపరి చర్యలు తీసుకుంటామని.. భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు