logo

వదిలింది బొమ్మ్ఠాళీ.. రద్దు రూ.80 వేలు

వైకాపా ప్రభుత్వం తెచ్చిన తలనొప్పుల్లో జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ఒకటి. ఇందులో భాగంగా జిల్లాలో చేపట్టిన రీసర్వే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

Published : 03 Jul 2024 02:05 IST

జగన్‌ చిత్రంతో ఇచ్చిన పాసుపుస్తకాన్ని చూపుతున్న రైతు ప్రభాకర్‌రావు

ఈనాడు, ఒంగోలు: వైకాపా ప్రభుత్వం తెచ్చిన తలనొప్పుల్లో జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ఒకటి. ఇందులో భాగంగా జిల్లాలో చేపట్టిన రీసర్వే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కొన్నిచోట్ల భూముల విస్తీర్ణం తగ్గిపోయింది. భాగ పరిష్కారం చేసుకున్న వాటిల్లో సర్వే నంబరులో ఉండాల్సిన భూమి కంటే తక్కువ నమోదైంది. తప్పుల తడకగా పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సమస్యలు పరిష్కరించాలని రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఆన్‌లైన్‌లో సబ్‌ డివిజన్‌ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో క్రయ, విక్రయాలకూ కష్టాలు తప్పడం లేదు. పాసుపుస్తకాలు ఇచ్చినా అందులోని భూములకు సంబంధించి 1బీ అడంగల్‌ రాకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు అందక, రిజిస్ట్రేషన్‌ చేసుకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ఒప్పించకుండా వదిలేశారు...: జగనన్న రీ సర్వే కింద జిల్లాలో మొత్తం 822 గ్రామాలను గుర్తించారు. ఒంగోలు డివిజన్‌లోని 12 మండలాల్లో 114, కనిగిరి డివిజన్‌లోని 13 మండలాల్లో 126, మార్కాపురం డివిజన్‌లోని 13 మండలాల్లోని 58 గ్రామాలు కలిపి మొత్తంగా 298 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. ఒంగోలు పరిధిలో 2.19 లక్షల ఎకరాలకు 1.48 లక్షల ఎల్‌పీఎంలు, కనిగిరి డివిజన్‌లో 2.38 లక్షల ఎకరాలకు 1.26 లక్షల ఎల్‌పీఎంలు, మార్కాపురం డివిజన్‌లో 97 వేల ఎకరాలకు 69 వేలు మొత్తంగా జిల్లాలో రీసర్వే పూర్తిచేసిన 298 గ్రామాల్లో 5.55 లక్షల ఎకరాలకు సంబంధించి 3.44 లక్షల ఎల్‌పీఎంలు కేటాయించారు. చాలా గ్రామాల్లో ఎల్‌పీఎం కేటాయింపు సహా అనేక సమస్యలు తలెత్తాయి. పక్క పొలాల రైతులను ఒప్పించి సరిహద్దులు సరిచేయాల్సిన సిబ్బంది అది తమ పని కాదని వదిలేశారు. సర్వే నంబరు వారీగా వేర్వేరు ఎల్‌పీఎంలు కేటాయించాల్సి ఉన్నా అన్నింటికీ ఒకటే ఇచ్చారు. భూములు ఎక్కువ తక్కువగా నమోదు చేసి జగన్‌ చిత్రంతో పాసుపుస్తకాలిచ్చేశారు. సమస్యలు అపరిష్కృతంగా ఉండటంతో కొందరు రైతులు విముఖత చూపారు. పాసుపుస్తకాలు తీసుకున్న వారిలో ఇంకొందరు బ్యాంకు రుణాలందక అవస్థలు పడుతున్నారు.

పాసు పుస్తకాలపై ఇక రాజముద్రే..

గత ప్రభుత్వంలో కొత్తగా జారీ చేసిన పాసుపుస్తకాలు, రీసర్వే పూర్తయినచోట రైతులకు అప్పటి సీఎం జగన్‌ చిత్రంతో ఎనభై వేల వరకు పాసుపుస్తకాలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తామని, జగన్‌ చిత్రపటంతో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల స్థానంలో కొత్తవి ఇస్తామని నాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఆయన ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఇచ్చిన హామీ మేరకు పాసుపుస్తకాలపై జగన్‌ బొమ్మను తీసేసి రాజముద్రతో కొత్తవి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనిపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రీసర్వే కారణంగా తలెత్తిన తప్పులు, ఇతర లోపాలనూ సరిద్దాలని కోరుతున్నారు.

పొరపాట్లు సరిచేసుకోవచ్చు...

ఇప్పటి వరకు 298 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి చేశాం. ఆన్‌లైన్‌ సబ్‌ డివిజన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. రైతులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సబ్‌ డివిజన్‌ ఇస్తాం. ఆ ప్రకారం రైతులు క్రయవిక్రయాలు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ అవుతుంది. రీసర్వేలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకున్నా సరిచేసుకోవచ్చు. రాజముద్రతో పాసుపుస్తకాల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

కిషోర్‌బాబు, ఏడీ, సర్వే, భూ రికార్డుల శాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు