logo

న్యాయం.. భారతీయ స్వరూపం

రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా, ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం. ఫిర్యాదు అందిన స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్‌కు కేసును బదిలీ చేసే వెసులుబాటు.

Published : 03 Jul 2024 02:00 IST

కొత్త చట్టాల అమలుకు శ్రీకారం
ఎక్కడి నుంచైనా ఫిర్యాదుకు ఆస్కారం
అవగాహన కల్పిస్తున్న పోలీసు యంత్రాంగం

భారతీయ న్యాయ చట్టాలపై వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు(పాత చిత్రం)

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా, ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం. ఫిర్యాదు అందిన స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్‌కు కేసును బదిలీ చేసే వెసులుబాటు. బాధితులు పోలీసు స్టేషన్‌ మెట్లెక్కకుండానే ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫిర్యాదులు చేసే వీలు. సమన్లు, ఎఫ్‌ఐఆర్‌ కాపీలు సైతం ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా పొందే అవకాశం. అన్నింటికీ మించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చట్టాల రూపకల్పన. వెరసి ఇదీ నూతన భారతీయ న్యాయ చట్టాల స్వరూపం. జులై ఒకటి నుంచి నూతన చట్టాలు అమలులోకి వచ్చాయి. తొలినాళ్లలో కొంత అయోమయం, గందరగోళం సహజం. దీంతో అన్ని వర్గాల ప్రజల్లో సందేహాల నివృత్తి కోసం పోలీసు శాఖ జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

  • పాత చట్టాలకు చెల్లుచీటీ...: బ్రిటిష్‌ కాలం నాటి న్యాయ చట్టాలకు కాలం చెల్లింది. బాధితులకు సత్వర న్యాయం, దోషులకు స్వల్పకాలంలోనే శిక్షలు పడేలా నూతన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), ఐఈఏ స్థానంలో భారతీయ శిక్షా అధీనియం(బీఎస్‌ఏ) వంటి చట్టాలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రజలకు నూతన చట్టాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ నడుం బిగించింది.
  • కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ వరకు...: తొలుత పోలీసు శాఖ నుంచే అవగాహనకు అంకురార్పణ చేశారు. కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ స్థాయి వరకు పోలీసు స్టేషన్, సర్కిల్, సబ్‌ డివిజన్‌లతో పాటు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగం, హోంగార్డ్స్‌ సిబ్బందికి గత రెండు నెలల నుంచి వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జూమ్‌ కాన్ఫరెన్స్‌ల ద్వారా చట్టాల గురించి తెలుపుతున్నారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించి నూతన చట్టాలపై సందేహాలను నివృత్తి చేస్తున్నారు. జిల్లాలోని న్యాయాధికారులు, న్యాయవాదులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి కేసుల దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. క్రైమ్, క్రిమినల్స్‌ ట్రాకింగ్, నెట్‌వర్కింగ్‌ సిస్టమ్‌(సీసీటీఎన్‌ఎస్‌)లో ప్రతిరోజూ కేసుల పురోగతిని అప్‌లోడ్‌ చేస్తున్నారు.
  • నిర్దిష్ట కాలపరిమితి విధింపు...: నూతన చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలకు అంకురార్పణ చేసింది. అందులో భాగంగా కేసుల విచారణకు నిర్దిష్ట కాలపరిమితి విధించటం కీలకాంశం. బాధితులు, ఫిర్యాదుదారులకు కేసుకు సంబంధించిన వివరాలు తొంభై రోజుల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది. పదిహేనేళ్లలోపు పిల్లలు, దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్టేషన్‌కు హాజరుకాకుండా వారి ఇంటి వద్ద, కోరిన ప్రదేశంలో విచారణకు అవకాశం కల్పించింది. చిన్నాచితకా నేరాలకు జైలుశిక్ష, జరిమానా స్థానంలో సమాజ సేవ చేసేలా నూతన చట్టాలను రూపొందించారు. వీటిపై కేవలం పోలీసులకే కాకుండా జిల్లాలో అన్ని వర్గాల ప్రజానీకానికీ అవగాహన కల్పించేలా జిల్లా పోలీసులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు నూతన చట్టాల గురించి తెలుపుతున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని