logo

పింఛను అదనపు లబ్ధి రూ.87 కోట్లు

నెల రోజుల్లోనే సామాజిక పింఛన్ల పంపిణీలో ఎంతో మార్పు చోటుచేసుకుంది. లబ్ధిదారులకు ఇస్తామన్న నగదును ఇంటి వద్దనే అందించింది తెదేపా కూటమి ప్రభుత్వం.

Published : 03 Jul 2024 01:56 IST

‘విడతల’ వారీగా వైకాపా మోసం
ఆనందం నింపిన కూటమి ప్రభుత్వం

ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శి మండలం సామంతపూడికి చెందిన వెంకటేశ్వర్లుకు నగదు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది

ఈనాడు, ఒంగోలు: నెల రోజుల్లోనే సామాజిక పింఛన్ల పంపిణీలో ఎంతో మార్పు చోటుచేసుకుంది. లబ్ధిదారులకు ఇస్తామన్న నగదును ఇంటి వద్దనే అందించింది తెదేపా కూటమి ప్రభుత్వం. మళ్లీ అధికారంలోకి వస్తే రూ.3 వేలు చేస్తామని 2019 నాటి ఎన్నికల సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే మొత్తం తామూ ఇస్తామంటూ వైకాపా ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు అందిస్తున్న మొత్తానికి తోడు కేవలం రూ.250 పెంచి ఇచ్చింది. ఏటా పెంచుతూ పోతామని అయిదేళ్లకు రూ.3 వేలు ఇస్తామంటూ తానిచ్చిన హామీకి వక్రభాష్యాలు చెబుతూ లబ్ధిదారులను అయిదేళ్లు మోసగించింది. ఫలితంగా ఒక్కో లబ్ధిదారు రూ.32 వేలు చొప్పున నష్టపోయారు. జిల్లావ్యాప్తంగా పరిశీలిస్తే ఆ మోసం విలువ అయిదేళ్లలో రూ.932 కోట్లు. ఇటీవల ఎన్నికల సభల్లో పింఛన్‌ నగదు రూ.4 వేలు ఇస్తామన్న ఎన్డీఏ కూటమి.. అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది రోజుల్లోనే చేసి చూపింది. పెంపుతో పాటు మరో రూ.3 వేలు అదనంగా అందించింది. ఈ మేరకు లబ్ధిదారులకు రూ.87 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది. పేదల మోముల్లో నవ్వులు విరబూసేలా చేసింది. పింఛన్ల పంపిణీ విషయమై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మాట్లాడారు. జిల్లాలో 2.92 లక్షల మంది లబ్ధిదారులకు పదకొండు రకాల ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పక్కా ప్రణాళికతో పంపిణీ చేశామన్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే నగదు అందజేసేలా చూశామని తెలిపారు. ఇందుకుగాను శనివారమే అధికారులు, సిబ్బందిని సన్నద్ధం చేశామని.. నియోజకవర్గానికి ఒక అధికారికి పర్యవేక్షణ బాధ్యత అప్పగించినట్లు వివరించారు. ఎక్కడైనా సాంకేతిక కారణాలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొలిరోజు మిగిలిపోయిన వారికి రెండో రోజూ అందించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని