logo

ఇన్ని రోజులు గుడ్లు పెడుతున్నారా!

‘ప్రజా సమస్యలు, వినతులపై బాధ్యతగా పనిచేయాలి. అలా చేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం’ అని సంయుక్త కలెక్టర్‌ గోపాలకృష్ణ రోణంకి హెచ్చరించారు.

Published : 03 Jul 2024 01:53 IST

వీఆర్వోలు, రెవెన్యూ అధికారులపై జేసీ ఆగ్రహం

గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే జంక్షన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్న జేసీ గోపాలకృష్ణ 

సి.ఎస్‌.పురం, న్యూస్‌టుడే: ‘ప్రజా సమస్యలు, వినతులపై బాధ్యతగా పనిచేయాలి. అలా చేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం’ అని సంయుక్త కలెక్టర్‌ గోపాలకృష్ణ రోణంకి హెచ్చరించారు. బెంగళూరు- కడప, విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, మైదుకూరు- సింగరాయకొండ జాతీయ రహదారుల దరఖాస్తులపై రెవెన్యూ అధికారులతో ఆయన సీఎస్‌పురం తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. కనిగిరి డీఐ హాజరుకాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం రెండు జాతీయ రహదారులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రైతులు ప్రతి సోమవారం ఒంగోలు వచ్చి పరిహారం అందలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందిస్తున్నారు. దరఖాస్తులు పరిష్కరించకుండా ఇప్పటివరకు వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు పడుకున్నారా.. గుడ్లు పెడుతున్నారా అని మండిపడ్డారు. ఆర్డీవో సమావేశాలు పెట్టినా కొందరు వీఆర్వోలు వెళ్లడం లేదంటే వారికి అంతలా కొమ్ములొచ్చాయా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడ వీఆర్వోలు దేశముదురుల్లా తయారయ్యారని వ్యాఖ్యానించారు. రైతులను ఇబ్బంది పెడుతూ జనాలను పీల్చిపిప్పి చేస్తున్నారని.. అందుకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని మండిపడ్డారు. ‘జాతీయ రహదారులపై ముఖ్యమంత్రి నేరుగా అడుగుతున్నారు. ప్రధానమంత్రి వంద రోజుల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఈ పనులున్నాయి. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. జిల్లాలో సి.ఎస్‌.పురం మండలంపై పలువురిలో చెడు అభిప్రాయం ఉందంటూ తహసీల్దార్‌ నాగూల్‌మీరాపై అసహనం వ్యక్తంచేశారు. ముసునూరు వీఆర్వో డి.శ్రీనివాసులును వెంటనే కనిగిరి పంపించాలని ఆర్డీవోని ఆదేశించారు. ప్రభుత్వం కోసం అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. సమీక్షలో కనిగిరి ఆర్డీవో పి.జాన్‌ఇర్విన్, తహసీల్దార్‌ షేక్‌ నాగూల్‌మీరా, ఉప తహసీల్దార్లు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని