logo

వెలిగొండ పూర్తి చేస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం

పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని.. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అన్నారు.

Published : 03 Jul 2024 01:51 IST

నిర్వాసితులతో కలెక్టర్‌ అన్సారియా

 వేములకోట వద్ద గొట్టిపడియ నిర్వాసిత కాలనీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, అధికారులు

మార్కాపురం, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని.. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులను అధికారులతో కలిసి ఆమె మంగళవారం పరిశీలించారు. తొలుత మార్కాపురం మండలం వేములకోట పంచాయతీలోని కోమటికుంట వద్ద గొట్టిపడియ నిర్వాసితులకు ఏర్పాటు చేసిన పునరావాస కాలనీని సందర్శించారు. అనంతరం గొట్టిపడియ ఆనకట్ట వద్ద నిర్మాణంలో ఉన్న వాటర్‌ గ్రిడ్‌ వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి సుంకేసుల ఆనకట్ట వద్దకు చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత పెద్దారవీడు మండలంలోని కలనూతల ముంపు గ్రామానికి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. సహేతుకమైన నష్టపరిహారం అందిస్తే గ్రామాలు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్వాసితులు తెలిపారు. ఈ ప్రభుత్వంలో పూర్తిస్థాయి న్యాయం ఒనగూరుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిర్వాసితుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తామన్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈలోపు నిర్వాసితులకు ప్రభుత్వపరంగా అవసరమైన సేవలందేలా చూస్తామని భరోసా కల్పించారు. అనంతరం ఉప కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని విలేకర్లతో మాట్లాడారు. సాయంత్రం వేళ మార్కాపురం మండలం దరిమడుగులోని ఇడుపూరు-1, ఇడుపూరు-2, పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు గ్రామాల్లో నిర్మిస్తున్న పునరావాస కాలనీలను కలెక్టర్‌ పరిశీలించారు. ఏ పనులు చేశారు.. ఎన్ని భవనాలు పూర్తి చేశారనే విషయాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో ఉప కలెక్టర్‌ రాహుల్‌మీనా, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌ ఝాన్సీలక్ష్మి, మార్కాపురం, కంభం ప్రాజెక్టుల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సత్యనారాయణ, డి.నాగజ్యోతి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మర్దన్‌అలీ, ప్రాజెక్ట్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ అబూల్‌ అలీమ్, డీఎల్‌డీవో సాయికుమార్, తహసీల్దార్‌ రవికుమార్, ఎంపీడీవో చందన, ఇతర అధికారులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని