logo

హవ్వ.. దాతృత్వానికీ మస్కా

దాతల చేతలనూ గత ప్రభుత్వంలోని వైకాపా నేతలు అపహాస్యం చేశారు. మంచి మనసున్న వారి దాతృత్వంతో చెలగాటమాడారు. ఇందుకు మండలంలోని నర్రమారెళ్లలోని ఉదంతమే నిదర్శనం.

Published : 03 Jul 2024 01:49 IST

చేయని పనులకూ వైకాపా నేతల బిల్లులు

నర్రమారెళ్ల వాసుల తాగునీటి సౌకర్యార్థం దాత చెంచు రామయ్య వేయించిన బోరు

పామూరు, న్యూస్‌టుడే: దాతల చేతలనూ గత ప్రభుత్వంలోని వైకాపా నేతలు అపహాస్యం చేశారు. మంచి మనసున్న వారి దాతృత్వంతో చెలగాటమాడారు. ఇందుకు మండలంలోని నర్రమారెళ్లలోని ఉదంతమే నిదర్శనం. ఈ గ్రామంలోని బీసీ కాలనీ వాసులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన గుంటుపల్లి చెంచురామయ్య తెలుసుకున్నారు. తాగునీటి వెతలు తీర్చేందుకు తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. కాలనీకి సమీపంలో సొంత నిధులు రూ. 50 వేలు వెచ్చించి 2019లో బోరు ఏర్పాటు చేయించారు. అనంతరం వైకాపా నాయకులు రంగంలోకి దిగారు. సదరు బోరును దాత అందించిన సొమ్ముతో కాకుండా పంచాయతీ నిధులతో వేయించినట్లు చూపాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అప్పటి అధికార పార్టీ నేతలు అడగడమే తరువాయి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ, పంచాయతీ కార్యదర్శి, ఈవోఆర్డీలు దస్త్రాలకు పరుగులు తీయించారు. నిబంధలనకు విరుద్ధంగా బిల్లు చేసి మంజూరు చేయించారు. అక్రమార్కులకు అనుచిత లబ్ధి చేకూర్చారు. ఈ విషయం ఇటీవల నిర్వహించిన పామూరు మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో వెలుగులోకి వచ్చింది. వైకాపా నాయకుల కక్కుర్తి వ్యవహారాన్ని లక్ష్మీనరసాపురం ఎంపీటీసీ సభ్యుడు బొల్లా నరసింహారావు ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసంహారెడ్డి దృష్టికి తెచ్చారు. దాత వేయించిన బోరుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి ఇతరులకు బిల్లులెలా చెల్లిస్తారని ఆయన అధికారులను ప్రశ్నించారు. నిధులు రికవరీ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఇవే కాకుండా వైకాపా నాయకులు తమ ఇళ్ల వద్ద బోర్లు వేసుకుని ప్రభుత్వం నుంచి బిల్లులు చేసుకున్నట్లు విమర్శలున్నాయి. పామూరు, సి.ఎస్‌.పురం మండలాల్లోని పలు పంచాయతీలు, గ్రామాల్లో రహదారి పనులు చేయకుండానే చేసినట్లు చూపి మండల పరిషత్తు, పంచాయతీ నిధులు బొక్కారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పామూరు ఎంపీడీవో పి.పుట్టారెడ్డి మాట్లాడుతూ.. నర్రమారెళ్లలో దాత వేయించిన బోరుకు ఇతరులు బిల్లులు చేశారనే విషయంపై విచారణ చేయిస్తామన్నారు. ఇంకా ఎక్కడెక్కడ పనులు చేయకుండా బిల్లులు చేశారనే వివరాలతో ఫిర్యాదు చేస్తే విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని