logo

వీరుడికి కన్నీటి వీడ్కోలు

వీరుడికి జన్మనిచ్చిన కాలువపల్లి కన్నీటి సంద్రమైంది..దేశమాత రక్షణలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డను చూసి ఆ పల్లె తల్లడిల్లింది. విషణ్న వదనాలతో కన్నీటి వీడ్కోలు పలికింది.

Published : 03 Jul 2024 01:40 IST

జేసీవో మృతితో తల్లడిల్లిన కాలువపల్లి
అధికారిక లాంఛనాలతో జవాన్‌ అంత్యక్రియలు

వందనం సమర్పిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కంభం (రాచర్ల), న్యూస్‌టుడే : వీరుడికి జన్మనిచ్చిన కాలువపల్లి కన్నీటి సంద్రమైంది..దేశమాత రక్షణలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డను చూసి ఆ పల్లె తల్లడిల్లింది. విషణ్న వదనాలతో కన్నీటి వీడ్కోలు పలికింది.
లద్దాఖ్‌ ప్రాంతంలో సైనిక యుద్ధట్యాంకులో నది దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన జేసీవో ముత్తుముల రామకృష్ణారెడ్డి (47) అంత్యక్రియలు మంగళవారం సొంతూరు రాచర్ల మండలం కాలువపల్లిలో అశ్రు నయనాల నడుమ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. సైనికాధికారులు లెఫ్టినెంట్‌ కల్నల్‌ సందీప్‌యాదవ్, నాయక్‌ సుబేదార్లు శేషురామ్, రంగనాయకులు, నాయక్‌ బి.నరేందర్, సిపాయిలు సాయిప్రశాంత్‌ తదితరులు వీర జవాన్‌పై కప్పిన జాతీయ జెండాను మృతుని భార్య ఉమాదేవికి అందజేస్తున్న క్షణాన..ఆమె, కుమారులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఉంచి  వందనం సమర్పించారు. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకూ అక్కడే ఉన్నారు.

సైనిక వాహనాన్ని అలంకరించి..

మృతదేహాన్ని అలంకరించిన సైనిక వాహనంలో ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. వీర జవాన్‌ కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి వద్ద  కొద్దిసేపు నిలిపారు.  గ్రామంలోని వారి వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకెళ్లారు. మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌మీనా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజని, డీఎస్పీ బాలసుందరరావు, గిద్దలూరు రూరల్‌ సీఐ దాసరి ప్రసాద్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఇంటిలిజెన్స్‌ ఎస్సై రఫీ, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం సైనికాధికారులు గౌరవ సూచకంగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత అంత్యక్రియలు పూర్తిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని