logo

ఈలవేసి.. గోలచేసిన ఏఎస్సై వెంకటేశ్వర్లు సస్పెన్షన్‌

విధి నిర్వహణను మరిచి మద్యం మత్తులో ఈలవేసి, గోలచేసిన ముండ్లమూరు ఏఎస్సై  ఎ.వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్‌ వేటుపడింది.

Published : 03 Jul 2024 01:36 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: విధి నిర్వహణను మరిచి మద్యం మత్తులో ఈలవేసి, గోలచేసిన ముండ్లమూరు ఏఎస్సై  ఎ.వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్‌ వేటుపడింది. ఆయన్ను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముండ్లమూరు మండలం శంకరాపురంలో తెదేపాకు చెందిన రెండు వర్గాలకు చెందిన  వారు అద్దంకి మండలం తిమ్మాయపాలెం పొలాల్లో ఇటీవల దాడులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి పలువురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో  పికెట్‌ ఏర్పాటు చేయగా జూన్‌ 26న ఏఎస్సై వెంకటేశ్వర్లు శంకరాపురం పికెట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అదేరోజు కొందరితో మద్యం తాగడమే కాక ఈల వేసి గోల చేసిన విషయం వైరల్‌ అయ్యింది. దీంతో జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ అతన్ని వీఆర్‌కు పిలిపించారు. దర్శి డీఎస్పీ అశోక్‌వర్థన్‌తో ఈ ఘటనపై విచారణ జరిపించారు. దీనిపై జులై ఒకటో తేదీన ‘ఈనాడు’లో ‘విధులు మరిచి.., ఈలవేసి గోలచేసి’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఏఎస్సైపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆయన్ను విధుల నుంచి తప్పిస్తూ ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని