logo

ప్రియుడితో కుట్రపన్ని.. భర్తను హతమార్చి..

రామాపురంలో రైతు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కుట్రపన్ని భార్యే ఈ కిరాతకానికి ఒడిగట్టినట్లు వారు తెలిపారు.

Published : 03 Jul 2024 01:34 IST

రామాపురం కేసును ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ బాలసుందరావు

కంభం (రాచర్ల), న్యూస్‌టుడే : రామాపురంలో రైతు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కుట్రపన్ని భార్యే ఈ కిరాతకానికి ఒడిగట్టినట్లు వారు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ బాలసుందరరావు కేసు వివరాలు వెల్లడించారు. రాచర్ల మండలం రామాపురంలో గత నెల 29న రైతు అన్నపురెడ్డి చిన్నరంగారెడ్డి (47) హత్యకు గురయ్యారు. దీనిపై మృతుని సోదరి మదిరె రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ దాసరి ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నరంగారెడ్డి, అదే గ్రామానికి చెందిన ఇల్లూరి యేసేబు బాల్య స్నేహితులు. దీంతో మద్యం తాగేందుకు యేసేబు తరచూ చిన్న రంగారెడ్డి ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో చిన్నరంగారెడ్డి మూడో భార్య రాజేశ్వరితో పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ కారణంగా రెండేళ్ల నుంచి భార్యభర్తల నడుమ తరచూ గొడవలు జరుగుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇటీవల చిన్న రంగారెడ్డి, తన సోదరి రమాదేవికి 60 సెంట్ల పొలం రాసి ఇచ్చారు. మిగిలిన పొలాన్ని తన కూతురు పేరుమీద రాయాలని నిందితురాలు రాజేశ్వరి తరచూ అడుగుతున్నా ఆయన కాలయాపన చేస్తుండటంతో గొడవలు తీవ్రమయ్యాయి. దీంతో భర్తను అంతమొందిస్తే వివాహేతర సంబంధానికి అడ్డు తొలగడంతో పాటు, ఆస్తి కూడా వస్తుందని భావించిన భార్య రాజేశ్వరి, ప్రియుడితో కలిసి కుట్ర పన్ని కొంత నగదును ముందస్తుగా  అతనికి అందజేసింది. దీంతో గత నెల 29న భర్తతో కేసు రాజీ చేసుకుని వచ్చింది. అదేరోజు రాత్రి 8 గంటల సమయంలో చిన్న రంగారెడ్డి ఇంటికి వచ్చిన యేసేబు మద్యం తాగుదామని తీసుకెళ్లి అతన్ని గొడ్డలితో నరికి చంపాడు. ఈ మేరకు నిందితులిద్దరిని అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని