logo

సీజ్‌ చేసిన అక్రమ నిర్మాణం ధ్వంసం

గిద్దలూరు కాశిరెడ్డికుంటలో అక్రమ నిర్మాణాన్ని నగర పంచాయతీ అధికారులు సీజ్‌ చేయగా..సోమవారం రాత్రి యంత్రంతో దాన్ని ధ్వంసం చేసిన యజమానితో పాటు సహకరించిన వారిని  అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Published : 03 Jul 2024 01:30 IST

యజమాని తీరుపై అధికారుల ఆగ్రహం
పోలీసుల అదుపులో నిందితులు

సీజ్‌ చేసిన భవనాన్ని ధ్వంసం చేసిన దృశ్యం

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గిద్దలూరు కాశిరెడ్డికుంటలో అక్రమ నిర్మాణాన్ని నగర పంచాయతీ అధికారులు సీజ్‌ చేయగా..సోమవారం రాత్రి యంత్రంతో దాన్ని ధ్వంసం చేసిన యజమానితో పాటు సహకరించిన వారిని  అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాచర్ల మండలం గంగపల్లెకి చెందిన గుత్తేదారుడు మీనిగె శివరంగారెడ్డి గిద్దలూరు నగర పంచాయతీలోని కాశిరెడ్డికుంటకు చెందిన 12 సెంట్ల స్థలంలో కొన్నేళ్ల క్రితం అక్రమ నిర్మాణం చేపట్టారు. దీనిపై గిద్దలూరుకు చెందిన బండారు జనార్దన్‌రెడ్డి పలుమార్లు కలెక్టర్‌ను కలిసి మీనిగె శివరంగారెడ్డిపై చర్యలు తీసుకోవాలని అర్జీలందించారు. ఆ మేరకు గత నెల 28న నగర పంచాయతీ అధికారులు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. అయితే సోమవారం రాత్రి 11 గంటల సమయంలో యజమాని మీనిగె శివరంగారెడ్డి, అతని కుమారుడు సురేష్‌రెడ్డి భారీ యంత్రాన్ని తీసుకొచ్చి సీజ్‌చేసిన భవనాన్ని ధ్వంసం చేశారు. వీధి దీపాలు సైతం ఆపివేసి కూల్చివేతలు చేపడుతున్నారని స్థానికులు గిద్దలూరు కమిషనర్‌ వి.శ్రీనివాసరావు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ఎం.రాజారెడ్డికి సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న కమిషనర్‌ వి.శ్రీనివాసరావు భవనాన్ని దగ్గరుండి కూల్చివేయిస్తున్న గుత్తేదారుడు మీనిగె శివరంగారెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేసి పోలీసులకు సమాచారమందించారు. గిద్దలూరు సీఐ వై.వి.సోమయ్య సిబ్బందితో అక్కడి చేరుకొని మీనిగె శివరంగారెడ్డి, అతని కుమారుడు సురేష్‌రెడ్డి, భవనాన్ని ధ్వంసం చేసిన యంత్రం యజమాని, డ్రైవర్‌ను, అక్కడున్న మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వై.వి.సోమయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని