logo

ఎన్నాళ్లో వేచిన ఉదయం

అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్‌ సిక్స్‌’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Published : 01 Jul 2024 06:29 IST

నేడే పింఛన్ల పండగ... పెంచిన మొత్తం ఏప్రిల్‌ నుంచే వర్తింపు
ఇంటి వద్దే రూ.7 వేల పంపిణీకి ఏర్పాట్లు
న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్‌ సిక్స్‌’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత వైకాపా సర్కారు ఓట్ల కోసం నీచ రాజకీయం చేస్తూ... ఏప్రిల్‌లో సచివాలయాల వద్ద; మే, జూన్‌ నెలల్లో బ్యాంకు ఖాతాలకు జమ చేసి వృద్ధులను నానా ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. మండుటెండలకు విలవిల్లాడి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. సోమవారంతో ఆ ఇబ్బందులకు తెరపడనుంది. పండగ వాతావరణంలో పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.


పక్కా ప్రణాళిక

‘ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం’ కింద జిల్లా వ్యాప్తంగా 2,91,524 మంది లబ్ధిదారులు ఉండగా... వారికి పంపిణీ చేసేందుకు రూ.199.07 కోట్ల నిధులు విడుదలయ్యాయి. జూన్‌ 30 (ఆదివారం) సెలవు కావడంతో రెండు రోజుల ముందుగానే గ్రామ, వార్డు సచివాలయ బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము జమ చేసింది. ఆ మేరకు సచివాలయ సిబ్బంది శనివారమే పింఛను మొత్తం డ్రా చేశారు. సోమవారం ఉదయం 5.30 గంటలకల్లా సిబ్బంది ఆయ సచివాలయాలకు చేరుకుని... ఆరు గంటల నుంచే పంపిణీ ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో వాలంటీర్లతో మూడు రోజుల పాటు పంపిణీ చేసేవారు. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం... అవ్వాతాతల ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒకటో తేదీనే వంద శాతం పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గాల వారీగా ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

డీఆర్డీఏ కార్యాలయం నుంచి పింఛన్ల సామగ్రి తరలిస్తున్న అధికారులు 


మొత్తంగా రూ.7 వేలు...

‘సూపర్‌ సిక్స్‌’లో ఇచ్చిన హామీ మేరకు పింఛను మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. ఏప్రిల్‌ నుంచే దీనిని వర్తింప చేస్తామని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు జులై పింఛను రూ.4 వేలు... ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి రూ.వెయ్యి చొప్పున పెంపు మొత్తం రూ.మూడు వేలు కలిపి... మొత్తంగా రూ.7 వేలు లబ్ధిదారుల ఇళ్ల వద్దే సోమవారం పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, డప్పు కళాకారులు... ఇలా 11 విభాగాల్లోని లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. విభిన్న ప్రతిభావంతులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు; నూరు శాతం దివ్యాంగులైతే రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పింఛను మొత్తం పెంచారు.


తొలి రోజే  లక్ష్యం పూర్తయ్యేలా...

జిల్లాలో 5,602 మంది సచివాలయ ఉద్యోగులు పంపిణీ ప్రక్రియలో పాల్గొంటున్నారు. సరిపడా సిబ్బంది లేనిచోట ఇతర శాఖల ఉద్యోగులను కేటాయించారు. ఒక్కొక్కరికి 50 నుంచి 60 మంది లబ్ధిదారులు ఉండేలా చర్యలు చేపట్టారు. సిబ్బంది సర్దుబాటు బాధ్యతను ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు అప్పగించారు. తొలి రోజే వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలన్న ధ్యేయంతో కార్యాచరణ రూపొందించారు. నగదు అందించాక... ఆ మొత్తం ముట్టినట్లు పింఛనుదారులతో సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు. పింఛను మొత్తంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిన లేఖను అందజేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో పాటు, కూటమి నాయకులు వేడుకలో భాగస్వాములు కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు