logo

ప్రభుత్వ బడికి ఉరి

గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి...

Published : 01 Jul 2024 06:21 IST

అయిదేళ్లలో తగ్గిన పిల్లల సంఖ్య రెండు లక్షలు
వైకాపా సర్కారు తీరుతో కుదేలైన విద్యా వ్యవస్థ
న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... అయిదేళ్ల వ్యవధిలో దాదాపు రెండు లక్షల మంది తగ్గారు.

విలీనంతో పడిపోయిన  ప్రవేశాలు...

గతంలో ప్రతి పల్లెలో ప్రాథమిక; మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత, అయిదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలలు నడిచేవి. గ్రామీణ విద్యార్థులకు ఇబ్బంది ఉండేది కాదు. 3, 4, 5 తరగతుల వారికి కూడా సబ్జెక్టు నిపుణుల బోధన ఉండాలని, ఆంగ్ల విద్య బలోపేతం చేయాలని... వైకాపా ప్రభుత్వం ఈ తరగతులను కిలోమీటరు పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. రహదారుల, చెరువులు, కాలువలు, వంతెనలు అడ్డంగా ఉన్నచోట వీలీనం వద్దన్న నిబంధన ఉన్నా సక్రమంగా అమలు కాలేదు. దూరంగా ఉన్న బడికి చిన్న పిల్లలను పంపలేక తల్లిదండ్రులు ప్రైవేటును ఆశ్రయించారు. దీంతో ఒకటో తరగతిలో ప్రవేశాలు తగ్గాయి. ఆ సాకుతో ఉపాధ్యాయులను కుదించారు. ఇరవై మంది పిల్లలకు ఒకరు చాలన్న నిబంధనతో జిల్లాలో 245 పాఠశాలలు ఏకోపాధ్యాయులకే పరిమితమయ్యాయి. మరోవైపు ఆరో తరగతిలో చేరికలూ పడిపోయాయి. ఏకరూప దుస్తులు, బూట్లు, బ్యాగులు, పుస్తకాలు ఇస్తున్నామని చెప్పినా... ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే వచ్చింది. అయినప్పటికీ దిద్దుబాట చర్యలు తీసుకోలేదు.


  • జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో ఏడాది నుంచే పాఠశాలలకు కష్టకాలం మొదలైంది. అశాస్త్రీయమైన 117 జీవో తెచ్చి... జిల్లాలోని దాదాపు 300 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల పిల్లలను... 230 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆ జీవోతో ప్రాథమిక విద్యకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు మొత్తుకున్నా పాలకులు చెవికెక్కించుకోలేదు. పేద విద్యార్థులకు చదువుకు దూరమవుతున్నా మొండిగా వ్యవహరించారు.

  • ప్రభుత్వం చెప్పిన విధంగా సబ్జెక్టు టీచర్లు పూర్తిస్థాయిలో లేక బోధన కుంటుపడింది. ఉన్నవారికే ఉద్యోగోన్నతులు ఇవ్వడంతో చాలామంది పట్టణాలకు సమీపంలో పోస్టింగులు కోరుకున్నారు. దీంతో పుల్లలచెరువు, యర్రగొండపాలెం, దోర్నాల, అర్థవీడు వంటి మండలాల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. ప్రధానంగా సోషల్, గణితం, ఆంగ్ల ఉపాధ్యాయులు లేక ఉన్నవారితోనే సరిపెట్టుకుంటున్నారు. నాడు-నేడు కింద రూ.లక్షలు వెచ్చించి ప్రాథమిక బడుల్లో నిర్మించిన గదులు నిరుపయోగంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని