logo

పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు

వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్‌ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్‌ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు,

Published : 01 Jul 2024 06:11 IST

ఈ నెలలో పంపిణీ నిలిపివేత  
నేటి నుంచి యధావిధిగా బియ్యం సరఫరా

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్‌ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్‌ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, నాణ్యతను పరిశీలించారు. రేషన్‌ దుకాణాలతోపాటు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం, కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్లల్లో 50 నుంచి 100 గ్రాముల వరకు తగ్గుదల ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయమై జిల్లాలోని అన్ని గోదాముల్లోనూ స్థానిక పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ప్రతి ప్యాకెట్‌లోనూ 5 నుంచి 15 గ్రాముల వరకు తూకం తక్కువ ఉన్నట్లు గుర్తించారు. సదరు నివేదికలను అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు పంపించారు. ఈ మేరకు జులై నెలకు సంబంధించి కార్డుదారులకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశాలందాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో గత నెల వరకు పంచదార కూడా ఇస్తున్నప్పటికీ తూకం తక్కువ కారణంగా తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ నిలిపివేశారు. సదరు ప్యాకెట్లను తూకం ప్రకారం మళ్లీ ప్యాకింగ్‌ చేయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జిల్లా అంతటా సోమవారం నుంచి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ ప్రారంభించనుండగా; కార్డుదారులకు బియ్యం మాత్రమే ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాహనాలు తొలగిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ వాటిపై ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో యథావిధిగా సరఫరా చేయనున్నారు. 

సరఫరాదారులు వైకాపా మద్దతుదారులే..!

రేషన్‌ సరఫరా చేసే గుత్తేదారులు అంతా వైకాపా మద్దతుదారులు కావడం విశేషం. అయిదేళ్లపాటు జిల్లావ్యాప్తంగా అన్ని ఎం.ఎల్‌.ఎస్‌.పాయింట్లకు, ఆ తర్వాత కోటా ప్రకారం అక్కడి నుంచి రేషన్‌ దుకాణాలకు సరకులు పంపిణీ చేశారు. సరకులిచ్చే క్రమంలో గోదాముల వద్ద ఉండే అధికారులు తూకాలు వేసుకుని సరి చూసుకోవాలి. అందుకు విరుద్ధంగా గుత్తేదారుల నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిడితో చూసీచూడనట్లు వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తనిఖీలు ప్రారంభించాక వైకాపా గుత్తేదారుల్లో గుబులు మొదలైంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆందోళన చెందుతున్నారు. 


రెండేళ్లుగా నిలిచిన కందిపప్పు 

ప్రకాశం జిల్లాలో 1392 రేషన్‌ దుకాణాలు ఉండగా, వాటి పరిధిలో 6.70 లక్షల బియ్యం కార్డులున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్‌ దుకాణాల ద్వారా ఇచ్చే సరకులను పెంచుతామని ప్రకటించిన జగన్‌..చివరికి వచ్చే సరికి 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సరకులకే కోత విధించారు. పేద కుటుంబాలకు రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతి నెలా అందించే కందిపప్పును వైకాపా ప్రభుత్వం గత రెండేళ్లుగా అరకొరగానే సరఫరా చేసింది. సార్వత్రిక ఎన్నికలు వచ్చే సమయానికి ఎవరూ పట్టించుకోకపోవడంతో మే, జూన్‌ నెలలో కందిపప్పు పంపిణీ పూర్తిగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ఒంగోలు నగరంతోపాటు, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లోని పేద కుటుంబాలకు రాయితీపై గోధుమ పిండి ఇచ్చేవారు. జూన్‌ నెలలో అది కూడా ఆగిపోయింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు