logo

మృత్యుకుంట మింగేసింది

అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది.

Published : 01 Jul 2024 06:06 IST

అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు..
పిల్లలిద్దరూ వరుసకు అన్నదమ్ములు 

తూర్పు వీరాయపాలెంలోని నీటి కుంట వీరమణికంఠ, రాఘవ (పాతచిత్రాలు)

దర్శి, న్యూస్‌టుడే: అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. చనిపోయిన ఇద్దరు చిన్నారులు వరుసకు అన్నదమ్ములు కావడం గమనార్హం. ఈ సంఘటన దర్శి మండలం తూర్పువీరాయపాలెం ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. సంఘటనలో పులి రాఘవ (12), ధర్నాసి వీరమణికంఠ (10) ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పువీరాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన వెంకటసుబ్బయ్య, వరలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె వెంకట రమణను పొదిలి మండలం వేలూరుకు చెందిన బాలచంద్రుడికిచ్చి వివాహం చేశారు. కూలి పనులు చేసుకుని జీవించే వారికి ముగ్గురు పిల్లలు కాగా, ద్వితీయ కుమారుడు వీరమణికంఠ ఆరో తరగతి చదువుతున్నాడు. 

విలపిస్తున్న బంధువులు, ధైర్యం చెబుతున్న తెదేపా నేత  డా.లలిత్‌సాగర్‌ 

రెండో కుమార్తె లక్ష్మిని అద్దంకి మండలం వెలమూరిపాడుకు చెందిన శ్రీనివాసరావుకిచ్చి పెళ్లి చేశారు. కూలి పనులు చేసుకునే వీరికి ఇద్దరు కుమారులు కాగా, చిన్నవాడైన రాఘవ 6వ తరగతి చదువుతున్నాడు. నెల పొంగళ్లు సమర్పించేందుకు రాఘవ, వీరమణికంఠ వారి వారి తల్లులతో పాటు తూర్పు వీరాయపాలెం వచ్చారు. ఆదివారం ఉదయం అన్నదమ్ములిద్దరూ బహిర్భూమి కోసం కాలనీకి సమీపంలోని వాగు వైపు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అక్కడి నీటి గుంతలో జారిపడి మునిగిపోయారు. వీరితో వచ్చిన మరో బాలుడు వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. హుటాహుటిన వారు అక్కడికి చేరుకుని ఇద్దరు చిన్నారులను గుంత నుంచి వెలుపలికి తీసుకురాగా, అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు మృతితో తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. బాధితులను తెదేపా నాయకులు డా.కడియాల లలిత్‌సాగర్‌ ఓదార్చారు. కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేయడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని