logo

రామాపురంలో రైతు హత్య

గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..

Published : 01 Jul 2024 06:01 IST

గొడ్డలితో నరికి చంపిన దుండగులు
మూడో భార్యతో ఇటీవలే రాజీ

రంగారెడ్డి మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ బాలసుందరరావు

కంభం (రాచర్ల), న్యూస్‌టుడే : గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు.. గ్రామానికి చెందిన అన్నపురెడ్డి చిన్న రంగారెడ్డి (47) రైతు. తనకున్న కొద్దిపాటి పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని ఎస్సీ పాలేనికి వెళ్లే దారిలో మృతదేహం పడివుండగా గుర్తించారు. మృతునికి మూడు పెళ్లిళ్లయ్యాయి. మొదటి వివాహం మేనమామ కూతురు  రేణుకతో అయింది. ఆమె కొంతకాలానికి ఆయన వద్ద నుంచి వెళ్లిపోయింది. వారిద్దరికీ ఓ  కుమార్తె ఉంది. ఆ తర్వాత మరో మహిళను వివాహం చేసుకోగా, ఆమె మృతి చెందింది. 15 ఏళ్ల కిందట మూడో భార్య రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం దంపతులిద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరూ పరస్పరం కేసులు పెట్టుకున్నారు. శనివారం దంపతులిద్దరూ లోక్‌ అదాలత్‌లో పరస్పరం రాజీ పడ్డాక ఇంటికొచ్చారు. వీరిద్దరికీ కూతురు ఉంది. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన చిన్న రంగారెడ్డి ఆచూకీ తెలియరాలేదు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థుడు శ్రీరంగారెడ్డి దారిలో ఓ మృతదేహాన్ని చూసి చిన్న రంగారెడ్డి బంధువులు తెలిపారు. మృతుడి తలపై గొడ్డలితో నరికిన గాయాలు న్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. డాగ్‌ స్వ్కాడ్, క్లూస్‌టీం సభ్యులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సంఘటన స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు పరిశీలించారు. విచారణ జరుగుతోందని, హత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. గిద్దలూరు సీఐ సోమయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


అనుమానాస్పద స్థితిలో కూలీ మృతి

మృతుడు లక్ష్మయ్య (పాత చిత్రం)

కురిచేడు: అనుమానాస్పద స్థితిలో ఓ కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని దేకనకొండ గ్రామ సమీపంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలోని గోపాలపేట మండలంలోని గొల్లగెరి గ్రామానికి చెందిన ఐలవోని లక్ష్మయ్య (64) ఉపాధి నిమిత్తం దర్శి ప్రాంతానికి వచ్చి రైల్వే పనులు చేసేవారు. అయితే నెల క్రితం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం దేకనకొండవాసులు గ్రామ సమీపంలో కుళ్లిన ఓ మృతదేహాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు తెలిపారు. దీంతో ఎస్సై శ్రీకాంత్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి లక్ష్మయ్యగా గుర్తించారు.  చనిపోయి దాదాపు నెల రోజులు కావడంతో శవం పూర్తిగా కుళ్లిపోయింది. మృతుడి బావ మరిది మాదగిరి కురుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు లక్ష్మయ్యకు భార్య చెన్నమ్మ, ముగ్గురు కుమార్తెలున్నారు.


విశ్రాంత సైనికుడి మృతి

కంభం(రాచర్ల) : కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ విశ్రాంత సైనికుడు మృతి చెందారు. ఈ  సంఘటన రాచర్ల మండలం త్రిపురారం క్రాస్‌ రోడ్డు సమీపంలో అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన పేరూరి గుంటయ్య (63) గత కొంతకాలంగా గిద్దలూరు నివాసం ఉంటున్నారు. సొంతూరిలో పొలం పనులు చేసుకొని ద్విచక్ర వాహనంపై గిద్దలూరు వెళ్తుండగా, గిద్దలూరు నుంచి మోటు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దాంతో ఆయనకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య అంకమ్మ, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.


చేపలు పట్టేందుకు వెళ్లి..

ముండ్లమూరు: చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని వేములలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వినుకొండ నాగరాజు(42) మరో ఇద్దరితో కలిసి స్థానిక చెరువులో నేల బావి వద్ద  చేపలు పట్టేందుకు వెళ్లారు. నాగరాజు ప్రమాదవశాతూ బావిలో పడి మునిగిపోయి మృతి చెందారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని