logo

పేదల పొట్టకొట్టి.. ఉపాధిని చెరబట్టి..

అయిదేళ్లలో అన్ని రంగాలనూ పీల్చిపిప్పిచేసిన వైకాపా నాయకులు ఆఖరికి ఉపాధి పథకాన్నీ వదల్లేదు. అందులోనూ దొంగ లెక్కలు చూపి లక్షల రూపాయలు స్వాహా చేసి పేదల పొట్టకొట్టారు

Published : 29 Jun 2024 04:16 IST

యథేచ్ఛగా వైకాపా నేతల దోపిడీ

 సింగరాయకొండ రైల్వేస్టేషన్‌ చెంత మొక్కల్లేవు.. సూచిక బోర్డే మిగిలింది.. 
న్యూస్‌టుడే, సింగరాయకొండ గ్రామీణం : అయిదేళ్లలో అన్ని రంగాలనూ పీల్చిపిప్పిచేసిన వైకాపా నాయకులు ఆఖరికి ఉపాధి పథకాన్నీ వదల్లేదు. అందులోనూ దొంగ లెక్కలు చూపి లక్షల రూపాయలు స్వాహా చేసి పేదల పొట్టకొట్టారు. శుక్రవారం నిర్వహించిన సామాజిక తనిఖీల్లో వారి అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇరుక్కున్న కొంతమంది ఉపాధి సిబ్బంది కూడా ఉన్నతాధికారులకు పెద్దఎత్తున డబ్బులు ముట్టజెప్పి బయట పడే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

గతేడాది సింగరాయకొండలో ఓ వైకాపా నాయకుడు ఉపాధి పనుల ద్వారా లక్షల రూపాయలు స్వాహా చేశాడు. స్థానిక రైల్వేస్టేషన్‌ చెంత ఉన్న ఖాళీ ప్రదేశంలో బ్లాక్‌ ప్లాంటేషన్‌తో ద్వారా పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించినట్లు సుమారు రూ.15 లక్షల నిధులు దారిమళ్లించాడు. ఈ తతంగంలో ఓ ఉపాధి అధికారి ఆయనతో చేతులు కలిపి మొక్కలన్నీ ఉన్నట్లు దస్త్రాల్లో నమోదుచేయడం విశేషం. ఇటీవల సామాజిక తనిఖీల్లో భాగంగా ఆప్రాంతంలో బృందం సభ్యుడు (డీఆర్పీ) తనిఖీ చేపట్టగా మొక్కలేవీ లేక పిచ్చి చెట్లు దర్శనమివ్వడంతో అవాక్కయ్యారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఎంపీడీవో నగేష్‌కుమారి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి సామాజిక తనిఖీ ప్రజావేదికలో వైకాపా నాయకుల, సిబ్బంది అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డ్వామా పీడీ అర్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని దస్త్రాలు పరిశీలించి సిబ్బంది నిధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. 

దస్త్రాల్లో తప్పుడు లెక్కలు..: ఊళ్లపాలెంలోని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మొక్కలు నాటినట్లు దస్త్రాల్లో నమోదు చేశారు. అక్కడా ఎలాంటి మొక్కలు లేకపోవడంతో..ఉపాధి సిబ్బందిని ప్రశ్నించగా వైకాపా ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు నిర్వహించే సమయంలో పాఠశాల సిబ్బంది తొలగించినట్లు సమాధానమిచ్చారని పీడీ అర్జునరావుకు వారు చెప్పారు. ఇలా పొంతనలేని సమాధానాలతో అధికారులు అవాక్కయ్యారు. పంట చెరువుల్లో యంత్రాల ద్వారా గుంతలు తీయించి కూలీలతో పనులు చేయించినట్లు క్షేత్ర సహాయకులు దస్త్రాల్లో నమోదు చేసిన విషయం కూడా బయటపడింది. పాకల, కనుమళ్ల, శానంపూడి, బింగినపల్లి, సోమరాజుపల్లి, పాతసింగరాయకొండ గ్రామాల్లో భారీగా అవకతవకలు పాల్పడ్డారని, సుమారు రూ.2 లక్షలు నిధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు.

జాబ్‌కార్డు మంజూరుకు వసూళ్లు:  పాతసింగరాయకొండలో జాబ్‌కార్డులు మంజూరు చేసేందుకు క్షేత్ర సహాయకుడు సుమారు 150 మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.1400లు వసూలు చేసినట్లు తనిఖీల్లో కూలీలు తెలిపారు. స్థానిక వైకాపా నాయకులతో అంటకాగుతూ కొందరు సిబ్బంది ఈ తతంగాన్ని నడిపినట్లు సమాచారం. మండల పరిధిలో ఉపాధి పనుల్లో తనిఖీ బృందం భారీగా అవినీతి గుర్తిస్తే..అధికారులు రూ.2 లక్షలు మాత్రమే జరిగినట్లు తెలపడం విశేషం. ఈ సందర్భంగా పీడీ అర్జునరావు మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా విజిలెన్సు అధికారి ఝాన్సీరాణి, కొండపి ఏపీడీ వెంకటస్వామి, అంబుడ్స్‌మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవోలు జమీఉల్లా, ఏఈ శ్రీహరి, ఏపీవో సుధాకర్, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని