logo

అయిదేళ్లు.. అభివృద్ధికి మోకాలడ్డు

వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెల ప్రగతి పడకేసింది. పంచాయతీలకు నిధులు కేటాయించలేదు. సరికదా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన వాటినీ విద్యుత్తు బిల్లులకు గత రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది

Published : 29 Jun 2024 04:06 IST

పల్లెలకు చిల్లిగవ్వ ఇవ్వని వైకాపా సర్కారు

ఆర్థిక సంఘం నిధులూ లాక్కున్న పాలకులు
ఫలితంగా మంజూరైన 365 పనుల రద్దు!

వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెల ప్రగతి పడకేసింది. పంచాయతీలకు నిధులు కేటాయించలేదు. సరికదా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన వాటినీ విద్యుత్తు బిల్లులకు గత రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది. దీంతో పంచాయతీల ఖజానా ఎప్పుడూ ఖాళీగా వెక్కిరించేది. చిన్నపాటి పనులకూ చిల్లిగవ్వ ఉండేది కాదు. చేసిన పనులకూ నెలల తరబడి బిల్లుల మంజూరయ్యేవి కాదు. ఫలితంగా ఏదేని పని చేయాలంటే గుత్తేదారులు భయపడేవారు. 2019 నుంచి ఇప్పటి వరకు జిల్లా ప్రజా పరిషత్‌ సాధారణ నిధుల కింద మంజూరైన పనుల్లో 365 నేటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం ఇందుకు నిదర్శనం. వీటిల్లో చాలా వరకు సీసీ రోడ్డు, గ్రావెల్‌ రోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధికి కేటాయించిన పనులే ఉన్నాయి. దీంతో ఈ పనులను శనివారం నిర్వహించనున్న జడ్పీ సర్వసభ్య సమావేశంలో రద్దు చేయనున్నారు. ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు.

 - న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

కట్టిన వాటికీ బిల్లులు లేవు... 

ఉపాధి హామీ నిధులతో జిల్లా వ్యాప్తంగా 591 గ్రామ సచివాలయాల నిర్మాణానికి రూ.226.55 కోట్ల నిధులను వైకాపా ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 422 భవనాలు పూర్తయ్యాయి. మరో 109 పురోగతిలో ఉన్నాయి. కొన్ని చోట్ల పూర్తయినవీ ఇంకా నిరుపయోగంగానే ఉండిపోయాయి. 593 రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి రూ.125.53 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అందులో 410 భవనాలు పూర్తవ్వగా, మరో 74 పురోగతిలో ఉన్నాయి. అలాగే 492 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణాలకు రూ.86.11 కోట్ల మేర నిధులు మంజూరవ్వగా, అందులో 252 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. 228 డిజిటల్‌ గ్రంథాలయాలకుగానూ, రూ.36.48 కోట్లు మంజూరవ్వగా, అందులో ఒక్క భవనం మాత్రమే పూర్తి చేశారు. బిల్లులివ్వరనే భయంతో ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌ల నిర్మాణ పనులు కొన్నిచోట్ల మధ్యలోనే నిలిచాయి. మరికొన్ని చోట్ల బిల్లులు పూర్తిగా రాలేదన్న కారణంగా పంచాయతీలకు అప్పగించలేదు.

సాయం చాలక.. గూడు పూర్తవ్వక... 

జిల్లాకు గృహ నిర్మాణ శాఖ ద్వారా 63,279 పక్కాగృహాలు మంజూరయ్యాయి. అందులో ఇప్పటివరకు 24,038 మాత్రమే పూర్తయ్యాయి. 18,032 గృహాలు నేటికీ ప్రారంభించకపోగా, మిగతావి పలు దశల్లో ఉన్నాయి. అందులోనూ సగానికి పైగా ఇళ్లు అసంపూర్తిగా నిలిచాయి. ప్రభుత్వం అందించే రూ.1.80 లక్షల నగదు ఎటూ చాలకపోవడంతో పేదలు అప్పు చేయలేక మధ్యలోనే నిర్మాణాలు నిలిపివేశారు. మరోపక్క కాలనీల్లో సరియైన మౌలిక వసతులు లేకపోవడంతో పాటు, ఊరికి దూరంగా ఉండటం.. మరికొన్ని చోట్ల శ్మశానం, వాగు పోరంబోకు స్థలాల వెంబడి పట్టాలు ఇవ్వడంతో అక్కడ ఇల్లు కట్టుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కట్టకుంటే పట్టాలు రద్దు చేస్తామంటూ లబ్ధిదారులపై ఒత్తిడి పెట్టినా ఆశించిన మేర పురోగతి లేకపోయింది.  

ఆరు శాఖలపై నేడు సమీక్ష...

 ఒంగోలులోని పాత జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10.30 గంటలకు జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. వ్యవసాయం, విద్య, డీఆర్డీఏ, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్, సాంఘిక సంక్షేమ శాఖలపై సమీక్ష ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్వహిస్తున్న మొదటి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఇది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్యేలందరూ హాజరుకానున్నారు. ప్రస్తుతం జడ్పీ ఖాతాలో సుమారు రూ.4 కోట్ల మేర నిధులు నిల్వ ఉండగా, అందులో అత్యధికంగా సీపీడబ్ల్యూ పథకాల నిర్వహణకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సమావేశం కావడంతో దీర్ఘకాలిక సమస్యలపై చర్చించి శాశ్వత 
పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని