logo

సురేషూ.. నీతులు వల్లించొద్దు

‘విదేశీ విద్య పథకానికి మీ ప్రభుత్వం అంబేడ్కర్‌ పేరు తొలగించినా నువ్వు మాట్లాడలేదు.

Published : 29 Jun 2024 03:56 IST

దొంగే దొంగ అన్నట్లు వైకాపా నేతల తీరు
ప్రభుత్వం ఒక్క పింఛనూ తొలగించదు

సమావేశంలో మంత్రి స్వామి

ప్రసంగిస్తున్న మంత్రి బాలవీరాంజనేయ స్వామి.. వేదికపై తెదేపా నేతలు 

మర్రిపూడి, న్యూస్‌టుడే: ‘విదేశీ విద్య పథకానికి మీ ప్రభుత్వం అంబేడ్కర్‌ పేరు తొలగించినా నువ్వు మాట్లాడలేదు. ఎస్సీ ఎమ్మెల్యేనైన నాపై శాసనసభలోనే దాడి చేసినా., అవమానించినా ఖండించలేదు. ఎస్సీలకు మీ నాయకులు శిరోముండనం చేసినా అదేమని అడగలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించినా నోరు మెదపలేదు. అటువంటిది నువ్వా ఇప్పుడు నీతులు మాట్లాడేది’ అని మాజీ మంత్రి, వైకాపా నాయకుడు ఆదిమూలపు సురేష్‌ను మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. తెదేపా నేతలు, కార్యకర్తలు, మండల వాసులతో ఆయన మర్రిపూడిలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా, విధానాలను ప్రశ్నించినా, అవినీతిపై మాట్లాడినా కేసులు పెట్టారన్నారు. తనపై 11, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై 27 వరకు పోలీసు కేసులను గత వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టించిందని విమర్శించారు. అలాంటిది తాము వైకాపా వర్గీయులపై అక్రమ కేసులు పెడుతున్నామంటూ మాజీ మంత్రి సురేష్‌ ఆరోపణలు చేస్తుండటం సిగ్గుచేటన్నారు. దొంగే దొంగ అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు ఎక్కడా లేవని, ప్రత్యర్థులు రెచ్చగొట్టినా సంయమనం కోల్పోవద్దని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల 1న బకాయిలతో కలిపి సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్‌ నగదు రూ.7,000 ఇళ్ల వద్దే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తాము పింఛన్లు తొలగిస్తామనే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో తెదేపా మండల అధ్యక్షుడు నరసారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసింహారావు, నేతలు వీరనారాయణ, హనుమారెడ్డి, శ్రీనువాసులు, వెంకటరెడ్డి, బంగారయ్య, పెద్దసంఖ్యలో కార్యకర్తలు, మండల ప్రజలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని