logo

వేట గురించి దొంగాట

చీమకుర్తిని ఒంగోలు గ్రామీణ సర్కిల్‌ నుంచి వేరు చేసి అర్బన్‌ పోలీసు స్టేషన్‌గా ఉన్నతీకరించారు. అనంతరం తొలి సీఐ హోదాలో దుర్గాప్రసాద్‌ను నియమించారు.

Published : 29 Jun 2024 03:52 IST

చోరీ కేసుల్లో నిర్లక్ష్యంగా విధులు

 సొత్తు అప్పగింతకు బేరసారాలు
చీమకుర్తి సీఐపై సస్పెన్షన్‌ వేటు

చీమకుర్తిని ఒంగోలు గ్రామీణ సర్కిల్‌ నుంచి వేరు చేసి అర్బన్‌ పోలీసు స్టేషన్‌గా ఉన్నతీకరించారు. అనంతరం తొలి సీఐ హోదాలో దుర్గాప్రసాద్‌ను నియమించారు. విధుల్లో చేరిన కొన్నిరోజుల్లోనే ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక దొంగతనం కేసులో నిందితుడ్ని పదేపదే విడిచిపెట్టడంతో పాటు, భారీగా ముడుపులు దండుకున్నారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. దొంగలను వేటాడి జనం సొత్తుకు భద్రత కల్పించాల్సిన పోలీసు అధికారి ఆ ఊసు మరిచారు. తీరా చోరీ సొత్తు దొరికినా బాధితులకు అప్పగించేందుకు బేరాలకు దిగారు. అటు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యంతో పాటు పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఆయన్ను చుట్టుముట్టాయి. నిందితుల వేట మరి దొంగాట నిజమేనని తెలుసుకున్న అధికారులు చివరికి సదరు సీఐపై వేటు వేశారు.

 - న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

సార్వత్రిక ఎన్నికలకు ముందు చీమకుర్తి పట్టణంలోని ఒక ఇంటిలో భారీ చోరీ చోటుచేసుకుంది. సుమారు 80 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై ఇద్దరు పాత నేరగాళ్లను పోలీసులు అనుమానించారు. వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. తాము నేరం చేయలేదని చెప్పడంతో విడిచి పెట్టారు. సంఘటనా స్థలంలో క్లూస్‌ టీమ్‌ సేకరించిన ఆధారాల్లో పాత నేరస్థుల వేలిముద్రలు లభించాయి. నిందితులను విడిచి పెట్టిన రోజు సాయంత్రానికి ఆ నివేదిక వచ్చింది. అప్పటికే నిందితులను వదిలేసిన పోలీసులు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీమకుర్తి పోలీసులు చెప్పిన సంజాయిషీని అంగీకరించలేదు. నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులు నానాకష్టాలు పడి నిందితుల్ని పట్టుకున్నారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా వెంటనే బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో 80 సవర్ల బంగారం అపహరణకు గురైతే సీఐ దుర్గాప్రసాద్‌ బాధితులపై ఒత్తిడి తెచ్చి 40 సవర్లుగా కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి మాత్రం మొత్తం బంగారం రికవరీ చేశారు. బాధితులకు తిరిగి అప్పగించేందుకు సీఐ దుర్గాప్రసాద్‌ బేరాలకు దిగారు. రూ.మూడు లక్షలు లంచం డిమాండ్‌ చేసి రూ.రెండు లక్షలు వసూలు చేశారనే విమర్శలు వచ్చాయి.

కారిచ్చి బయటికి పంపేశారు...

బంగారం చోరీ కేసులో అరెస్టై బెయిల్‌పై బయటికి వచ్చిన నిందితుడు ఈ నెల 3న చీమకుర్తిలోని ఒక ఇంటిలో మళ్లీ చోరీకి యత్నించాడు. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి డయల్‌-122కు ఫోన్‌ చేశారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వేణుగోపాల్‌రెడ్డి అనే పాత నిందితుడిని, అతని కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. తర్వాత రోజు ఓట్ల లెక్కింపు ఉండటంతో అతన్ని స్టేషన్‌లో ఉంచకుండా కారు అప్పగించి పంపేశారు. 

స్టేషన్‌ నుంచి వెళ్లి.. అద్దంకిలో తెగబడి... 

చీమకుర్తి స్టేషన్‌ నుంచి నిందితుడు బాపట్ల జిల్లా అద్దంకి వెళ్లాడు. అక్కడ ఏకంగా అయిదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. అందులో ఒక న్యాయమూర్తి నివాసం కూడా ఉంది. అనంతరం తిరిగి చీమకుర్తి వచ్చాడు. ఆ క్రమంలో స్థానిక పోలీసు స్టేషన్‌ పరిధిలో అతని కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడే వదిలేసి చోరీ సొత్తుతో పరారయ్యాడు. పోలీసులు సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. చోరీ కేసుల దర్యాప్తు చేపట్టిన బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కారు చీమకుర్తి వెళ్లినట్లు గుర్తించి నేరుగా ఇక్కడికి వచ్చారు. అప్పటికే కారు స్టేషన్‌లో ఉండడంతో అవాక్కయ్యారు. స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించగా అందులో చోరీలకు వినియోగించే పరికరాలున్నట్లు గుర్తించారు. అద్దంకి పోలీసులు ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు తెలిపారు. అక్కడి నుంచి జిల్లా ఎస్పీ సునీల్‌కు సమాచారం అందింది. ఈ విషయంతో పాటు సీఐ దుర్గాప్రసాద్‌పై వచ్చిన పలు అవినీతి, అక్రమాల ఆరోపణలపై ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ విచారణ చేయించారు. సీఐ పదేపదే విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు వెల్లడైంది. దీంతో విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. దీని ఆధారంగా సీఐ దుర్గాప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తూ ఐజీ త్రిపాఠి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని