logo

ఖర్చులయ్యాయి.. చందాలివ్వండి

ఎన్నికల విధుల కోసం వచ్చిన ఎస్సై, సీఐలకు ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది. ఎలాగూ వెళ్తున్నాం కదా అని కొందరు వసూళ్ల పర్వానికి తెర లేపారు.

Published : 29 Jun 2024 03:48 IST

బదిలీకి ముందు ఎస్సై వసూళ్ల పర్వం

డబ్బుల కోసం వ్యాపార సంఘాలకు హుకుం

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల కోసం వచ్చిన ఎస్సై, సీఐలకు ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది. ఎలాగూ వెళ్తున్నాం కదా అని కొందరు వసూళ్ల పర్వానికి తెర లేపారు. ఎన్నికల వేళ ఖర్చులయ్యాయనే పేరుతో వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున దండుకునేందుకు తహతహలాడుతున్నారు. ఈ పరిణామం వై.పాలెం నియోజకవర్గంలోని ఓ కీలక మండలంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘ఎన్నికల సమయంలో నిర్వహణ ఖర్చులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. నా సొంత జేబు నుంచి ఖర్చు చేశాను. అందుకే మీరందరూ నాకు సహకరించి ఒక్కో సంఘం తరఫున రూ.20 వేలైనా ఇవ్వాలి’ అంటూ సదరు ఎస్సై హుకుం జారీ చేయడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నడూ లేని ఈ పరిణామంతో ఏం చేయాలో తెలియక వ్యాపారులు తర్జనభర్జన పడుతున్నారు.

  • రూ.15 వేలకు తగ్గనీయొద్దు...: వివిధ వ్యాపారాలు చేసే పలువురు సంఘాలను ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రధాన పట్టణంలో ఇలాంటివి దాదాపు పదిహేను వరకు ఉన్నాయి. నియోజకవర్గంలో పనిచేసే ఓ ఎస్సై ఆయా సంఘాల అధ్యక్షులను వారం రోజుల క్రితం స్టేషన్‌కు పిలిపించుకున్నారు. ఎన్నికల వేళ అధికారులు, సిబ్బంది భోజనాలు, వాహనాల పెట్రోల్‌కు ఖర్చులయ్యాయని.. ప్రతి సంఘం నుంచి రూ. 15 వేలకు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ నుంచి రూ.15 వేలు, కిరాణా మర్చంట్‌ రూ.15 వేలు, గోల్డ్‌ మర్చంట్‌ రూ.25 వేలు, రెడీమేడ్‌ మర్చంట్‌ రూ.15 వేలు, బియ్యం వ్యాపారుల తరఫున రూ.20 వేలు చొప్పున ముట్టజెప్పినట్లు సమాచారం.
  • ఆఖర్లో అందినకాడికి దండుకోవాలని...: పోలీసు అధికారుల బదిలీలు వచ్చే నెలలో ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆఖర్లో అయినా అందిన కాడికి దండుకోవాలని సదరు ఎస్సై తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగా తనిఖీల పేరుతో రోడ్డు పక్కన తోపుడు బండ్లు, చిరు వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారమంతా సదరు స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ ద్వారా నడిపిస్తున్నారు. మొత్తానికి ఆ యువ వేధింపుల పర్వంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవ్వకుంటే ఏమవుతుందోననే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని