logo

నమ్మినోళ్లే నట్టేట ముంచారు

పశ్చిమ ప్రకాశంలో వారం రోజలుగా ఎవరి నోట విన్నా.. ‘మై క్వీన్‌’ యాప్‌ కథలే వినిపిస్తున్నాయి. ఈ గొలుసుకట్టు దందాలో నష్టపోయిన బాధితులు లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Published : 29 Jun 2024 03:40 IST

యాప్‌పై అవగాహన సదస్సులు
పరిచయాల మాటున పెట్టుబడులు

మై క్వీన్‌ యాప్‌ ప్రొఫైల్‌ 
అర్థవీడు, మార్కాపురం- న్యూస్‌టుడే: పశ్చిమ ప్రకాశంలో వారం రోజలుగా ఎవరి నోట విన్నా.. ‘మై క్వీన్‌’ యాప్‌ కథలే వినిపిస్తున్నాయి. ఈ గొలుసుకట్టు దందాలో నష్టపోయిన బాధితులు లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నగదు పెట్టి ఎలా నష్టపోయిందీ కథలుగా ఇతరులకు చెప్పి లబోదిబోమంటున్నారు. అదే సమయంలో వారి కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టించి లాభాలు గడించిన పెద్దలు దర్జా ఒలకబోస్తున్నారు. అవగాహన సదస్సులంటూ పలువురిని నమ్మించి నట్టేట ముంచి తప్పుకొని తిరుగుతున్నారు. ఇరవై రోజుల క్రితం మార్కాపురం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్‌ మై క్వీన్‌ యాప్‌పై ఏకంగా ప్రెస్‌క్లబ్‌లోనే అవగాహన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో పరిచయమున్న ఓ స్నేహితుడి ద్వారా మై క్వీన్‌ ఆన్‌లైన్‌ యాప్‌ మనకు అందుబాటులోకి వచ్చిందంటూ ఊదరగొట్టారు. తనను నమ్మి పెట్టుబడులు పెట్టాలంటూ ప్రోత్సహించారు. అనతికాలంలోనే లాభాలు పొందుతారంటూ ఊరించారు. ప్రతి రూపాయికి రూ.7 అదనంగా సంపాదించుకోవచ్చంటూ ప్రచారం చేశారు. ఎప్పటికప్పుడు ఆకర్శణీయమైన నగదు ప్రకటనలు కూడా అదనంగా వస్తాయంటూ బ్రోచర్లతో అవగాహన కల్పించారు. ఏజెంట్‌గా చేరి మరికొందరిని చేర్పించడం ద్వారా ఇంకా అదనంగా సంపాదించుకోవచ్చని ఆశలు రేపారు. సమావేశంలోనే కొందరి చరవాణి నంబర్లు తీసుకుని మై క్వీన్‌ పేరుతో అప్పటికప్పుడే వాట్సాప్‌ గ్రూపు రూపొందించారు. అందులో పలువురిని చేర్చి మరిన్ని వివరాలు అందించారు. కంభానికి చెందిన ఇద్దరు, యర్రగొండపాలేనికి చెందిన ఓ వ్యక్తిని ఏజెంట్లుగా నియమించారు. వీరు తొలుత తెలిసిన వాళ్లను సంప్రదించారు. ఆపై వారితో ఇతరులకు వల వేశారు. ఇలా వేల మందిని మై క్వీన్‌ ఖాతాదారులుగా చేర్పించారు. వీరిలో ఎక్కువమంది కంభం, అర్థవీడు, తర్లుపాడు, యర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. తీరా ఇప్పుడు నగదు చెల్లింపులు నిలిచిపోవడంతో వారంతా లబోదిబోమంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సదరు ప్రైవేట్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ మాత్రం రూ.కోటి వరకు దండుకున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని