logo

వైకాపా తానా.. ఖాకీ తందానా

ధికారాన్ని అడ్డుపెట్టుకొని గత అయిదేళ్లలో కొండపి నియోజకవర్గాన్ని వైకాపా నేతలు ఆగమాగం చేశారు.

Published : 28 Jun 2024 04:43 IST

అరాచకంతో అంటకాగిన పోలీసులు
నాటి ప్రతిపక్షానికి అడుగడుగునా ఆంక్షలు
ఎన్టీఆర్, దామచర్ల విగ్రహాల తొలగింపు
టంగుటూరు, న్యూస్‌టుడే

అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత అయిదేళ్లలో కొండపి నియోజకవర్గాన్ని వైకాపా నేతలు ఆగమాగం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారనే కారణంతో అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడ్డారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విధ్వంసం సృష్టించి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన కొందరు పోలీసులు.. అధికార పార్టీ నేతలతో అంటకాగారు. వారు తానా అంటే తాము తందానా అంటూ అడ్డగోలుగా వ్యవహరించారు. నాటి ప్రతిపక్ష నేతలను కట్టడి చేయడమే లక్ష్యంగా అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో సింగరాయకొండ పోలీస్‌ సర్కిల్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న నాటి సీఐ రంగనాథ్, టంగుటూరు ఎస్సై ఖాదర్‌బాషాల ధోరణి మరింత అభ్యంతకరంగా ఉంది. ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి పట్ల వారు వ్యవహరించిన తీరును చూసి జిల్లా వాసులే ముక్కున వేలేసుకున్నారు. వైకాపా నాటి కొండపి సమన్వయకర్తగా పని చేసిన వరికూటి అశోక్‌బాబు తూర్పు నాయుడుపాలెంలోని స్వామి ఇంటి ముట్టడికి చెంబుయాత్ర చేపట్టారు. ప్రతిగా స్వామి తన అనుచరులతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు వర్గాలను అడ్డుకోవాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా వైకాపా కొమ్ము కాశారు. జాతీయ రహదారిపై తెదేపా నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సమయంలో ఏకంగా స్వామి చొక్కా చిరిగిపోయింది. అయినప్పటికీ నిరసన తెలుపుతున్న స్వామిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో డీజే సౌండ్స్‌తో కార్యకర్తలతో రోడ్డెక్కిన వైకాపా నేత వరికూటిని మాత్రం స్వేచ్ఛగా వదిలేశారు. ఈ వ్యవహారంలో తెదేపా కార్యకర్తలపై కేసులు నమోదు చేయగా.. వైకాపా వర్గీయులపై మాత్రం ఎలాంటి చర్యలు లేవు.

చిరిగిన చొక్కాతో నిరసన తెలుపుతున్న నాటి ఎమ్మెల్యే, నేటి మంత్రి స్వామి (పాత చిత్రం)

 సంగమేశ్వరంలో రణరంగం సృష్టించి...: కార్తిక మాసం సందర్భంగా పొన్నలూరు మండలం చెన్నిపాడు వద్దనున్న సంగమేశ్వరం ఆలయ సమీపంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు వన భోజన కార్యక్రమాన్ని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వైకాపా నాటి కొండపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు. ఇక్కడా పోలీసులు వైకాపా పట్ల వీర విధేయతను ప్రదర్శించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలను సంగమేశ్వరం ఆలయం వద్దకు వెళ్లకుండా అడుగడుగునా ఆంక్షలు విధించారు. తెదేపా నేతలు ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక అలంకరణకు ఉపయోగించిన పసుపు వస్త్రాలు, ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను తొలగించారు. ఈ అరాచకంలో అప్పటి కొండపి సీఐ మాతంగి శ్రీనివాస్, సిబ్బంది అత్యుత్సాహం చూపారు. పవిత్ర ఆలయ పరిసరాలను రణరంగంగా మార్చారు.

కీలక కార్యకర్తపై రౌడీషీట్‌...: టంగుటూరు మండలం పొందూరు గ్రామం తెదేపాకు కంచుకోట. ఆ గ్రామానికి చెందిన పమిడి నాగేశ్వరరావు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారు. ఎన్నికల సమయంలో పోలింగ్‌ కేంద్రాల్లో వైకాపా ఏజెంట్ల ఆటలు సాగవని, ఎన్నికల వేళ గ్రామంలో లేకుండా చేసేందుకు అతనిపై ఏకంగా రౌడీషీట్‌ తెరిపించారు వైకాపా నేతలు. ఈ విషయంలో వారు చెప్పినట్లు తలాడించారు అప్పటి సింగరాయకొండ సీఐ దాచేపల్లి రంగనాథ్, ఎస్సై ఖాదర్‌బాషా. ఇవే కాదు.. టంగుటూరు మండలంలో తెదేపా గెలుపొందిన ఏకైక పంచాయతీ కాకుటూరివారిపాలెంలో అభివృద్ధి పనులను అడుగడుగునా నాటి అధికార పార్టీ అడ్డుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని