logo

అభివృద్ధిలో పరుగులు తీయిద్దాం

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించి, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు తీయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా అన్నారు.

Published : 28 Jun 2024 04:41 IST

వెలిగొండ పూర్తి.. మహిళా సాధికారతకు కృషి
బాధ్యతల స్వీకరణ సందర్భంగా కలెక్టర్‌ వెల్లడి

బాధ్యతలు స్వీకరిస్తుస్తున్న అన్సారియా.. చిత్రంలో ఆమె భర్త,
శ్రీకాకుళం కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్, కుటుంబ సభ్యులు, జేసీ

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించి, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు తీయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా అన్నారు. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్‌గా అన్సారియా ఒంగోలు ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రధానంగా ‘మీ కోసం’ అర్జీలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించడానికి ప్రాధాన్యమివ్వనున్నట్లు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. జిల్లాలోని తాగునీటి, ఇతర సమస్యల గురించి క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా అవగాహన పెంచుకుని పరిష్కరించనున్నట్లు వివరించారు. మిగతావి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, ఫోన్, వాట్సాప్‌ సందేశం, మెయిల్‌ ద్వారానైనా సమాచారం అందించొచ్చని సూచించారు. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా బాధ్యతల స్వీకరణ సమయంలో ఆమె భర్త, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్, కుటుంబ సభ్యులు ఉన్నారు.

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు మొక్క అందజేస్తున్న ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌

 జిల్లా అధికారుల అభినందనలు...

నూతన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్, జేసీ గోపాలకృష్ణ, మార్కాపురం ఉప కలెక్టర్‌ రాహుల్‌మీనా, ఒంగోలు, కనిగిరి ఆర్డీవోలు జీవీ.సుబ్బారెడ్డి, జాన్‌ ఇర్విన్‌తో పాటు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్‌లోని పలు విభాగాల పర్యవేక్షకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని