logo

‘ఓ రాణీ’ వసూళ్ల పురాణం

ఆన్‌లైన్‌ మోసాలకు పశ్చిమ ప్రకాశం పుట్టినిల్లుగా మారింది. పదేళ్ల క్రితం హిమ్‌ సంస్థ ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది.

Published : 28 Jun 2024 04:37 IST

రెట్టింపు లాభమంటూ ప్రకటనలు
ఆశతో అధికమొత్తంలో పెట్టుబడులు
చెల్లింపులు నిలవడంతో బాధితుల గగ్గోలు

ఆన్‌లైన్‌ మోసాలకు పశ్చిమ ప్రకాశం పుట్టినిల్లుగా మారింది. పదేళ్ల క్రితం హిమ్‌ సంస్థ ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది. రెండు నెలల క్రితం ఆదాని అనే పేరుతో విస్తృతంగా చలామణి అయిన ఓ చరవాణి యాప్‌ కూడా జనాల జేబులను ఖాళీ చేసింది. ఇప్పుడు ‘నా రాణి’(మై క్వీన్‌) పేరుతో మరొకటి వచ్చింది. పేద, మధ్య తరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని అధిక నగదు ఆశ చూపి నిలువునా మోసగించింది. మార్కాపురం, యర్రగొండపాలెం, కంభం వేదికగా సాగిన ఈ సైబర్‌ మోసం నగదు లావాదేవీలు నిలిచిపోవడంతో తాజాగా వెలుగు చూసింది. 

 న్యూస్‌టుడే, అర్థవీడు, మార్కాపురం

మార్కాపురం వేదికగా మై క్వీన్‌ పేరుతో ఓ చరవాణి యాప్‌ ఇటీవల చలామణిలోకి వచ్చింది. పెట్టుబడికి 7 రెట్లు అధికంగా నగదు తిరిగి ఇస్తామనడం.. ఏరోజుకారోజు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుండటంతో పలువురు ఆశ పడ్డారు. సదరు యాప్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు ఏజెంట్లుగా ఉండటంతో జనంలో నమ్మకం కుదిరింది. యాప్‌లో చేరేందుకు గొలుకట్టుగా వాట్సాప్‌ లింకును ఒకరి నుంచి మరొకరికి పంపాలని నిర్దేశించడంతో అనతికాలంలోనే వేల సంఖ్యలో ఖాతాదారులుగా చేరారు. పెద్దారవీడు, కంభం, అర్థవీడు, యర్రగొండపాలెం, తర్లుపాడు, బేస్తవారపేట మండలాల్లో ఖాతాదారుల సంఖ్య ఎక్కువగా ఉంది.

రోడ్డునపడ్డ  ఖాతాదారులు...

ఎక్కువ మొత్తంలో నగదు వస్తుందనే ఆశతో అర్థవీడు మండలం లోయలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిసిన వారి నుంచి యాప్‌ లింకు తీసుకుని రూ.45,000 చెల్లించారు. ఇందుకు సంబంధించి అతనికి నిర్దేశించిన సమయానికి నగదు జమ కాలేదు. కంభం మండలంలోని ఓ వ్యాపారి రూ.50 వేలు కట్టారు. ప్రకటించిన విధంగా యాప్‌ నుంచి డబ్బు రావడంతో ఆ తర్వాత ఒకేసారి రూ.8 లక్షలు చెల్లించారు. వీటిలో ఒక్క పైసా కూడా తిరిగి రాలేదు. ఓ స్టుడియో యజమాని రూ.40 వేలు చెల్లించారు. పైసా తీసుకోకుండానే యాప్‌ ఆగిపోవడంతో మిన్నకుండిపోయారు. ఇలాంటి బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంది. వీరంతా ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. ఆన్‌లైన్‌ దందాలో చిక్కుకుని డబ్బంతా పోగొట్టుకున్నామంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇదిలాఉంటే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటూ ఆయా గ్రూపుల్లో అడ్మిన్లుగా ఉన్న కొందరు ఇంకా నమ్మించే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.


పెట్టుబడులకు యాప్‌లో కనిపిస్తున్న ఆకర్షణీయ ప్రకటనలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని