logo

కీచక డీఎల్‌పీవోపై వేటు

ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేసిన మార్కాపురం డీఎల్‌పీవో జి.నాగేశ్వరరావును అధికారులు సస్పెండ్‌ చేశారు.

Published : 28 Jun 2024 04:35 IST

లైంగిక వేధింపులకు పాల్పడుతుండటాన్ని తెలుపుతూ ప్రచురితమైన కథనం

ఒంగోలు గ్రామీణం, మార్కాపురం, న్యూస్‌టుడే: ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేసిన మార్కాపురం డీఎల్‌పీవో జి.నాగేశ్వరరావును అధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురంలోని డివిజనల్‌ పంచాయతీ కార్యాలయంలో డీఎల్‌పీవో నాగేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన కార్యాలయంలో పనిచేసే కొందరు మహిళా ఉద్యోగినులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ‘చెప్పిన పని చేయకుంటే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా.. నాకు సహకరించకుంటే డిప్యూటేషన్‌ రద్దు చేయిస్తా.. మార్కాపురంలోని నాస్నేహితుడి లాడ్జికి వస్తావా... పక్కనే ఉన్న పొదిలిలోని లాడ్జికి వస్తావా! కుదరకుంటే కంభంలోని లాడ్జికైనా సరే. నీ ఇష్టం ఎక్కడైనా నిర్ణయించుకో’ అని సదరు అధికారి ఓ మహిళ పట్ల తరచూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపుల కారణంగా అదే కార్యాలయానికి చెందిన సీనియర్‌ సహాయకుడు శ్రీనివాసరావు అప్పటికే సస్పెండ్‌ అయ్యారు. ఈ విషయాలన్నింటినీ తెలుపుతూ ‘లాడ్జికొస్తావా! రద్దు చేయించమంటావా!!’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీంతో పూర్వ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ స్పందించి మహిళా అధికారుల బృందంతో విచారణకు ఆదేశించారు. వారు అన్ని వివరాలు సేకరించి కలెక్టరేట్‌కు నివేదిక అందించారు. ఈ మేరకు సదరు డీఎల్‌పీవో నాగేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దినేష్‌ కుమార్‌ సిఫార్సు చేశారు. ఈ మేరకు డీఎల్‌పీవోను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు త్వరలో ఇన్‌ఛార్జి డీఎల్‌పీవోను నియమించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని