logo

శ్రీకారం చుట్టుకోనుంది పీఎంశ్రీ

పల్లె, పట్టణమనే తేడా లేకుండా విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు నైపుణ్యాన్ని పెంచాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం కేంద్ర ప్రభుత్యం ప్రధానమంత్రి స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) యోజనకు శ్రీకారం చుట్టింది.

Published : 28 Jun 2024 04:31 IST

 న్యూస్‌టుడే, పామూరు

 సి.ఎస్‌.పురంలోని జడ్పీ ఉన్నత పాఠశాల

పల్లె, పట్టణమనే తేడా లేకుండా విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు నైపుణ్యాన్ని పెంచాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం కేంద్ర ప్రభుత్యం ప్రధానమంత్రి స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) యోజనకు శ్రీకారం చుట్టింది. ప్రతిభ, ప్రమాణాలు గల 48 పాఠశాలలను ఈ పథకం అమలుకు జిల్లా వ్యాప్తంగా ఎంపికయ్యాయి. తొలి దశలో పనులు సాగుతున్నాయి. సమగ్రశిక్షా ఇంజినీరింగ్‌ విభాగం వీటిని పర్యవేక్షిస్తోంది. పనులన్నీ పూర్తయితే ప్రయోగశాలలు, స్మార్ట్‌ తరగతులు, గ్రంథాలయాలు, క్రీడా పరికరాలు సమకూరి మిగతా పాఠశాలలకు ఇవి ఆదర్శంగా నిలవనున్నాయి.

  • జాతీయ స్థాయికి నివేదికలు...: తొలిదశలో 41, రెండో దశలో 7 ఉన్నత పాఠశాలలను పీఎంశ్రీ పథకంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేశారు. బేస్తవారపేట, సి.ఎస్‌.పురం, దిరిశవంచ, గిద్దలూరు, కలుజువ్వలపాడు, మహమ్మదాపురం, ముండ్లపాడు, ఓబులక్కపల్లి, వెలిగండ్ల తదితర పాఠశాలలు తొలిదశలో ఎంపికైన వాటిలో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న మేరకు ప్రమాణాల ఆధారంగా జిల్లా స్థాయిలో పరిశీలించి రాఫ్ట్ర స్థాయికి అధికారులు నివేదించారు. అక్కడ కొన్నింటిని నిర్ణయించి జాతీయ స్థాయికి పంపించారు.
  • అటు మైదానాలు.. ఇటు ప్రయోగశాలలు...: తొలిదశలో ఎంపికైన 41 పాఠశాలల్లో వివిధ రకాల సౌకర్యాలు సమకూరనున్నాయి. అందులో అన్ని వసతులున్న 15 చోట్ల రసాయన శాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు. అందుకు ఏపీఈఆర్‌ఎస్‌ గణపవరం, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ కంభం, కురిచేడు, సింగరాయకొండ, అర్థవీడు, దిరిశవంచ, కలుజువ్వలపాడు, ముండ్లపాడు, పీసీపల్లి, రాయవరం, ఉప్పలపాడు, ఇప్పగుంట, కాకర్ల, కామేపల్లి, మర్లపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి. ఒక్కో ప్రయోగశాలకు రూ.15 లక్షల నిధులు కేటాయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూ.2 లక్షల నిధులు విడుదలై పాఠశాలల ఖాతాల్లో జమయ్యాయి. వీటి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రయోగశాల భవనాలతో పాటు క్రీడా మైదానాల అభివృద్ధి, క్రీడా సామగ్రిని 41 పాఠశాలలకు అందించనున్నారు. ఇందుకుగాను ఒక్కో పాఠశాలకు రూ.5 లక్షలు చొప్పున నిధులు విడుదలవుతాయి. ప్రస్తుతం రూ.లక్ష చొప్పున మంజూరయ్యాయి. క్రీడా మైదానాలను తీర్చిదిద్ది క్రీడా సామగ్రి అందిస్తారు. ల్యాబ్‌ల నిర్మాణం పూర్తికాగానే రసాయన, భౌతిక, జీవ శాస్త్రాలకు అవసరమైన ప్రయోగ పరికరాలు సమకూరుస్తారు.

పనులు చురుగ్గా సాగుతున్నాయి...

జిల్లాలో తొలి విడతలో పీఎంశ్రీకి ఎంపికైన 41 పాఠశాలల్లో ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇవి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రయోగశాల భవన నిర్మాణాలు, క్రీడా మైదానాల అభివృద్ధి పనులు ప్రారంభించి చేస్తున్నారు. ప్రయోగశాలలకు అవసరమైన పరికరాలు త్వరలో రానున్నాయి.

 ఎం.రమేష్, ఏఎంవో, సమగ్ర శిక్షా, ఒంగోలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని