logo

రాసలీలల పోలీసు.. ఆఫీసులోనే సరస సల్లాపాలు

అది జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఒక పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం. అధికారుల సౌకర్యార్థం కార్యాలయం పైనే నిర్మించారు ఓ అతిథి గృహం. విధుల్లో భాగంగా ఈ గదిని వినియోగించుకోవాల్సి ఉంది.

Updated : 27 Jun 2024 10:29 IST

ఎక్కడ పనిచేసినా ఆ సీఐది అదే తీరు

అది జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఒక పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం. అధికారుల సౌకర్యార్థం కార్యాలయం పైనే నిర్మించారు ఓ అతిథి గృహం. విధుల్లో భాగంగా ఈ గదిని వినియోగించుకోవాల్సి ఉంది. అందుకు భిన్నంగా తన వ్యక్తిగత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. పవిత్రమైన ప్రభుత్వ కార్యాలయాన్ని అపవిత్ర కార్యకలాపాలకు వేదికంగా మార్చుకున్నారు. పగలూ రాత్రీ తేడా లేకుండా మహిళా సిబ్బంది ఒకరితో సర్కిల్‌ కార్యాలయాన్నే శృంగార కేంద్రంగా మార్చేశారు. ఈ వ్యవహారం రోజురోజుకీ శృతిమించుతుండటంతో ఆ నోటా ఈ నోటా పాకి చివరికి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. 

న్యూస్‌టుడే  ఒంగోలు

గతంలోనూ అంతే...: ఆ సీఐది ఆదినుంచీ అదే వ్యవహార తీరు. పనిచేసిన ప్రతిచోటా వివాహేతర సంబంధాలు కొనసాగించడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. అవి వివాదాస్పదమవుతున్నా, ఉన్నతాధికారులు మందలిస్తున్నా.. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నా.. వైఖరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్నాననే కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎస్సైగా మార్కాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఓ స్టేషన్‌లోనూ పనిచేశారు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఒకరితో వివాహేతర సంబంధం నడిపారు. ఈ విషయమై ఆమె భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి ఎస్పీ అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఒంగోలులోని ఒక స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో ఆయన సీఐగా ఉద్యోగోన్నతి పొందారు.
దర్శిలో ఏకంగా ఇద్దరితో...: ఉద్యోగోన్నతి పొందాక సదరు సీఐ దర్శి సబ్‌ డివిజన్‌ పరిధిలోని సర్కిల్‌కు బదిలీ అయ్యారు. అక్కడా అదేతీరున వ్యవహరించారు. అక్కడ ఏకంగా ఇద్దరు మహిళా సిబ్బంది విషయంలోనూ తన వక్రబుద్ధిని ప్రదర్శించారు. వారిలో ఒక మహిళా సిబ్బంది భర్త ఈ విషయాన్ని గుర్తించి ఆయనతో గొడవకు దిగారు. జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆప్పటి ఎస్పీ సదరు సీఐని జిల్లా కార్యాలయానికి పిలిపించి తీవ్రంగా మందలించారు. అప్పటికీ ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు లేకపోవటం గమనార్హం. అక్కడి నుంచి ఆయన మార్కాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని సర్కిల్‌కు బదిలీపై వెళ్లారు. తన సరస సల్లాపాలకు ఏకంగా సర్కిల్‌ కార్యాలయాన్నే ఇప్పుడు కేంద్రంగా మార్చేసుకున్నారు.

ఆమే కావాలంటూ పట్టు...

మార్కాపురం సబ్‌ డివిజన్‌లోని సర్కిల్‌లో బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే ఆయన తన పరిధిలోని స్టేషన్ల సిబ్బందితో రోల్‌కాల్‌ నిర్వహించారు. ఆ సమయంలో గతంలో తనతో సాన్నిహిత్యం ఉన్న మహిళా సిబ్బంది కనిపించారు. ఆమె అక్కడే సర్కిల్‌ కేంద్రంలోని స్టేషన్‌లో పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. తన కార్యాలయంలో రిసెప్షనిస్టుగా మహిళా సిబ్బంది అవసరమని చెప్పి అప్పటి వరకు అక్కడ పనిచేస్తున్న పురుష కానిస్టేబుల్‌ను తప్పించారు. అతన్ని స్టేషన్‌ విధులకు పంపి సదరు మహిళను తన కార్యాలయానికి రప్పించుకున్నారు. తన కార్యాలయం పైనే ఉన్న అతిథి గృహంలోనే తాను సేదదీరేందుకు అవసరమైన సరంజామా అంతా ఏర్పాటు చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా అక్కడే ఆమెతో కలిసి సరసాలు సాగిస్తున్నారు. సీఐ వ్యవహారం శృతిమించటంతో విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు పిలిచి మందలించారు. సర్కిల్‌ కార్యాలయంలో రిసెస్షనిస్టు బాధ్యతల నుంచి ఆమెను తప్పించి స్టేషన్‌కు పంపారు. దీంతో అప్పటి వరకు సర్కిల్‌కే తెలిసిన విషయం కాస్తా ఇప్పుడు జిల్లా అంతటా పాకింది. పోలీసువర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సదరు సీఐ చెబుతున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై బురద జల్లుతున్నారని.. తాను పనిచేస్తున్న ప్రాంతం నుంచి బదిలీ చేయించేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలపడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు