logo

ఆ తహసీల్దార్లు...భూభకాసురులకు పెద్దన్నలు

జగన్‌ రాజ్యంలో ఊరికొక భూబకాసురుడు తయారయ్యాడు. అధినేత ఆశీస్సులతో జనం భూములను తెగమింగేసి బ్రేవ్‌మన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు స్థలాల స్వాహాయణంలో ఆ పార్టీ నేతలు ఒకరిని మించి మరొకరు పోటీ పడ్డారు.

Updated : 26 Jun 2024 05:30 IST

వైకాపా నేతల సేవలో అప్పటి యంత్రాంగం
అడ్డుకోకుండా ప్రభుత్వ భూముల అప్పగింతల పర్వం
నిబంధనలకు పాతరేసి ఆక్రమణలకు ప్రోత్సాహం
న్యూస్‌టుడే, కనిగిరి

జగన్‌ రాజ్యంలో ఊరికొక భూబకాసురుడు తయారయ్యాడు. అధినేత ఆశీస్సులతో జనం భూములను తెగమింగేసి బ్రేవ్‌మన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు స్థలాల స్వాహాయణంలో ఆ పార్టీ నేతలు ఒకరిని మించి మరొకరు పోటీ పడ్డారు. చట్టాల్లోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుని అతి ఖరీదైన వాటితో పాటు పేదల స్థలాల్లోనూ పాగా వేశారు. వీటన్నింటికీ అప్పటి అధికారులు కొందరు యథాశక్తి కొమ్ము కాశారు. అక్రమార్కులతో అంటకాగుతూ తమవంతు సహకారం అందించారు. జనం సొమ్ముతో జీతాలు తీసుకుంటూ వైకాపా నాయకుల సేవలో తరించారు. ప్రభుత్వ, వాగు పోరంబోకు, పశువుల బీడులు, కొండ పోరంబోకు, రోడ్డు పోరంబోకు భూములను మింగేస్తున్నా.. మిన్నకుండి పోయారు. బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నా పట్టించుకోలేదు. మొత్తంగా కనిగిరి నియోజకవర్గంలో కొన్ని వందల ఎకరాలు వైకాపా నేతల చేతుల్లోకి అక్రమంగా వెళ్లేలా అడ్డదారులు చూపారు. 

తహసీల్దార్‌ సాయంతో మాల్యాద్రి అనే వ్యక్తికి చెందిన ఈ భూమిని వైకాపా నాయకులు ఆక్రమించుకున్నారు...

కనిగిరిని కట్టబెట్టిన పుల్లారావు...

  • కనిగిరి తహసీల్దార్‌గా పుల్లారావు ఎక్కువకాలం పని చేశారు. ఈయన విధులు నిర్వహిస్తున్న సమయంలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. కనిగిరి - కంభం రోడ్డులో ప్రభుత్వం హెలీప్యాడ్‌ స్థలానికి కేటాయించిన నాలుగు ఎకరాల భూములను వైకాపా నాయకులు ఆక్రమించారు. ఏకంగా వెంచర్లు ఏర్పాటు చేసి విక్రయించారు. అయినా సదరు తహసీల్దార్‌ పట్టించుకోలేదు.
  • కనిగిరి పెద్ద చెరువు అలుగు వాగు స్థలం పది ఎకరాలకు పైగా కొందరు ఆక్రమించారు. వీటిని ప్లాట్లుగా ఏర్పాటు చేసి అమ్మకానికి సిద్ధం చేశారు. ఈ విషయం తెలుపుతూ అప్పటి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా సదరు తహసీల్దార్‌ ఉలకలేదు.
  • కనిగిరి పట్టణంలోని కొత్తూరు వద్ద పూర్వకాలం నుంచి ఉన్న వాగును వైకాపాకు చెందిన ఓ సర్పంచి ఆక్రమించి నిర్మాణాలు సాగించినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా అతనితో అంటకాగారు.
  • కనిగిరి మండలం చిన ఇర్లపాడు సమీపంలో అయిదు ఎకరాల అసైన్‌మెంటÆ్ భూమిని, వాగును కొందరు ఆక్రమించి విక్రయానికి ఉంచినా అదేమని ప్రశ్నించలేదు. స్థానికులు ఫిర్యాదు చేసినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
  • కనిగిరి పట్టణంలోని వెన్నెల అపార్ట్‌మెంట్‌ సమీపంలో ఉన్న వాగుపై కొందరు వైకాపా నేతలతో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఆక్రమించారు. రాకపోకలకు అనుకూలంగా ఎలాంటి అనుమతులు లేకుండా సొంతంగా వంతెన కూడా కట్టుకున్నారు. అయినప్పటికీ అప్పట్లో తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పుల్లారావు ఏమాత్రం పట్టించుకోలేదు. రూ. కోట్ల విలువజేసే కొండ వాగును వైకాపా నాయకులు ఆక్రమించి పంచుకున్నా.. వారికే వత్తాసు పలికారు. మాచవరం వద్ద రూ.7 కోట్ల విలువైన అయిదు ఎకరాల ప్రభుత్వ భూమికి దొంగ పట్టాలు సృష్టించి విక్రయస్తున్నా తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు.
  • కనిగిరి మండలం కొత్తపాలెంలో మేకల మాల్యాద్రి అనే గిరిజన కుటుంబానికి చెందిన నాలుగు ఎకరాల భూమిని కొందరు వైకాపా నాయకులు బలవంతంగా లాక్కున్నారు. ఈ విషయమై బాధితుడు పలుమార్లు తహసీల్దార్‌ పుల్లారావుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అక్రమార్కుల తరఫునే మాట్లాడారు. మాల్యాద్రి నేటికీ ఈ భూమి కోసం పోరాడుతూనే ఉన్నారు.
  • కనిగిరి పట్టణానికి చెందిన పాలపర్తి కటాక్షం అనే మహిళకు 2.87 ఎకరాల భూమి చాకిరాల సమీపంలో ఉంది. కొందరు వైకాపా నేతలు దొంగ పట్టాలు సృష్టించి ఆక్రమించినప్పటికీ అధికారులు అడ్డుచెప్పలేదు. ఈ విషయమై బాధిత మహిళ పదులసార్లు అప్పటి తహసీల్దార్‌ పుల్లారావుకు విన్నవించినా వినిపించుకోలేదు.

పామూరు మండలం అయ్యన్నకోటలోని ఈ ప్రభుత్వ భూమిని అప్పటి అధికార పార్టీ నేతలకు అప్పగించారు...

దిలీపుడు.. పాసు పుస్తకాలే ఇచ్చేశారు...

పామూరు మండల తహసీల్దార్‌గా దిలీప్‌ కుమార్‌ పనిచేసిన సమయంలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములను తమపరం చేసుకున్నారు. కాదు కాదు.. సదరు అధికారే అప్పనంగా కట్టబెట్టేలా వ్యవహరించారు. పాబోలువారిపల్లిలో వైకాపా నాయకులు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నా పట్టించుకోలేదు. అయ్యన్నకోటలో ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పటి అధికార పార్టీ నేతలు తెగ మింగినా మిన్నకుండిపోయారు. ఫిర్యాదులు అందినా వారికే మద్దతుగా నిలిచారు. కొన్ని ప్రభుత్వ భూములకు గాను చెన్నైలో ఉంటున్న అయ్యన్నకోటకు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా పట్టాదారు పాసుపుస్తకాలిచ్చేశారు. బలిజపాలెంలో వైకాపా నాయకుడు ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

కనిగిరి మండలం మాచవరం సమీపంలో వైకాపా నాయకులు పాగా వేసిన ప్రభుత్వ భూమి...

ఊళ్లకు ఊళ్లు రాసిచ్చారు...

వెలిగండ్ల మండలం తహసీల్దార్‌లుగా పని చేసిన నరసింహారావు, నాగార్జురెడ్డిలదీ ఇదే పంథా. వీరు విధులు నిర్వహించిన సమయంలోనూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వీరిద్దరు వైకాపా నాయకులతో అంటకాగి విలువైన భూములను కట్టబెట్టేశారు. భూములు ఒకరివైతే మరొకరికి ఆన్‌లైన్‌ చేశారు. పట్టాలు మంజూరు చేసి ఇచ్చేశారు. అప్పటి వైకాపా ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు అనుకూలంగా ఉంటూ ఆయన చెప్పిందే వేదంగా విధులు నిర్వహించారు. వెలిగండ్ల మండలంలోని బొంతగుంట్ల, కంకణపాడు తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వైకాపా నాయకులు ఆక్రమించినా పట్టించుకోలేదు. వారికే కొమ్ము కాసేలా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు