logo

‘చెవి’కి భూములు.. జనానికి పువ్వులు

నాటి అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సాగిల పడ్డారు. ఒంగోలు డిపో పరిధిలో విలువైన స్థలాన్ని వైకాపా నేత చెవిరెడ్డి పుత్రరత్నం మోహిత్‌రెడ్డి కంపెనీకి కట్టబెట్టేశారు. ఈ విషయం బయటకు రాగానే తప్పులను కప్పిపుచ్చుకునే యత్నంలో నిమగ్నమయ్యారు.

Updated : 26 Jun 2024 05:32 IST

అప్పట్లో అక్రమాలకు అండగా నిలిచిన యంత్రాంగం
ఆనక తప్పుకొనేందుకు పారదర్శకత జపం
ఆర్టీసీ స్థలం లీజులో అడ్డగోలు వ్యవహారం
న్యూస్‌టుడే, ఒంగోలు

నాటి అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సాగిల పడ్డారు. ఒంగోలు డిపో పరిధిలో విలువైన స్థలాన్ని వైకాపా నేత చెవిరెడ్డి పుత్రరత్నం మోహిత్‌రెడ్డి కంపెనీకి కట్టబెట్టేశారు. ఈ విషయం బయటకు రాగానే తప్పులను కప్పిపుచ్చుకునే యత్నంలో నిమగ్నమయ్యారు. టెండర్ల ప్రక్రియ మొత్తం పారదర్శకంగానే సాగిందంటూ జనం చెవిలో పువ్వులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారిచ్చిన వివరణలోనే టెండర్ల ప్రక్రియలోని డొల్లతనాన్ని బహిర్గతం చేశారు.

అప్పట్లో అప్పనంగా కట్టబెట్టి...: ఒంగోలు ఆర్టీసీ డిపో పరిధిలోని 1,978 చదరపు గదుల స్థలాన్ని సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి నెలకు రూ.2.31 లక్షల అద్దె ప్రాతిపదికన పదిహేనేళ్లకు లీజుకు ఇచ్చారు. దీన్ని తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. గత ఆధికార పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆర్టీసీ అధికారులు ఆయనకు అనుకూలంగా అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఒంగోలు డిపో పరిధిలో మాత్రమే కాదు, రాష్ట్రంలోని పలు ఆర్టీసీ డిపోల్లోని స్థలాలను మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలోని సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా అత్యంత స్వల్ప ధరకు దక్కించుకోవడం ఇందుకు నిదర్శనం. ఒంగోలులో ఈ తతంగాన్ని జనసేన నేత షేక్‌ రియాజ్‌ బయటపెట్టారు. అధికార తెదేపా వీటిపై దృష్టి సారించింది. దీంతో ఆర్టీసీ అధికారుల్లో అలజడి మొదలైంది. తాము టెండర్ల ప్రక్రియ పారదర్శకంగానే నిర్వహించామంటూ చెప్పుకొస్తున్నారు.

ఆ టెండర్ల రద్దు అనుచిత లబ్ధికేనా..!: ‘ఆర్టీసీ స్థలంలో పుష్ప పాగా’ శీర్షికన ఈ నెల 24న ‘ఈనాడు’ కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఆర్టీసీ ఈడీ, జోన్‌-3 కార్యాలయం నుంచి వివరణ ఇచ్చారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ‘ఆర్టీసీ ఆదాయం పెంపుదల కోసం ఓ.ఎస్‌-15 స్కీమ్‌ కింద స్థలాలను పదిహేనేళ్లకు లీజుకు ఇస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల పరిధిలో 122 ఖాళీ స్థలాలను ఈ పద్ధతిలో ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు. వీటిలో ఒంగోలు డిపో పరిధిలోని 1,978 చదరపు గజాల స్థలం కూడా ఉంది. ఈ స్థలానికి గతేడాది జూన్‌ 8న టెండర్లు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నప్పటికీ వారిద్దరూ ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకోలేదు. దీంతో వారు చెల్లించిన ఎర్లీ మనీ డిపాజిట్‌(ఈఎండీ) జప్తు చేసి సదరు టెండర్లు రద్దు చేశాం’ ఇదీ ఆర్టీసీ అధికారులు ఇచ్చిన వివరణ. ఇదిలా ఉంటే ఆ టెండర్లు వేసిన వ్యక్తుల పేర్లు, వివరాలు పేర్కొనకపోవడం గమనార్హం. ముందు నుంచీ ఆర్టీసీకి సంబంధించిన విలువైన స్థలాలపై కన్నేసిన చెవిరెడ్డి వారిపై ఒత్తిడి తెచ్చి ఒప్పందం కుదుర్చుకోకుండా అడ్డుకున్నారనే అభియోగాలున్నాయి.

రూ. లక్షలు అప్పనంగా వదిలేశారట... : గతేడాది జూన్‌లో టెండర్లు పిలవడం., పోటీదారులు ఒప్పందం చేసుకోకపోవటం వెనుక పెద్ద కథే నడిపినట్లు తెలుస్తోంది. ఇదే స్థలానికి మరోసారి గతేడాది నవంబర్‌ 28న నోటిఫికేషన్‌ జారీ చేశారు. డిసెంబర్‌ 22న టెండర్లు తెరిచారు. హెచ్‌1 బిడ్డర్‌గా ఉన్న ఎం.వి.ఎన్‌.వాసవి అనే మహిళ ఈ ఏడాది జనవరి 11న బిడ్డింగ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారని ఈడీ కార్యాలయం నుంచి వెలువరించిన వివరణలో పేర్కొన్నారు. ఆమె చెల్లించిన ఈఎండీ 5.40 లక్షలను ఆర్టీసీ జప్తు చేసింది. అనంతరం హెచ్‌2 బిడ్డర్‌ అయిన సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో 27వ తేదీన చర్చలు సాగించి నెలకు రూ.2.31 లక్షలు అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ కంపెనీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డికి సంబంధించినది. ఇక్కడే అనేక అనుమానాలకు తావిస్తోంది. జూన్‌లో వేసిన టెండర్లలో ఇద్దరు, నవంబర్‌కి సంబంధించిన వాటిలో ఒకరు ఒప్పందం చేసుకోవడానికి నిరాకరించారు. లక్షల రూపాయల ఈఎండీని ఆర్టీసీకి అప్పనంగా సమర్పించేశారు. దీంతో ఆర్టీసీ అధికారులు సదరు భూమిని చెవిరెడ్డి కుటుంబానికి సంతర్పణ చేశారట.

ఎవరి మెప్పు కోసమో తాపత్రయం...: ఆర్టీసీలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను ఓ.ఎస్‌-15 స్కీము ద్వారా లీజుకు ఇస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో 122 స్థలాలు లీజుకు ఇచ్చారు. వీటిలో ఒంగోలు సహా పలు ఆర్టీసీ డిపోల్లోని స్థలాలను చెవిరెడ్డి కుటుంబానికి చెందిన సీఎంఆర్‌ ఆన్‌ఫ్రా గ్రూపు దక్కించుకుంది. చెవిరెడ్డి అప్పటి వైకాపా ప్రభుత్వంలో అత్యంత కీలక నేత కావడంతో ఆర్టీసీ అధికారులు ఆయన ఆడమన్నట్లు ఆడారనేది సుస్పష్టంగా తెలుస్తూనే ఉంది. పోటీదారులను బెదిరించి పోటీ నుంచి తప్పించి తమకు నచ్చిన ధరలకు అద్దెలు నిర్ణయించుకుని ఆర్టీసీ స్థలాలను స్వాహా చేసినట్లు అర్ధమవుతోంది. తెర వెనుక సాగిన మంత్రాంగం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా.. ఆదాయం కోసం తాము పారదర్శకంగా వ్యవహరించినట్లు ఆర్టీసీ అధికారులు కథలు అల్లేస్తున్నారు. ఇక్కడ ఎవరి ఆదాయం కోసం ఇంతగా తాపత్రయ పడుతున్నారనేది సుస్పష్టం. జనం చెవిలో పువ్వులు ఇలా ఇంకెన్నాళ్లు పెడతారో ఆర్టీసీ అధికారులు అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని