logo

కట్టు దాటి.. కోటలు కట్టి...

సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే చుక్కలు చూపుతారు. దరఖాస్తు చేసుకుంటే నిబంధనలంటూ సవాలక్ష సందేహాలు లేవనెత్తుతారు. అన్నీ ఉన్నా అనుమతులు ఇవ్వడానికి ఇబ్బందులకు గురిచేస్తారు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు.

Published : 26 Jun 2024 01:50 IST

వైకాపా నాయకుల అండదండలు
నిబంధనలకు పాతరేసి నిర్మాణాలు
కిమ్మనని నగర పంచాయతీ అధికారులు
గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే

కొంగళవీడు రహదారిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అపార్ట్‌మెంట్‌

సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే చుక్కలు చూపుతారు. దరఖాస్తు చేసుకుంటే నిబంధనలంటూ సవాలక్ష సందేహాలు లేవనెత్తుతారు. అన్నీ ఉన్నా అనుమతులు ఇవ్వడానికి ఇబ్బందులకు గురిచేస్తారు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు. గత ప్రభుత్వ హయాంలో మాత్రం వైకాపా నాయకుల అండదండలుంటే అవేమీ పట్టించుకోలేదు. మామూళ్లు దండుకుని అక్రమాలకు వంతపాడారు. కట్టు దాటి కోటలు కట్టినా కిమ్మనలేదు. నగర పంచాయతీ ఖజానాకు గండి కొడుతున్నా పట్టించుకోలేదు. అక్రమార్కులు ఏకంగా అమ్మకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు గిద్దలూరు నగర పంచాయతీ అధికారులు.

పేరుకు సాధారణం.. తీరు బహుళం...: గిద్దలూరు నగర పంచాయతీ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని కాశినాయన నగర్‌లో ఓ మహిళ, మరో వ్యక్తితో కలసి సాధారణ నివాస గృహ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. ఆ తర్వాత ఏకంగా బహుళ అంతస్తు భవనం నిర్మించారు. అనుమతులకు విరుద్ధంగా రెండు అంతస్తులు అదనంగా కట్టేశారు. భవనం చుట్టూ ఖాళీ ప్రదేశాన్ని కూడా వదల్లేదు. అయినా నగర పంచాయతీ అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోయారు.

ఖజానాకు గండి...: గిద్దలూరు నగర పంచాయతీ కొంగళవీడు రహదారిలో అయిదు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ నిర్మాణం కోసం కొందరు అనుమతులు పొందారు. అధికారులకు అందించిన ప్రణాళిక ప్రకారం కాకుండా నింబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పూరైన తర్వాత నిర్వాహకులు నగర పంచాయతీ అధికారుల వద్ద ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంది. అలాగే నగర పంచాయతీకి మార్టిగేజ్‌ చేసిన ప్లాట్లను విడిపించుకున్న తర్వాతే విక్రయించాలి. ఇక్కడ అవేమీ లేకుండానే విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నగర పంచాయతీ ఆదాయానికీ గండి కొట్టారు.

ఇల్లంటూ.. వసతి గృహానికి...: గిద్దలూరు నగర పంచాయతీ కొంగళవీడు రహదారి సమీపంలో ఓ మహిళ నివాస గృహం పేరుతో భవన నిర్మాణానికి అనుమతులు పొందారు. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా మరో మూడు అంతస్తులు నిర్మించారు. వీటికి నగర పంచాయతీ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే సదరు భవన యజమానురాలికి వైకాపా నాయకుల అండదండలు ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు చర్యలు మిన్నకుండిపోయారు. సదరు గృహ యజమానురాలు ఆ భవనంలో ఓ ప్రైవేట్‌ పాఠశాల వసతి గృహం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. అయినా అధికారులు అటువైపు కన్నెతి చూడటం లేదు.

ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ప్రణాళికకు భిన్నంగా నిర్మాణం చేపట్టిన బహుళ అంతస్తు భవనం


మాజీ అండ.. ఏమీ చేయకుండా...

గిద్దలూరు - ముండ్లపాడు రహదారిలో ఓ అపార్టమెంట్‌ నిర్వాహకుడిదీ ఇదే తీరు. నిబంధనలకు విరుద్దంగా బహుళ అంతస్తు భవనం కట్టారు. అగ్నిమాపక వాహనం భవనం నలువైపులా తిరిగేలా ఖాళీ స్థలం వదల్లేదు. దీనికితోడు పెంట్‌ హౌస్‌ నిర్మించారు. సదరు భవన నిర్మాణదారుని మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అండదండలున్నాయి. దీంతో నగర పంచాయతీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.


ఉల్లంఘనులకు నోటీసులు...

నిబంధనలు అతిక్రమించి భవన నిర్మాణాలు చేపట్టిన యజమానులకు నోటీసులు అందజేశాం. కొంగళవీడు రహదారిలోని, ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని గృహ నిర్మాణదారులకు ఇప్పటికే రెండు నోటీసులిచ్చాం. వారిపై కోర్టులో ఛార్జీషీట్‌ వేస్తాం. నగర పంచాయతీకి మార్ట్‌గేజ్‌ చేసిన ప్లాట్లు విక్రయించినా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం కుదరదు. బహుళ అంతస్తులో ప్లాట్లు కొనుగోలు చేసేవారు నగర పంచాయతీకి ఏ ప్లాట్లు మార్ట్‌గేజ్‌ చేశారనేది పరిశీలించుకోవాలి.

రాజారెడ్డి, ఇన్‌ఛార్జి పట్టణ ప్రణాళికా విభాగం అధికారి, గిద్దలూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని