logo

కూలిన అహంకారం

అక్రమానికి మాజీ మంత్రి సహకారంఫిర్యాదు చేసిన వారి పైనే నాడు దౌర్జన్యంటంగుటూరు, న్యూస్‌టుడేఇళ్ల మధ్య అక్రమంగా నిర్మించిన పొగాకు బ్యారన్‌ను జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యంఅధికారం చేతిలో ఉంటే అనుమతులతో పనేముందని వైకాపా నాయకులు అహంకారం చూపారు. అధికారులు కూడా వారికి వంత పాడారు. నిబంధనలకు విరుద్దంగా ఇళ్ల మధ్య ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన కట్టడాల పైనా కిమ్మనలేదు.

Published : 26 Jun 2024 01:46 IST

అక్రమానికి మాజీ మంత్రి సహకారం
ఫిర్యాదు చేసిన వారి పైనే నాడు దౌర్జన్యం
టంగుటూరు, న్యూస్‌టుడే

ఇళ్ల మధ్య అక్రమంగా నిర్మించిన పొగాకు బ్యారన్‌ను జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం

అధికారం చేతిలో ఉంటే అనుమతులతో పనేముందని వైకాపా నాయకులు అహంకారం చూపారు. అధికారులు కూడా వారికి వంత పాడారు. నిబంధనలకు విరుద్దంగా ఇళ్ల మధ్య ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన కట్టడాల పైనా కిమ్మనలేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సరికదా బాధితుల పైనే తిరిగి తమ ప్రతాపం చూపారు. మాజీ మంత్రి కొమ్ము అండతో మరింత రెచ్చిపోయారు. అక్రమానికి కొమ్ము కాశారు. ఏకంగా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి బెదిరింపులకు దిగారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమితో పరిస్థితులు మారిపోయాయి. అక్రమ కట్టడంపై పంచాయతీ అధికారులు కొరడా ఝుళిపించారు. వైకాపా నేతల అహంకారాన్ని జేసీబీతో కూల్చి వేశారు.

ఇచ్చిన నోటీసుల చించివేత...

వైకాపా అధికారంలో ఉండగా మార్టూరి వెంకటరావు అనే వ్యక్తి టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంలో నివాసాల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పొగాకు బ్యారన్‌ల నిర్మాణం చేపట్టారు. ఆవాసాల మధ్య పొగాకు క్యూరింగ్‌ చేసే బ్యారన్ల నిర్మాణంపై కాలనీ వాసులు ప్రశ్నించారు. గ్రామ సర్పంచి సహకారంతో కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈవోఆర్డీ సాంబయ్య అక్రమ కట్టడమంటూ నిర్మాణానికి నోటీసులు కూడా అంటించారు. అయినా అక్రమార్కుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిర్మాణాలను కొనసాగించారు. అధికారులను లెక్క చేయకుండా వారిచ్చిన నోటీసులను చించి వేసి బ్యారన్‌లను పూర్తి చేశారు.


సురేష్‌ అండతో చెలగాటం...

నివాసాల మధ్య నిర్మాణాలపై కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఇక్కడే నాటి మంత్రి ఆదిమూలపు సురేష్‌ రంగంలోకి దిగి అక్రమానికి అండగా నిలిచారు. దీంతో మండల, జిల్లా అధికారులు ఏం చేయలేక మిన్నకుండిపోయారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఆ గ్రామ సర్పంచి కుమారులు, ఈవోఆర్డీ సాంబయ్యపై అప్పటి ఎస్సై నాగేశ్వరరావు అనుచితంగా ప్రవర్తించారు. తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. అక్రమార్కులపై కేసు నమోదు చేయకపోగా.. సర్పంచి కుమారులపై బెదిరింపులకు దిగారు. వారి పైనే అక్రమంగా కేసు బనాయించేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. లక్ష నగదు లంచంగా ఇవ్వాలని బేరసారాలకు దిగారు. ఈ విషయంలో ఆయన ఏకంగా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక కాకుటూరివారిపాలెం కాలనీ వాసుల విన్నపం మేరకు గ్రామసభ నిర్వహించారు. అక్రమ బ్యారన్‌ల కూల్చివేతకు అందులో అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం మూడుసార్లు అక్రమార్కులకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి సదరు బ్యారన్‌లను పోలీసుల పహారా మధ్య జేసీబీతో మంగళవారం కూల్చివేయించారు. ఈ సమయంలోనూ గ్రామ కార్యదర్శి బాషాపై సదరు అక్రమ నిర్మాణదారుడు మార్టూరి వెంకటరావు తన అహంకారాన్ని ప్రదర్శించారు. దుర్భాషలాడుతూ అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. విధులకు ఆటంకం కలిగించడంపై ఆయన టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని